టీడీపీలో బాలయ్యది ఎప్పుడూ బ్యాక్ బెంచీనే. బావ తానా అంటే తందానా అనడానికి మాత్రమే బాలయ్య. సినిమాల్లో రౌద్రంగా డైలాగులు చెప్పే బాలయ్య, రాజకీయాల్లో మాత్రం డెడ్ కూల్. ఎలాంటి చప్పుడు చేయరు. అందుకే పార్టీలో నేతలు కూడా బాలయ్యను డమ్మీగా చూస్తారే తప్ప, కీలక నేతగా ఏనాడూ చూడలేదు. అలా తన తండ్రి స్థాపించిన పార్టీలో డమ్మీగా మిగిలిపోయారు బాలకృష్ణ. అయితే ఇప్పుడా లోటును బాలయ్య కూతురు బ్రాహ్మణి తీరుస్తుందని ఆశగా ఎదురుచూస్తోంది క్యాడర్.
ఈమధ్య టీడీపీలో విందు రాజకీయం నడిచింది. టీడీపీ కీలక నేతల రాజకీయ వారసులకు పార్టీ ఇచ్చారు లోకేష్-బ్రాహ్మణి. టీడీపీకి చెందిన కీలకమైన నేతల కొడుకులు, కూతుళ్లు అందరికీ ఆహ్వానం అందింది. హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ పార్టీలో అన్నీ తానై వ్యవహరించారు బ్రాహ్మణి. సరిగ్గా అప్పుడే బ్రహ్మాణిలో ఓ ఆశాదీపాన్ని చూశారట టీడీపీ నేతలు.
టీడీపీలో పూర్తిగా కరువైన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకే ఈ విందు ఇచ్చారని విషయం అందరికీ తెలిసినప్పటికీ.. ఇలా అనూహ్యంగా బ్రాహ్మణి పేరు తెరపైకి రావడం మాత్రం కొందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మరికొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం దీన్ని అత్యంత సహజమైన ప్రక్రియగా చెప్పడం విశేషం.
పార్టీలో నంబర్ వన్ చంద్రబాబుకు వయసైపోయింది. మరీ ముఖ్యంగా ఈమధ్య విశాఖ వెళ్లొచ్చిన తర్వాత చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఇక పార్టీలో నంబర్-2గా తనకుతాను చెప్పుకునే లోకేష్ ఎందుకూ పనికిరారనే విషయం పార్టీ జనాలతో పాటు బయట జనాలకు కూడా తెలుసు. లోకేష్ కు పగ్గాలు అప్పగిస్తే పార్టీ ఏమౌతుందో అందరికంటే బాగా చంద్రబాబుకే తెలుసు. ఇక బాలయ్య గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం.
సో.. పార్టీలో ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ బ్రాహ్మణి. కేవలం ఆమె కోసమే, ఆమెను అందరికీ పరిచయం చేయడం కోసమే ఈ విందు సమావేశం ఏర్పాటుచేశారని అంటున్నారు. అయితే ఇదంతా బ్రాహ్మణి ఇష్టంతోనే జరుగుతోందా లేక ఆమెపై బలవంతంగా ఈ పార్టీ భారాన్ని మోపుతున్నారా అనేది తేలాల్సి ఉంది.
ఎందుకంటే, తను రాజకీయాలకు దూరమంటూ గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు బ్రాహ్మణి. ఎన్నికల ప్రచారంలో అప్పుడప్పుడు కనిపించడం తప్పిస్తే, క్రియాశీల రాజకీయాల్లో ఆమె ప్రమేయం శూన్యం. ఆమెకున్న ఒకే ఒక్క అర్హత పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మాత్రమే. ఈ ఒక్క అంశాన్ని బేస్ చేసుకొని బ్రాహ్మణిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మెల్లమెల్లగా ప్రారంభమయ్యాయంటున్నారు విశ్లేషకులు.
బ్రాహ్మణి అంశాన్ని పక్కనపెడితే.. కొడుకు పనికిరాడని, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదనే విషయాన్ని బాబు ఇన్నాళ్లకు గుర్తించారని అనుకోవాలి. ఇదంతా చూస్తుంటే మీకు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.