ఏపీలో పరిణితి కోల్పోతున్న ప్రతిపక్షమే అసలు సమస్య

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఒక ప్రత్యేక సమస్య ఉంది. అదేమిటంటే, మెచ్యూరిటీ కొరవడిన ప్రతిపక్షం. బాధ్యతతో విమర్శలు చేయవలసిన విపక్షం, నిజమైన సమస్యలపై పోరాడవలసిన ప్రతిపక్షం ఇప్పుడు మెచ్యూరిటీని ప్రదర్శించడంలో విఫలం అవుతోంది. సీఎం జగన్‌పై…

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఒక ప్రత్యేక సమస్య ఉంది. అదేమిటంటే, మెచ్యూరిటీ కొరవడిన ప్రతిపక్షం. బాధ్యతతో విమర్శలు చేయవలసిన విపక్షం, నిజమైన సమస్యలపై పోరాడవలసిన ప్రతిపక్షం ఇప్పుడు మెచ్యూరిటీని ప్రదర్శించడంలో విఫలం అవుతోంది. సీఎం జగన్‌పై గుడ్డి ద్వేషంతో వ్యవహరిస్తోంది.

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నలభై మూడేళ్లుగా రాజకీయాలలో ఉన్నా, ప్రతిపక్షంలోకి రాగానే ఆయన ధోరణి మారిపోతుంది. ఏ పాయింట్ దొరుకుతుందా? ప్రభుత్వాన్ని ఎండగడదమా అన్న ఆలోచన తప్ప, తాను గతంలో అన్నదానికి విరుద్దంగా మాట్లాడుతున్నామా? అన్న దానిపై ఆయన పెద్దగా ఫీల్‌కారు. 

ఆయన వయసు, ఆయన చేసిన పదవుల రీత్యా ఎంతో హుందాగా వ్యవహరించిన చంద్రబాబు మరీ గల్లిలీడర్ స్థాయిలో కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదానికి సుద్దులు చెప్పేవారు. అదిపోయిన వెంటనే ఆయన మాటమార్చుతూ, తన మెచ్యూరిటీపై ప్రజలలో అనుమానాలు కలిగేలా వ్యవహరిస్తుంటారు.

ఒక అబద్ధాన్ని పదిసార్లు చెబితే కొంతమందైనా నమ్మకపోతారా అన్నది ఆయన థీరీ. ఆ ప్రకారమే ఆయన వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు ఒక విషయం చూడండి. దేశ వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏపీలో కొంత తీవ్రంగానే కరోనా ఉండి ఉండవచ్చు. 

కాని అంత మాత్రాన శవాల గుట్టలు అంటూ, స్మశానాలకు  రాజులు అవుతారా అంటూ ఆయన మాట్లాడడం ఆయనలోని ద్వేష భావాన్ని తెలియచేస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో కొందరు జవాబు ఇస్తూ గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా మరణించినవారి శవాల గుట్టల సంగతేమిటని ప్రశ్నించారు. తిరుమల అడవుల్లో ఎన్‌కౌంటర్ పేరుతో ఇరవై మందిని కాల్చివేసిన ఘటనలో పడిన శవాల గుట్టల సంగతేమిటని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు సాధ్యమైనంతవరకు ద్వేషంతో కూడిన మాటలు కాకుండా, ప్రజల మెప్పు పొందే విమర్శలు చేయడంలో విఫలం అవుతున్నారన్న విమర్శ వస్తోంది. చంద్రబాబు ఇక్కడే తన పరిణితిని కోల్పోతున్నారనిపిస్తుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నిజంగానే  మెచ్యూరిటీ ఉన్నట్లు కనబడదు. ఆయన ట్విటర్‌లో ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ప్రజల దష్టిని ఆకర్షించాలని చూస్తూ, తనకు పరిణితి లేదని పదే, పదే రుజువు చేసుకుంటుంటారు. ఇందుకు తాజా ఉదాహరణ ముఖ్యమంత్రి జగన్‌పై, ఆయన ప్రభుత్వంపై చేసిన విమర్శలనే తీసుకోవచ్చు.

విజయనగరంలో సాంకేతిక సమస్య వచ్చి ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడింది. దాని కారణంగా ఇద్దరు మరణించారని సమాచారం వచ్చింది. అది బాధాకరం. అటువంటివాటిపై కామెంట్ చేయడం తప్పుకాదు. కాని ఏమి కామెంట్ చేస్తున్నాం.. ఎందుకు కామెంట్ చేస్తున్నాం అన్నదానిపైన అయినా వారికి క్లారిటీ ఉండాలి. లేకపోతే వారే అభాసుపాలు అవుతారు. 

