మదర్ థెరిసా ఇండియాలో పని చేసినా, ఇండియాలో పుట్టలేదు. ఇండియాలో పుట్టి సెయింట్స్ అయినవారి విషయం చూడబోతే – ఆల్ఫోన్సా (1910-1946)ను 2008లో సెయింట్‌గా గుర్తించారు. ఈవిడ ద్వారా జరిగిన అద్భుతమేమిటంటే ఒక మూడేళ్ల కుర్రవాడు వంకర పాదంతో పుట్టాడు. తలిదండ్రులు యీమె ఆత్మకు ప్రార్థించిన తర్వాత అతనికి వంకర నయమై, చక్కగా నడవగలుగుతున్నాడు. ఆల్ఫోన్సా బతికున్న రోజుల్లో 20 ఏళ్ల పాటు శారీరక, మానసిక రుగ్మతలతో నిరంతరం బాధపడ్డారు. రోగాలు తగ్గడానికి మూలికలతో కూడిన పచ్చళ్లు తినేవారు. 36 ఏళ్లకే పోయారు.
రెండో వ్యక్తి యూఫ్రేషియా ఎళువతింగళ్ (1877-1952)ను 2014 నవంబరులో సెయింట్‌గా గుర్తించారు. ఆవిడ విషయంలో జరిగిన అద్భుతాలేమిటంటే ఒక వడ్రంగికి ట్యూమర్ ఉందని స్కాన్ రిపోర్టులో వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అతను యీవిడ ఆత్మకు ప్రార్థించాడు. సర్జరీకి ముందు చూడబోతే అది మాయమైంది. రెండో మహత్యమేమిటంటే ఏడేళ్ల బాలిక ఒకామెకు మెడలో ట్యూమర్ వచ్చింది. ఆ పాప నాయనమ్మ యీమె ఆత్మకు ప్రార్థించడంతో ఆ ట్యూమర్ తగ్గిపోసాగింది. కొన్నాళ్లకు మాయమై పోయింది కూడా. మరణానంతరం వ్యాధులు నయం చేసేస్తున్న యూఫ్రేషియా జీవితకాలంలో అనారోగ్యంతో ఎంత బాధపడిందంటే ఒక దశలో కాన్వెంట్‌లోంచి బయటకు పంపేద్దామనుకున్నారు.
మూడో వ్యక్తి మరియం థ్రేషియా (1876-1926)ను 2000 సం.లో బీటిఫై చేసి, 2019 అక్టోబరులో సెయింటుగా గుర్తించారు. అద్భుతమేమిటంటే ఒక కుర్రవాడు వంకరపాదాలతో పుట్టాడు. 14 ఏళ్ల వయసు వచ్చేదాకా నడవడానికే కష్టపడేవాడు. 33 రోజులు యీవిడ ఆత్మకు ప్రార్థించాక కుడిపాదం నిద్రలోనే మామూలుగా అయిపోయింది. ఇంకో 39 రోజుల ప్రార్థన తర్వాత రెండో పాదం కూడా! ఆవిడకు బతికివుండగా 1926లో కాలిమీద బరువైన వస్తువేదో పడి గాయమైంది. చక్కెర వ్యాధి వలన అది పెరిగి పెద్దదై, కుళ్లిపోతే ఆసుపత్రిలో చేర్చారు. తగ్గకపోతే చర్చికి పంపేశారు. ఆవిడ అక్కడే 50వ ఏట పోయింది.
