హైకోర్టు 59.85 శాతం రిజర్వేషన్లను కొట్టివేసిన తర్వాత.. రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలూ బ్లేమ్ గేమ్ ప్రారంభించాయి. రెండు పార్టీలూ పరస్పరం ఒకరిమీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. హైకోర్టులో కేసు వేసినది మీ పార్టీ వారంటే మీ పార్టీ వారని నిందించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ నెలాఖరులోగా హైకోర్టు సూచనల ప్రకారం.. 50 శాతం దాటని రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికాబోతున్నాయి. పరోక్షంగా ఈ విషయం తెలుగుదేశం పార్టీకి పాలకపక్షంపై నిందలు వేయడానికి లాభిస్తోంది.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు ఉండేలీ జీవో తెచ్చింది. అయితే హైకోర్టులో దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించి జీవోను కొట్టేశారు. జగన్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో తీసుకున్నంత శ్రద్ధ, చేసినంత న్యాయం చంద్రబాబు తన హయాంలో ఎన్నడూ చేయలేదు గానీ.. జగన్ ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకోవడంతో మురిసిపోతున్నారు. జగన్ ను నిందించడానికి సాహసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.
పైగా, వైకాపా ప్రభుత్వం ఈ జీవో తీసుకురాగా.. కోర్టులో పిటిషన్లు వేసిన వారు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ వారే..అని చంద్రబాబు అంటున్నారు. ఇటు జీవో ఇచ్చి, అటు దానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయించారనేది ఆయన ఆరోపణ. అదే సమయంలో తెలుగుదేశానికి చెందిన వారే పిటిషన్లు వేశారంటూ.. వైకాపా నాయకులు ఆధారాలు చూపుతున్నారు.
అయితే ప్రజలు మాత్రం.. పిటిషన్ ఎవరు వేశారనేది కాదన్నయ్య.. బీసీలకు రిజర్వేషన్ల పట్ల ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారనేదే ముఖ్యం అని అనుకుంటున్నారు. ఎన్నికలు తక్షణం నిర్వహించాల్సిన గడువు తేదీ దగ్గరపడిన తర్వాత.. హైకోర్టు తీర్పులు వెలువరించడం జగన్ ప్రభుత్వాన్ని గత్యంతరం లేని స్థితిలోకి నెట్టేసింది. ఈ తీర్పు ఓ కాస్త ముందుగా వచ్చి ఉంటే గనుక.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండేది. ఇప్పుడంత సమయం లేదు. ఈ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు పూర్తి కావాలి. అందుకే జగన్ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లతోనే ముందుకెళుతోంది. అయితే తన హయాంలో అసలేమీ చేయని చంద్రబాబు.. కేవలం టెక్నికల్ ఇబ్బంది వల్ల ఆగిన జగన్ కృషిని తప్పుపట్టడం సిగ్గు చేటు అని పలువురు విమర్శిస్తున్నారు.