తను సోషల్ మీడియా నుంచి వైదొలగబోతున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తున్నట్టుగా ఉంది. వాస్తవానికి మోడీ రాజకీయ ఎదుగుదలలో సోషల్ మీడియా పాత్ర ఎంతో ఉంది. అది అందరికీ తెలిసిన సంగతే. ఒక దశలో కాంగ్రెస్ వాళ్లు.. తాము టెక్నాలజీని అభివృద్ధి పరిస్తే, ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని మోడీ ప్రధాని అయ్యాడని వాపోయారు!
ఇక సోషల్ మీడియాలో మోడీ ఫాలోయింగ్ కు ఏమీ తక్కువ లేదు. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో బీజేపీ భావజాలాన్ని గట్టిగా వ్యాపింపజేస్తూ ఉన్నారు. ఉన్నవీ లేనివీ కలిపి పోస్టు చేస్తూ.. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకతను పెంచడానికి, హిందుత్వ ఓటు బ్యాంకును సంఘటితం చేసుకోవడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నది సోషల్ మీడియాలోనే!
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీ గురించి మాట్లాడుతూ ఆయన ట్విటర్ ఫాలోయింగ్ గురించి మాట్లాడారు. అదో గొప్ప ఘనతగా చెప్పారు. ఇంతలోనే మోడీ సోషల్ మీడియా సన్యాసం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వాళ్లు కొత్త డౌటనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్ లనుంచి మోడీ వైదొలుగుతున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో.. కొంపదీసి ఆయన దేశంలో ఆయా సైట్లన్నింటినీ నిషేధిస్తారా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సందేహం వ్యక్తం చేశారు!