ఇలా వీళ్లందరూ తమకు తాము నయం చేసుకోలేరు కానీ చనిపోయాక అందరికీ నయం చేసేస్తూన్నారని చర్చి మనల్ని నమ్మమంటుంది. సత్యసాయిబాబా బతికి వుండగానే ఆపరేషన్లు చేయించుకున్నారు. అయినా ఆయనికి మొక్కుకుంటే ఆపరేషన్ అవసరం లేకుండా వ్యాధులు నయమై పోతాయని భక్తులు నమ్మేవారు. పైన రాసిన అద్భుతాలు, మహత్యాలు చూశారు కదా, ఏదీ కళ్లముందు హఠాత్తుగా జరగలేదు. రోగం వచ్చింది, మందు వాడకుండానే ప్రార్థనతో తగ్గిపోయింది. ఇవే క్లెయిమ్స్! ఎవరైనా చెపితే కాబోసు అనుకుని ఊరుకుంటాం. కానీ వాటికన్ అలా ఊరుకోదు, వాళ్లు స్వర్గలోకవాసులై పోయారు అనే సర్టిఫికెట్టు యిస్తుంది. ఇక అప్పణ్నుంచి వాళ్ల పేరుకు ముందు సెయింట్ అనే బిరుదు వచ్చి చేరుతుంది.
అద్భుతాలు, మహత్యాలు అంటే గుర్తుకు వచ్చేది- పివిఆర్‌కె ప్రసాద్‌గారి టిటిడి ఈఓ అనుభవాలు. స్వాతి వారవత్రికలో ‘‘సర్వసంభవామ్’’ శీర్షికతో సీరియల్‌గా వస్తున్నపుడు పాఠకులు ఉర్రూత లూగిపోయారు. దేవుడి మహిమ వ్యక్తమైందని ప్రగాఢంగా నమ్మారు. ఆయన రాసిన తీరు అలాటిది. దానిలో ఒక సంఘటన గురించి రాస్తాను. తిరుమలలో స్వామివారి గుళ్లోని ధ్వజస్తంభం మాను పై నుంచి కిందదాకా పుచ్చిపోయింది. పైన అంటిపెట్టుకుని వుండే బంగారపు ప్లేట్ల తాపడం ఆధారంగా నిలిచివుంది తప్పిస్తే కింద ఏమీ లేదు. 1982లో తక్కిన రిపేరు పన్లు చేపడుతూ యీ బంగారం ప్లేట్లు కూడా మళ్లీ పాలిష్ చేయిద్దా మనుకునేసరికి యిది అనుకోకుండా బయటపడింది.
నేల మీద నుంచి 50 అడుగుల ఎత్తున్న యీ మానుని లోపలకి ఎంత లోతుగా అమర్చారో తెలియదు. అంత పెద్ద మానుని ఎక్కణ్నుంచి తెస్తాం, ఉన్నదున్నట్లు ఉంచేసి, పైన ప్లేట్లు మళ్లీ పెట్టేద్దాం అన్నారు కొందరు. కానీ ప్రసాద్ గారు ఒప్పుకోలేదు. ఎప్పుడైనా ఫెళ్లున కూలిపోతే ఎంత అనర్థం, మారుద్దాం అని పని మొదలుపెట్టారు. 190 సం.ల నుంచి వున్న రికార్డు చూస్తే పాత మాను ఎక్కణ్నుంచి తెచ్చారో తెలియలేదు. కొత్తది తేవాలి. ఆగమశాస్త్రప్రకారం, ఆ మానుకి తొర్రలు ఉండకూడదు, కొమ్మలు ఉండకూడదు, పగుళ్లు ఉండకూడదు, ఏ మాత్రం వంకర ఉండకూడదు. కనీసం 75 అడుగులుండాలి. టేకు వృక్షమై ఉండాలి. ఇలాటిది మన రాష్ట్రంలో దొరకదు, కర్ణాటక లేదా కేరళలో ఉండవచ్చు అని చెప్పారు.
