ప్రధాని మోడీలో ఏమిటీ ‘సోషల్’ వైరాగ్యం? సీఏఏ అంశం తెరమీదకు వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం కావడం, సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం ఆయన్ను కలచివేసిందా? అలాగే సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా ఇటీవల బాగా ట్రోల్ చేస్తుండడం ఆయన మనసును నొప్పించిందా?….తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అన్ని సామాజిక మాధ్యమ వేదికల నుంచి తప్పుకోవాలని సోమవారం రాత్రి ప్రధాని మోడీ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
‘ఈ ఆదివారం నుంచి ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా అన్నింటి నుంచీ వైదొలగాలని ఆలోచిస్తున్నా. ఏ విషయమూ మీకు తెలియపరుస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే సామాజిక మాధ్యమాల వేదికల నుంచి నిష్క్రమించాలనే పెద్ద నిర్ణయానికి ఎందుకొచ్చారో కారణాలను మాత్రం వెల్లడించలేదు.
కాలానికి తగ్గట్టు మోడీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నారు. ఆయన 2000 నుంచే సోషల్ మీడియాలో చేరి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సామాజిక, రాజకీయ అంశాలపై సోషల్ మీడియా వేదికగా అనేక కీలక ప్రకటనలు చేశారు. సోషల్ మీడియాలో ఆయనకు పెద్ద సంఖ్యలో ఫాలోయిర్లు ఉన్నారు. ట్విటర్లో 5.33 కోట్లు, ఫేస్బుక్లో 4.4 కోట్లు, ఇన్‌స్టాలో 3.52 కోట్లు, యూట్యూబ్‌లో 0.45 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో ఫాలోయర్స్‌ను కలిగిన మోడీ ఆకస్మికంగా సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలనే పెద్ద నిర్ణయానికి ఎందుకొచ్చారనే ప్రశ్న తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ స్థాయిలో ఆయన టాప్ 5లో ఒకరు. అదే మనదేశానికి వస్తే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. ఏదైనా అంశంపై మోడీ పోస్ట్ పెట్టడమే ఆలస్యం….క్షణాల వ్యవధిలో వేలు, లక్షల సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తుంటారు.
2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశంలో కూడా పాల్గొనలేదు. సోషల్ మీడియా వేదికగానే ఆయన ప్రజలతో సంభాషించారు. ప్రజలతో ఇలా మాట్లాడటమే ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అయితే గత ఆరేళ్లుగా ఎప్పుడూ ప్రశంసలే అందుకుంటూ వస్తున్న మోడీ…సీఏఏ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ప్రతికూల కామెంట్స్ రుచి చూడాల్సి వచ్చింది. మోడీపై ఘాటైన ట్రోలింగ్స్ సాగుతున్నాయి. బహుశా ఈ అంశాలే ఆయనలో వైరాగ్యం తెచ్చాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాను వీడుతున్న ప్రకటించిన మోడీకి ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా చురకలు అంటించారు. ‘మీరు వీడాల్సింది ద్వేషాన్ని.. సోషల్ మీడియాను కాదు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ‘ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురవలేదని భావిస్తున్నాను. లేక విసిగిపోయి నిజంగానే ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి వైదొలుగుతానని సంకేతాలిస్తున్నారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.