మరోసారి జగన్ ను గెలిపించిన ప్రజలు

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. 2 లక్షల 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్జీతో గురుమూర్తి గెలిచారు. అయితే ప్రత్యక్షంగా గురుమూర్తి గెలిచినా, పరోక్షంగా ఆ విజయం…

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలిచారు. 2 లక్షల 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్జీతో గురుమూర్తి గెలిచారు. అయితే ప్రత్యక్షంగా గురుమూర్తి గెలిచినా, పరోక్షంగా ఆ విజయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది. 2019లో దుర్గాప్రసాద్ గెలిపించినా, ఇప్పుడు అదే స్థానంలో గురుమూర్తి గెలిచినా అది వైఎస్ జగన్ మహిమ.

2019తో పోలిస్తే.. ఈసారి మెజారిటీ ఇంకాస్త పెరిగింది. కచ్చితమైన నంబర్ ఎంతనేది ఇంకా బయటకు రాకపోయినప్పటికీ గతంలో దుర్గాప్రసాద్ సాధించిన మెజార్టీని గురుమూర్తి ఇప్పటికే దాటేశారు. అంటే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కట్టారని దీనర్థం.

తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లో వైసీపీ గెలుపు అనేది ఇప్పుుడు నిర్ణయించింది కాదు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆ గెలుపు ఫిక్స్ అయింది. బయటకు చెప్పకపోయినా టీడీపీ-బీజేపీ లాంటి ప్రతిపక్షాలకు కూడా ఈ విషయం తెలుసు. కాకపోతే గతంతో పోలిస్తే ఈసారి మెజారిటీ ఇంకాస్త పెరగాలి. అప్పుడే జగన్ పాలనకు ఓ సార్థకత. ఓ మెచ్చుకోలు. అందుకే తిరుపతి ఓటరు విచక్షణతో వ్యవహరించాడు. జగన్ కు మరో అఖండ విజయాన్ని కట్టబెట్టాడు.

కేవలం ఓ వర్గం మాత్రమే రాజకీయం చేయాలనే సంప్రదాయానికి జగన్ ఎప్పుడో చెక్ పెట్టారు. అందుకే తన పార్టీ నుంచి విద్యావంతుల్ని, సామాన్యుల్ని బరిలో నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు గురుమూర్తి విజయం కూడా అలాంటిదే. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తి, ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అయ్యారు.

గత ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే చెప్పిన ఓ మాటను ఇప్పుడు గుర్తుచేసుకోవడం ఎంతైనా అవసరం. “ఈ రాజకీయాల్లో మార్పు రావాలి. సామాన్యులు రాజకీయాల్లో భాగం అవ్వాలి. కుళ్లు కుతంత్రాలతో నిండిపోయిన ఈ రాజకీయాల్లో పారదర్శకత పెరగాలి.” 2019 ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ఈ మాటల్ని జగన్ ఆచరణలో చేసిచూపిస్తున్నారు. ఈ సరికొత్త రాజకీయ ప్రస్థానంలో గురుమూర్తి లాంటి ఇంకెంతోమంది భవిష్యత్ లో మనకు కనిపించబోతున్నారు.