అది ఎక్కడుందో వెతికి పట్టుకుని, దాన్ని యీ కొండమీదకు తెచ్చి గుడి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపచేయడం ఎలా? అని ప్రసాద్ తర్జనభర్జన పడుతూంటే ఆ రాత్రి బెంగుళూరు నుంచి ఎచ్‌ఎస్ అయ్యంగార్ అనే భక్తుడు ఫోన్ చేశాడు. ‘ధ్వజస్తంభం మారుద్దా మనుకుంటున్నారని రేడియోలో విన్నాను. అలాటి మాను కావాలంటే రమారమి 300 ఏళ్ల వయసున్న టేకు కావాలి. అది కర్ణాటకలోని దండేలి అడవుల్లోనే దొరుకుతుంది. ఇక్కడ అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ నాకు బాగా తెలుసు. మీరు లాంఛనప్రాయంగా ఆయనకు ఉత్తరం రాస్తే, మేమిద్దరం అడవులు గాలించి అలాటి చెట్టుని ఎంపిక చేయిస్తాం’ అని ఆఫర్ చేశారు.
ఒక వారం తిరిగేసరికి వాళ్లు వంద చెట్లు పరీక్షించి, దట్టమైన దండేలిలో ఎత్తయిన కొండవాలులో 16 చెట్లు ఎంపిక చేశారు. వాటిల్లో టిటిడి వారు 6 చెట్లు షార్ట్‌లిస్ట్ చేశారు. అన్నీ తెప్పించి చూస్తే, వాటిలో చేవ ఉన్నది ఒక్కటైనా ఉంటుందని ఆశ. నరికేవరకూ చేవ తెలియదు. మామూలుగా అయితే ముక్కలుగా నరికి ట్రాన్స్‌పోర్టు చేస్తారు, కానీ ఉన్న సైజులోనే తీసుకెళ్లాలి, ఎలా అనుకుంటూండగా ఆ అడవిలో సోమానీ పేపర్ మిల్లు కోసం కలప నరికే వాళ్లకి తెలిసింది.
మిల్లు యాజమాన్యం, సిబ్బంది వచ్చి ‘మేం ఊరికే చేస్తాం, స్వామివారికి మా సేవ అనుకోండి’ అన్నారు. వారం రోజుల్లో చెట్లు నరికి, ఘాట్ రోడ్ల ద్వారా రవాణా చేసి రోడ్డు మీదకి తీసుకుని వచ్చి యిచ్చారు. ఇక అక్కణ్నుంచి తిరుమల దాకా 16 చక్రాల ట్రక్ ద్వారా చేర్చాలి. ‘తిరుపతి దాకా పరవాలేదు కానీ తిరుమల కొండ ఎక్కించడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదండి, ఎక్కడన్నా మలుపు తిరగలేక రోజుల తరబడి ఆగిపోవచ్చు. అందువలన రోజుల లెక్కన చార్జి యివ్వండి’ అని ట్రక్ యజమాని చెప్పాడు.
రెండు రోజుల్లో ఆరు మానుల్ని బెంగుళూరు తీసుకుని వచ్చారు. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు వాటికి పూజ చేసి కర్ణాటక ప్రభుత్వం నుంచి స్వామివారికి విరాళం అని ప్రకటించారు. మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకి ట్రక్ తిరుపతి చేరింది. తిరుమలకు వెళ్లాలి.
ఇక అక్కణ్నుంచి అసలు టెన్షన్. 19 కి.మీ.ల దూరం. ఎనిమిది క్లిష్టమైన మలుపులు. మలుపు తిరుగుతూంటే పిట్టగోడలు దెబ్బ తినవచ్చు, ట్రెయిలర్ తగిలి బండరాళ్లు దొర్లి పడవచ్చు. ఏం జరిగినా మాది బాధ్యత అన్నారు ప్రసాద్. ఆ సాయంత్రమే ట్రక్ బయలుదేరింది. భయపడినట్లుగానే మలుపుల్లో కొన్ని చోట్ల మానులు కొండకు కొట్టుకుని బండలు కిందకు దొర్లాయి. కొన్ని చోట్ల గోడలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల కాస్సేపు చక్రాలు గాల్లో తేలాయి. వెనక్కాల కార్లలో వస్తున్న ప్రసాద్, టిటిడి ఇంజనియర్లు, ట్రక్ ఓనరు గుండెలు చిక్కపట్టుకుని కూర్చున్నారు. మొత్తానికి గంట సేపట్లో ట్రక్ విజయవంతంగా తిరుమల చేరింది. ట్రక్ యజమాని ‘ఈ సేవ చేయడం నా అదృష్టం. నాకేమీ డబ్బు వద్దు’ అన్నాడు.
