అస్సైన్డ్ భూముల ఆక్రమణ కేసులో మంత్రి పదవి పోగొట్టుకున్న ఈటల రాజేందర్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంటోంది. ఈటల అస్సైన్డ్ భూముల్ని కబ్జా చేసినట్టు మెదక్ కలెక్టర్ నిర్థారించారు. ఈ మేరకు సీఎస్ కు నివేదిక పంపించారు. నిన్న అచ్చంపేట, హకీంపేటలో క్షేత్రస్థాయిలో పర్యటించి, భూముల్ని పరిశీలించిన కలెక్టర్.. ఆక్రమణ జరిగిన మాట వాస్తవమని ప్రకటించారు.
అస్సైన్డ్ భూముల్లోనే ఈటలకు చెందిన కోళ్ల ఫారం జమున హ్యాచరీస్ ఉందని నిర్థారించిన కలెక్టర్.. ఈ మేరకు ఆ భూములకు సంబంధించిన బాధితుల్ని కలిశారు. వాళ్ల స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. అస్సైన్డ్ భూములను కలిగి ఉన్న వ్యక్తుల్ని బెదిరింది, అన్యాయంగా ఈటల, వాళ్ల నుంచి భూములు లాక్కున్నారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు.
ఈరోజు సీఎస్ కు రిపోర్ట్ ఇచ్చారు మెదక్ జిల్లా కలెక్టర్. జమున హ్యాచరీస్ సంస్థ ఎలాంటి నిబంధనలు పాటించలేదని, అస్సైన్డ్ భూముల్లో చెట్లను కూడా నరికేశారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. ఓవరాల్ గా ఈటల, ఆయన అనుచరులు ఈ ప్రాంతంలో 66 ఎకరాల అస్సైన్డ్ భూమిని ఆక్రమించారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు.
మరోవైపు ఈటల మాత్రం తను ఎవ్వరి భూమిని ఆక్రమించలేదని చెబుతున్నారు. జీవితంలో ఎప్పుడూ తను అవినీతికి పాల్పడలేదని, కేవలం ఈ ఆరోపణపై మాత్రమే కాకుండా.. తన జీవితం మొత్తంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం శాఖ లేని మంత్రిగా కొనసాగుతున్న ఈటల.. ఈ వ్యవహారం తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈటలపై పోలీస్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.