టీడీపీ ‘బీసీ సినిమా’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ఏడుపు చూస్తుంటే…‘మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్టు’ అనే సామెత గుర్తుకొస్తోంది. ఏపీ స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లతో ముందుకెళుతున్న జగన్ సర్కార్‌పై టీడీపీ న్యాయస్థానంలో పోరు చేసింది. న్యాయస్థానంలో టీడీపీ గెలవగలిగింది కానీ, బీసీల హక్కులను కాలరాసింది.
ప్రతిపక్ష టీడీపీ పుణ్యమా అని బీసీలు బాగా నష్టపోనున్నారు. హైకోర్టు తీర్పుతో బీసీలు 9.85 శాతం మేర రిజర్వేషన్లు నష్టపోతున్నారు. దీంతో నాలుగు జెడ్పీ చైర్మన్ పదవుల్లో ఒకటి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే 65 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, 65 జెడ్పీటీసీ పదవులతో పాటు సర్పంచి పదవులు, వార్డు సభ్యుల పదవులతో కలిపి మొత్తంగా 15,000కు పైగా పదవులు బీసీల చేజారాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో తమకు అండగా నిలబడకుండా, వైసీపీ అధినేత జగన్‌కు మద్దతు పలికారనే కారణంగా బీసీలపై టీడీపీ అక్కసు పెంచుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రతీకారంగానే బీసీల రిజర్వేషన్లపై కోర్టును ఆశ్రయించి…అక్కడ అడ్డుకట్ట వేయగలిగిందని పలువురు బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మొత్తంగా 58.95 శాతం రిజర్వేషన్ల అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ టీడీపీ కోర్టుకు వెళ్లి మోకాలొడ్డింది. రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయని కోర్టుకు వెళ్లింది టీడీపీ నాయకుడు బిర్రు ప్రతాప్‌రెడ్డి అని బహిరంగ రహస్యమే. ఈయన్ను ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్(ఏపీఎస్‌ఈజీసీ) సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9న చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవం ఇలా ఉంటే, తమపై బీసీల వ్యతిరేకతను అధికార వైసీపీపై మళ్లించడానికి టీడీపీ కుటిల యత్నాలు చేస్తోంది. చంద్రబాబు మొదలుకుని ఆ పార్టీలోని బీసీ నేతలంతా రంగంలోకి దిగి జగన్ సర్కార్‌పై విమర్శలు మొదలు పెట్టారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కోత పడకుండా చూడాల్సిన బాధ్యత జగన్ సర్కార్‌దే అని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోరాడు. న్యాయస్థాన తీర్పులను చూపించి బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తే ప్రతిఘటిస్తామని కూడా ఆయన హెచ్చరించడం గమనార్హం.
బీసీల రిజర్వేషన్లపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే బీసీలకు ద్రోహం చేయడమేనని మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ అన్నాడు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే టీడీపీ కూడా ఇంప్లీడ్ అవడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నాడు. బీసీ రిజర్వేషన్లపై రెడ్డి సంఘంతో పిటిషన్ వేయించడంతోనే జగన్ ఎంత కక్ష పెట్టుకున్నారో అర్థమవుతోందని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు.
తమ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గ నేతతో కోర్టులో కేసు వేయించి, బీసీల రిజర్వేషన్లలో కోతకు కారణమైన వాళ్లే…మళ్లీ ఇప్పుడు జగన్ సర్కార్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. అయితే బీసీ రిజర్వేషన్లపై కోర్టును ఆశ్రయించిన బిర్రు ప్రతాప్‌రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన పచ్చి టీడీపీ నేత అని ఆధారాలతో సహా బయటపడడంతో…ఆ పార్టీ నేతలు ఎన్ని మాట్లాడినా జనాన్ని నమ్మించలేక పోతున్నారు.
సహజంగా నిజాలు మాట్లాడే అలవాటు లేని చంద్రబాబు నైజం గురించి ఏపీ ప్రజలకు ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. అందుకే బీసీల రిజర్వేషన్లపై టీడీపీ ‘బీసీ సినిమా’ ఆడడం లేదు. టీడీపీ బీసీ నేతల మాటలకు చేతలకు పొంతన లేకపోవడంతో…ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చెప్పక తప్పదు.