కరోనా (కోవిడ్ 19) కోరలు చాస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన పేషంట్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మెగాస్టార్ చిరు కోడలు, రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేష్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్పర్సన్ ఉపాసన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కరోనా వచ్చిన తర్వాత వైద్యం తీసుకోవడం కంటే…అది రాకుండా అప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఉపాసన స్పందిస్తూ కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని కోరారు. కరోనా వ్యాధి లక్షణాలపై ఆమె అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె ఎందో బాధ్యతాయుతంగా తెలియజేశారు.
ఉపాసన చెప్పిన జాగ్రత్తలు
– జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి ఉంటే కరోనా సోకినట్లు భావించాలి.
– ఈ వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి మందు లేదు. మందులు వాడితే సరిపోతుందని భ్రమ పడకండి. వెంటనే ఆస్పత్రికి వెళ్లండి
– చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మాస్కులు తప్పని సరిగా ధరించాలి.
– మాంసం తినడం వల్ల కరోనా వైరస్ సోకదు. మాంసాన్ని బాగా ఉడికించి తింటే సమస్య తలెత్తదు.
– పిల్లలకు లేదా పెద్ద వారికి కానీ దగ్గు, జ్వరం ఉంటే బయటకు వెళ్లనీయవద్దు.
ఇవే కాకుండా మరిన్ని చైతన్యపరిచే సూచనలు, సలహాలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఇచ్చారు. ఉపాసన మాటలను ముద్దుగా, బుద్ధిగా విని ఆచరిస్తే కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యమంటారు.
ఎవరికి వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యతను తీసుకోవాలి. అంతే తప్ప ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే నిర్లక్ష్య ధోరణిలో ఉంటే మాత్రం నష్టపోతామని గ్రహించాలి.