'మీ టూ' ఉద్యమం వచ్చాకా సినీ పరిశ్రమలో మగాళ్ల పరిస్థితి మారిపోయిందని అంటోంది బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్. ఇది వరకటిలా పరిస్థితులు లేవని, మగాళ్లు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. ఆ జాగ్రత్తలు ఎవరి విషయంలోనో, ఎందుకో వేరే చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిలతోనూ, హీరోయిన్లతోనూ హీరోలు-దర్శకులు- నిర్మాతల రూపాల్లోని మగాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోందని కాజోల్ చెబుతోంది.
మీ టూ ఉద్యమంలో కొంతమంది ప్రముఖులు వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నానా పటేకర్ తో సహా బాలీవుడ్ ప్రముఖులే మీ టూ ట్యాగ్ లతో ఇబ్బంది పడ్డారు. చివరకు ఆ వివాదాలు ఏవీ ఒక కొలిక్కి రాలేదు. కేవలం ఎంజే అక్బర్ కేంద్రమంత్రి పదవి కోల్పోవడం ఒక్కటే పెద్ద పరిణామం. అంతకు మించి ఎవరూ మరీ ఇబ్బందులు పడ్డది లేదు. అయినా ఇండస్ట్రీకి మీ టూ అనే భయం ఒకటి ఉందన్నట్టుగా కాజోల్ స్పందించింది.
ఇప్పుడు ఏదో వెకిలి వేషాలు వేసినా, అవకాశాల కోసం, పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి సదరు హీరోయిన్లు కామ్ గా ఉన్నా, ముందు ముందు ఎప్పుడు ఏం మాట్లాడతారో చెప్పలేని పరిస్థితే ఉండవచ్చు. అవకాశాల కోసం, కెరీర్ కోసం ప్రస్తుతానికి కామ్ గా ఉండి, ముందు ముందు ఏదైనా మాట్లాడినా.. అప్పుడు సదరు మగాళ్లే సమాధానం చెప్పుకోవాల్సి రావొచ్చు!
అంతా బాగుంటే ఇబ్బంది లేదు, తేడా వచ్చినప్పుడే కథ మొత్తం తేడా అయిపోతుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ మగాళ్లు గ్రహించినట్టుగా ఉన్నారని, అమ్మాయిలతో వ్యవహరించే విషయాల్లో ఒకటికి నాలుగైదు అడుగులు వెనక్కు వేస్తూ ఉన్నారని, మీ టూ తో ఇండస్ట్రీలో ఈ మార్పు వచ్చిందని కాజోల్ అంటోంది. సీనియర్ నటి కమ్ స్టార్ హీరో భార్య చెబుతోంది కాబట్టి.. నిజమేనేమో!