ఆక్సిజన్, అత్యవసర ఔషధాలపై రాష్ర్ట ప్రభుత్వానికి ఎందుకు అంత నిర్లిప్తత అని ప్రశ్నించారు. కరోనా మతుల లెక్కలను దాయగలరు. కాని బాధిత కుటుంబాల కన్నీటిని అడ్డుకోగలరా అని ఆయన అన్నారు. మన రాష్ర్టం రోమ్.. మన పాలకులు నీరో వారసులు కారాదు… ఇంటింటికి కావాల్సింది ఇంటర్ నెట్, మేకలు మాత్రమే కాదు. కరోనా నుంచి రక్షించే ఔషధాలు, ఆక్సిజన్ అని కూడా గ్రహించాలి, వీటిపై సిఎం జగన్‌రెడ్డి దష్టి పెట్టాలి.. అని పవన్ కళ్యాణ్ అన్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసే రోజునే ముఖ్యమంత్రి జగన్ దేశంలో ఎవరూ ప్రకటించని విధంగా రాష్ర్టంలోని పేద ప్రజలందరికి  కేంద్రం ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి అదనంగా మరో  ఐదు కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. నిజంగా నీరో మాదిరి వ్యవహరిస్తే ఈ నిర్ణయం వచ్చేదా? కరోనాను ఎదుర్కోవడానికి 104 కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయడం కాని, అక్కడ డాక్టర్లను అందుబాటులో ఉంచడం కాని, రాష్ర్ట వ్యాప్తంగా కోవిడ్ ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కాని, కోవిడ్ టాస్క్ పోర్స్‌ను ఏర్పాటు చేయడం వంటి పలు చర్యలు చేపడితే వాటిని గమనించనట్లు నటిస్తూ పవన్ కళ్యాణ్ నీరో వ్యాఖ్యలు చేశారనిపిస్తుంది.

జగన్ తీసుకున్న నిర్ణయాలు సరిపోకపోతే ఇంకా ఫలానాది చేయండి అని చెప్పవచ్చు. తప్పులేదు. అలాకాకుండా జగన్ అసలు ఏమీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ చెబితే జనం ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు ఏ పొరపాట్లు అయితే చేస్తున్నారో, ఏ అసత్య ప్రచారానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారో, అదే ప్రకారం తాను కూడా ఉండాలని పవన్ పోటీ పడుతున్నట్లుగా ఉంది. 

దేశ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్న బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఇప్పుడు అంతర్జాతీయంగా ఎలాంటి విమర్శలు వస్తున్నాయి? వీటన్నిటిని అసలు తెలియనట్లు పవన్ నటిస్తే సరిపోతుందా? కేంద్రాన్ని విమర్శించాలని చెప్పడం లేదు. కాని కేంద్రంలోకాని, వివిధ రాష్ట్రాలలో కాని జరుగుతున్న పరిణామాలను గమనించి మాట్లాడకపోతే పోయేది పవన్ కళ్యాణ్ పరువే.

దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ అందక ఇరవై మంది పైగా మరణించారని వార్తలు వచ్చాయి. మహారాష్ర్టలో సాంకేతిక కారణాల వల్ల ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి 24 మంది, మధ్యప్రదేశ్‌లో ఆరుగురు మరణించారు. ఇటువంటి విషయాలలో అధికారులు, సంబంధిత సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యమంత్రులో, లేక పవన్ కళ్యాణ్ వంటివారో ప్రతి ఆస్పత్రి వద్దకు వెళ్లి ఆక్సిజన్ గొట్టాలు ఏమైనా దెబ్బతిన్నాయా అని చూడరు.

అందుకోసం అక్కడ ప్రత్యేక సిబ్బంది ఉంటుంది. వారు సరిగా పనిచేయకపోతే ప్రభుత్వం చర్య తీసుకుని వ్యవస్థను సజావుగా నడపవలసి ఉంటుంది. అలా చేయలేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. విజయనగరంలో జరిగిన ఘటనలో ఇద్దరు మరణించారని ప్రచారం జరిగింది. దానిని జిల్లా కలెక్టర్ ఖండించారు. వేరే కారణాలతో చనిపోతే ఆక్సిజన్ కొరతవల్ల చనిపోయారని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి విషయాలు విచారణ చేస్తే కాని తేలవు.అది వేరేసంగతి. కాని ఏ ఘటన జరిగినా వెంటనే ప్రభుత్వంపై బురద చల్లడానికే తాము ఉన్నామన్నట్లుగా రాబందుల్లా వ్యవహరిస్తే ప్రతిపక్షానికి విలువ ఉండదు.

అందులోను ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం ఉన్న సమయంలో కేవలం ఏపీలోనే ఇబ్బందులు ఉన్నట్లు వీరు మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు వీరిని పట్టించుకోరు. పైగా ప్రజలను భయపెట్టే విధంగా మాట్లాడాలని పవన్ వంటివారి కోరిక కావచ్చు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. పవన్ తిరుపతి ఉప ఎన్నిక సభలో ఎలా పాల్గొని వచ్చారు. అప్పుడు కరోనా సమస్య కనిపించలేదా? తను నటించిన వకీల్‌సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఎలా వెళ్లారు. ఆ తర్వాత కరోనాబారిన పడినట్లు ఆయనే చెప్పుకున్నారు కదా? టెన్త్, ఇంటర్ పరిక్షల విషయంలో కూడా పవన్ తీరు బాగోలేదు.