ఆలయం ఎదుట 100 అడుగుకి వెడల్పు చేసిన సన్నిధి వీధిలో దుంగల్ని దింపి వందేళ్ల వరకూ పాడవకుండా కెమికల్ ట్రీట్‌మెంట్ చేయించారు. ఇప్పుడు యీ 75 అడుగుల మానుని పాత ధ్వజస్తంభం స్థానంలో పెట్టాలంటే భారీ క్రేన్ తేవాలి, గోతిలోకి దింపాలంటే అక్కడి మంటపం పగలకొట్టాలి. మహద్వారాన్ని, దాని పైన ఉన్న గోపురాన్ని కూడా పెకలించాలి. అది శ్రేయస్కరం కాదు. ఎలా చేయాలా అని అర్ధరాత్రి దాకా చర్చలు జరిపినా ఎవరూ ఉపాయం చెప్పలేకపోయారు. మర్నాడు ఉదయం చర్చల్లో ఒక అధికారికి మార్గం తట్టింది. మహద్వారం నుంచి బలిపీఠం వరకు లోతుగా గొయ్యి తవ్వేసి ఈ మాను మొదలుని మహద్వారం దగ్గరే గోతిలోకి దింపేసి, శిరోభాగాన్ని సాధ్యమైనంత ఎత్తుగా వుంచుతూ యేతాం టైపులో లోపలకి తోసుకుంటూ వచ్చేద్దాం. మంటపం కిందకి వచ్చేసరికి కళాసీల సాయంతో పైకి లేపుదాం అని. అమ్మయ్య అనుకుని అలాగే చేశారు.
అలా జూన్ 10 నాటికి కొత్త ధ్వజస్తంభం ప్రతిష్ఠాపింప బడింది. నేను యిదంతా చాలా చప్పగా చెప్పాను కానీ ప్రసాద్ గారు అడుగడుగునా కథ డెడ్ ఎండ్‌కి చేరినట్లు, అంతలోనే అనుకోని క్వార్టర్‌నుంచి సహాయం అందినట్లు, దేవుడే అదంతా వెనక నుంచి జరిపిస్తున్నట్లు మంచి రసవత్తరంగా చెప్పుకొచ్చారు. ఈ కథనానికి బాపుగారు గరుత్మంతుడే ధ్వజస్తంభం ముక్కున కరచుకుని ఎగిరి వస్తున్నట్లు చక్కటి బొమ్మ వేశారు. మొత్తం మీద చదివితే ఒక అద్భుతం జరిగినట్లు తోస్తుంది.
కానీ అన్ని చోట్లా మనుషులే పూనుకుని చేశారు. సరిగ్గా ఆ సమయానికే ఎలా తారసిల్లారు, ఎందుకు చేశారు అంటే దేవుడి మహిమ అనవచ్చు, లేదా కాకతాళీయం అనవచ్చు. మీరు అనుకునేదాని బట్టి ఉంటుంది. ఇన్ని నిదర్శనాలు చూపిన బాలాజీ తన సొమ్ము స్వాహా చేస్తున్నవారి పని వెంటనే పట్టి యింకో నిదర్శనం చూపవచ్చుగా అని మనం అనుకోవచ్చు. టిటిడిలో ఉండగా అన్ని ‘అద్భుతాల’ను చూసిన ప్రసాద్ గారు బాబ్రీ మసీదు విధ్వంసం విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఆయన ఎంతో అభిమానించే పివి నరసింహారావుగారికి మాట రాకుండా కాపాడలేకపోయారు. అందువలన కొన్ని సార్లే ‘దైవమహిమ’లు పని చేస్తాయి, కొన్ని సార్లు చెయ్యవు.
