రాజుగారి కోటలో నో సౌండ్

సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ విజయం గాలివాటమని తెలుగుదేశం పెద్దలు చాలామంది నమ్మారు. తాము బలంగా ఉన్నామని కూడా ధీమాగా ఉన్నారు. అయితే అవన్నీ తప్పుడు అంచనాలు అని స్ధానిక సంస్ధలు తేల్చి పారేశాయి.  Advertisement…

సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ విజయం గాలివాటమని తెలుగుదేశం పెద్దలు చాలామంది నమ్మారు. తాము బలంగా ఉన్నామని కూడా ధీమాగా ఉన్నారు. అయితే అవన్నీ తప్పుడు అంచనాలు అని స్ధానిక సంస్ధలు తేల్చి పారేశాయి. 

పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుపెడితే మునిసిపాలిటీ కార్పోరేషన్ ఎన్నికల దాకా వైసీపీ గాలి గట్టిగా వీచింది. ఇంకా చెప్పాలంటే విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికలలో వచ్చిన దానికన్నా ఎక్కువగా ఓట్ల శాతం స్ధానిక ఎన్నికలలో దక్కడంతో టీడీపీకి చెందిన అగ్రనాయకులు ఇపుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. 

విజయనగరం కార్పోరేషన్ ఎన్నికలలో టీడీపీ విజయం కోసం ఏకంగా రోడ్ల మీదకు వచ్చి గట్టిగా ప్రచారం చేసిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అయితే పూర్తిగా బంగళ‌కే పరిమితం అయ్యారని అంటున్నారు. ఆయన కుమార్తె, భావి వారసురాలు అదితి గజపతిరాజు కూడా పెద్దగా సందడి చేయడంలేదు. 

తండ్రీ కూతురు కలసి ప్రచారం చేసినా విజయనగరం కార్పోరేషన్‌లో మొత్తం యాభై వార్డులకు గానూ కేవలం రెండు మాత్రమే టీడీపీకి దఖలు పడ్డాయి. ఒక విధంగా ఇది దారుణమైన పరాజయంగా భావిస్తున్నారు. ఇప్పట్లో వైసీపీ గాలికి ఎదురు నిలవలేమని చాలామంది నేతలు నోటికి తాళం వేసుకున్నారు. 

ఇక విజయనగరం జిల్లా టీడీపీలో వర్గ పోరు వల్ల కూడా రాజుల కోటలో నిశ్శబ్దం తాండవిస్తోంది అంటున్నారు. అశోక్ బంగ్లాలో ఉన్న టీడీపీ ఆఫీసును కాదని పోటీగా మరోటి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఏర్పాటుచేయడంతో రాజుల కోటకు తమ్ముళ్ల రాకపోకలు కూడా తగ్గిపోయాయని అంటున్నారు.