ప్రభుత్వానిది మూర్ఖపు నిర్ణయం అని అంటూ అచ్చంగా టీడీపీ మాదిరే ఆయన మాట్లాడారు. అన్నిటికి మించి పవన్ ఏపీలో ఉంటున్నారా? లేక హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో  ఉండి ట్విటర్ ద్వారా విమర్శలు చేస్తున్నారా? ప్రతిపక్షం అంటే కేవలం ట్విటర్‌లో వ్యాఖ్యలు చేయడానికే పరిమితమా? పరస్పర విరుద్ధంగా మాట్లాడడం, వేరే పార్టీ కోసం, వేరే నాయకుడికి ప్రయోజనం కలిగించాలన్న ఉద్దేశంతో పనిచేయడమో చేస్తుంటే పవన్‌కు రాజకీయాలలో మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది?

ఇక చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. అది పాజిటివ్ అయితే ఫర్వాలేదు. నెగిటివ్‌మేన్‌గా తయారైతే ఏమి లాభం. పాజిటివ్‌గా ఉండాలంటే ప్రభుత్వాన్ని పొగడమని కాదు. తన మాట, తన భాష ద్వారా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండాలి కాని, ఏమిటీ ఈయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.. నిజంగానే ఈయనకు ఉపన్యాసం ఇవ్వడం కాని, ప్రజలతో మాట్లాడడం కాని చేతకాదు అని అనిపించుకుంటే నష్టం ఆయనేక కదా. 

పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ మాట అడగడం తప్పు కాదు. కాని ప్రభుత్వం ఏదో ఘోరానికి పాల్పడుతున్నట్లుగా మూర్ఖపు రెడ్డి ప్రభుత్వం అని విమర్శలు చేయడం ద్వారా ఎలాంటి సంకేతం ఇస్తున్నారు? ఆయన ఏమి చెప్పదలచుకున్నారు? ఏమి చెప్పారు? ప్రజలు ఇవన్ని గమనించలేరా?

ఒక వర్గం వారిని కించపరిచేలా మాట్లాడారని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. నిజంగానే లోకేష్ ఏదైనా మంచి మాటలు మాట్లాడినా, ఇలాంటి వాటితో వాటిని కూడా ప్రజలు నమ్మరు. లోకేష్ మెచ్యూరిటీ గురించి పెద్దగా విశ్లేషించుకోనక్లర్లేదు. ఇన్ని కబుర్లు చెబుతున్నారు కదా? తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో కాని, అంతకు ముందు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాని చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు సభలు నిర్వహించారు? ర్యాలీలు పెట్టారు. అప్పుడు ఎంత మేర కరోనా నిబంధనలు పాటించారు? మరి అదంతా విమర్శనార్హం కదా.

ఒక పక్క సీఎం జగన్ తన తిరుపతి ప్రచార సభను రద్దు చేసుకుని ఎంతో మెచ్యూరిటీగా వ్యవహరించారని పేరు తెచ్చుకుంటే పద్నాలుగేళ్లు సీఎంగా చేశానని, 13 సంవత్సరాల ప్రతిపక్ష నేతనని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఒక్క సభ కూడా రద్దు చేసుకుని ప్రజలకు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పలేదు? చంద్రబాబు ఎలాగొలా తన కుమారుడు లోకేష్‌ను ప్రమోట్ చేయాలని విశ్వయత్నం చేస్తుంటే, ఈయనేమో మెచ్చూరిటీ లేని రాజకీయాలు చేస్తూ నవ్వుల పాలు అవుతున్నారు. అదే విషయాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తనకు తెలియకుండానే బహిరంగ పరిచారు.

చంద్రబాబు, లోకేష్‌లే ఇలా ఉన్నప్పుడు తాము ఎవరిమైనా పద్ధతిగా మాట్లాడితే వారి ఆగ్రహానికి గురి అవుతామేమోనని మిగిలిన టీడీపీ నేతలు కూడా అలాగే మెచ్యూరిటీ లేని విమర్శలు చేసి అప్రతిష్టపాలు అవుతున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఇలాంటి వారు ఉండరా అంటే ఉండవచ్చు. కాని వారిని ఆ పార్టీ చాలావరకు నియంత్రించుకుంటోంది. 

టీడీపీ, జనసేనలు ఆ విషయంలో విఫలం అవుతున్నాయి. అసలే విశ్వసనీయత కోల్పోయిన ఈ రెండు పార్టీలు కనీసం మెచ్యూరిటీగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే కాస్తో, కూస్తో ఉపయోగం ఉండవచ్చు. ఇలాంటి సలహాలు వారికి నచ్చకపోవచ్చు. అది వేరే సంగతి.

కొమ్మినేని శ్రీనివాసరావు