‘కరోనా’ పేరు వింటేనే ప్రపంచం భయంతో గడగడలాడుతోంది. ఈ పేరు వింటే నిద్ర కూడా పట్టని పరిస్థితి. చైనాలో ‘కరోనా వైరస్’ పుట్టి…ఇప్పటికి 40కు పైబడి దేశాల్లో విస్తరించి వందల సంఖ్యలో మనుషుల ప్రాణాలను తీసింది. అదృష్టవశాత్తు మనదేశానికి విస్తరించలేదని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో…కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి పిడుగులాంటి వార్త చెప్పారు. అదేంటంటే…మన దేశంలో కూడా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని…అందులో మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో అని చెప్పారు.
ఈ నేపథ్యంలో ‘కరోనా వైరస్’ను నటి ఛార్మి స్వాగతించారు. అంతటితో ఆమె ఆగలేదు. ఆల్ ది బెస్ట్ చెప్పి తన శాడిజాన్ని ప్రదర్శించారు. ‘కరోనా’ను నియంత్రించేందుకు వైద్యులు అహో రాత్రులు కష్టపడుతుంటే, నటి ఛార్మి ఇలాంటి సమయంలో…ఆలాంటివి చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
‘కరోనా’పై నటి ఛార్మి సోషల్ మీడియా టిక్ టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో కరోనా వైరస్‌ను స్వాగతిస్తున్నానని, ఆల్ ది బెస్ట్ అని చెప్పిన వీడియో వివాదాస్పదమైంది. ఛార్మి కామెంట్స్‌ను నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు. ‘కరోనా’తో బెంబేలెత్తిపోతుంటే స్వాగతించడమేంటని ప్రశ్నించారు. ఎలుకకు ప్రాణం పోతుంటే పిల్లి చెలగాటం ఆడుతున్నట్టుందని ఛార్మీపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో తనపై ట్రోల్స్ తట్టుకోలేక నటి ఛార్మి ఆ వీడియోను తొలగించారు.