ప్రపంచాన్ని వణికిస్తున్న ‘కరోనా’ తిరుపతిని కూడా భయపెడుతోంది. ముఖ్యంగా చైనాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండటం, అక్కడి నుంచి 46 దేశాలకు విస్తరించిన విషయాలు మీడియా ద్వారా తెలుసుకుంటున్న తెలుగువాళ్లకు…తాజాగా హైదరాబాద్‌లో ఒక కరోనా కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. దీంతో తిరుపతిని కరోనా వైరస్ ఎక్కడ తాకుతుందోననే ఆందోళన స్థానికుల్లో లేకపోలేదు.
కరోనా లక్షణాలున్నాయనే అనుమానంతో తైవాన్ వాసిని తిరుపతి రుయాలో రెండు రోజుల క్రితం అడ్మిట్ చేశారు. అతని రక్త నమూనాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రుయా వైద్యులు పంపారు. అయితే తైవాన్ వాసికి కరోనా నెగిటివ్ అని రావడంతో రుయా వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం అతన్ని డిశ్చార్జి చేశారు.
అయితే నిత్యం వేలాది మంది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. వీరిలో ఎవరెవరు ఏఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో, అక్కడి వాతావరణ పరిస్థితులు ఏంటో తెలియని స్థితి. అందులోనూ ఇప్పటికే మనదేశంలో రెండు కరోనా కేసులు నమోదు కావడం, అందులోనూ ఒకటి హైదరాబాద్‌లో రిజిస్టర్ కావడంతో తెలుగు సమాజం భయాందోళనకు గురవుతోంది.
కరోనా వైరస్ ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ , ఎవరి నుంచి ముంచుకొస్తుందోననే భయం తిరుపతి, తిరుమల వాసులను వెంటాడుతోంది. అందుకే ఇళ్లలో నుంచి బయటికి వెళ్లేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అందులోనూ మాస్క్‌లు ధరించే అలవాటు జనానికి పెద్ద లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ గురించి అవగాహన ఉన్న వాళ్లు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, తీసుకోని వాళ్ల గురించి ఎక్కువ ఆలోచించాల్సి వస్తోంది. ఏది ఏమైనా కరోనా భయం మాత్రం ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి, తిరుమల వాసులను వెంటాడుతోందనడంలో అతిశయోక్తి లేదు.