టీడీపీలోనే ఉన్నానని చెబుతారు. క్యాడర్ ను మాత్రం వైసీపీకి తరలిస్తారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదంటారు. కార్యకర్తల్ని మాత్రం కండువా మార్చుకోమని ప్రోత్సహిస్తారు. ఇది మామూలు రాజకీయం కాదు. గంటా మార్క్ రాజకీయం. ప్రస్తుతం విశాఖలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
కొన్ని రోజుల కిందట బీజేపీకి చెందిన కార్యకర్తల్ని, ఛోటామోటా నేతల్ని టీడీపీలో చేర్చుకున్నారు గంటా శ్రీనివాసరావు. ఆ ఫొటోల్ని కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. ఇది చూసి గంటాను టీడీపీకి వీరవిధేయుడు అనుకున్నారంతా. కట్ చేస్తే 2 వారాల్లోనే సీన్ మారిపోయింది.
టీడీపీలో కొత్తగా చేరిన బీజేపీ క్యాడర్ తో పాటు.. అప్పటివరకు గంటాతో ఉన్న తెలుగు తమ్ముళ్లు కూడా జెండా ఎత్తేశారు. కండువా మార్చేశారు. అంతా కలిసి మూకుమ్మడిగా వైసీపీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి జగన్ పాలన నచ్చి తామంతా పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నామని వాళ్లు చెబుతున్నప్పటికీ.. అందరి కళ్లు గంటాపై పడ్డాయి. అన్ని వేళ్లు గంటానే చూపిస్తున్నాయి. ఆయన ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుందనేది అందరి అనుమానం.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో వైసీపీకి ఈ చేరికలు కచ్చితంగా లాభాన్ని చేకూరుస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య లోకల్ ఎలక్షన్లలో నెగ్గుకురావాలంటే, క్షేత్రస్థాయి నుంచి ఇలాంటి చేరికలు చాలా అవసరం. అయితే ఇదంతా తెరవెనక నుంచి గంటానే చేయిస్తున్నారంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.
ఎన్నికల ప్రక్రియ ముగిసి, జగన్ సీఎంగా అధికారం అందుకున్న మరుసటి రోజు నుంచి వైసీపీలోకి రావాలని గంటా ప్రయత్నిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. అయితే జగన్ పెట్టిన కఠినమైన కండషన్ల వల్ల, అప్పటికే పార్టీలో ఉన్న అవంతి లాంటి నేతల వల్ల గంటాకు లైన్ క్లియర్ అవ్వలేదు. దీనికితోడు విశాఖ భూ కుంభకోణం ఆరోపణలు గంటాపై బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీలో చేరడం ఒక్కటే గంటా ముందున్న మార్గం, లక్ష్యం కూడా. అందుకోసమే ఆయన, జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఇలా క్యాడర్ ను వైసీపీలోకి తరలిస్తున్నారనే వాదన ఉంది. అదే కనుక నిజమైతే పార్టీకి, జగన్ ఇమేజ్ కు అది మంచిది కాదు. విశాఖలో జరుగుతున్న సమీకరణాల్ని, ప్రతిరోజూ వందల్లో జరుగుతున్న చేరికల్ని ముఖ్యమంత్రి ఓ కంట కనిబెడితే మంచిది.