ఈ ధ్వజస్తంభం పని కాగానే ఒక అధికారి ప్రసాద్‌గారిని ‘మీ వల్లే సాధ్యమైంది సార్’ అని మెచ్చుకుంటూ ఉంటే పక్కనే వున్న ఒక వృద్ధ పండితుడు ఒక శ్లోకం చదివారట. ‘‘నాహం కర్తా, హరిః కర్తా, తత్పూజా కర్మ చాఖిలం- తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా’’ (నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు) ఈ వ్యాసాలను పుస్తకరూపంలో తెచ్చినపుడు ప్రసాద్ గారు దానికి ‘నాహం కర్తా, హరిః కర్తా’ అనే పేరు పెట్టారు.
నేను చెప్పేదేమిటంటే అద్భుతం అని మనం అనుకునేది మానవప్రయత్నంగానే కనబడుతుంది. దైవం సాయపడ్డాడని అనుకున్నా మనిషి రూపంలోనే వస్తాడు. దిశ కేసులో చూడండి. దుర్మార్గులు ఆ అమ్మాయి స్కూటర్ పాడు చేసినపుడు, అనుకోకుండా ఓ ఆటోవాడు అటువైపు వచ్చి ఆమెను ఎక్కించుకున్నాడనుకోండి. ఆ ఘోరం జరిగేది కాదు. ‘దేవుడిలా వచ్చాడు’ అనుకుంటాం. నిర్భయ కేసులో బస్సులో దుర్మార్గులు కూడబలుక్కుంటున్నపుడు హఠాత్తుగా ఓ పోలీసువాడు చెయ్యెత్తి ఆపి, ‘నన్ను ఆ ముందు జంక్షన్ దాకా దింపండి’ అని ఉంటే, నిర్భయ చటుక్కున బస్సులోంచి దిగే వ్యవధి దొరికేది. అతనూ ఆ సమయానికి దేవుడే. విడిగా అతను లంచగొండి కావచ్చు, కానీ ఆ క్షణానికి దేవుడే.
అందువలన మహిమలు అనేవి నిర్వచించలేం. మెడికల్ రిపోర్టులో కణితి ఉందని వచ్చింది, వారం పోయాక చూస్తే ఆ రిపోర్టు తప్పని తేలింది అనేలాటివి ఏ ప్రార్థనలు జరపని సందర్భాల్లో కూడా చూస్తాం. కలలో కనబడి చెప్పింది లాటివి నిరూపించలేం. నిజంగా దేవతగా గుర్తింపదగిన మహిమ చూపించారు అనాలంటే ఆ సన్యాసిని నామం జపించగానే బోరుబావిలో పడిపోయిన కుర్రాడు ఏ యంత్రసాయమూ లేకుండా తనంతట తానే నేలక్కొట్టిన బంతిలా పైకి ఎగిరి వచ్చేయాలి. అలాటి అద్భుతాలు మనం బతికుండగా చూడలేం. అంతెందుకు గాలిలోంచి వస్తువు సృష్టిస్తారని పేరుబడిన సత్యసాయిబాబాను చేతిలో పట్టే వస్తువు కాకుండా ఓ గుమ్మడికాయను సృష్టించి చూపించండి అని అనేకమంది ఛాలెంజ్ చేశారు. ఆయన ఎన్నడూ అలా చేసి చూపించలేదు.
అందువలన యీ అద్భుతాల వెంట, మహిమల వెంట పరిగెట్టడం మానేసి, మంచి మనసుతో మానవప్రయత్నం చేస్తే దైవం సాయపడుతుంది, అదీ మనిషి రూపంలోనే! అందువలన మనుషులందరితో మంచిగా ఉందాం – అనుకోవడం మనకూ, సమాజానికీ మేలు. (సమాప్తం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2020)