తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తన సమీప అభ్యర్థి పనబాక లక్ష్మిపై లక్ష మెజార్టీతో దూసుకుపోతున్నారు. అయితే తిరుపతి అసెంబ్లీ పరిధిలోని కౌంటింగ్ పూర్తయినట్టు అనధికారిక సమాచారం అందింది. ఈ సమాచారం ప్రకారం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి 34,846 మెజార్టీ వచ్చినట్టు తెలిసింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ గెలుపొందినప్పటికీ, తిరుపతి అసెంబ్లీ పరిధిలో మాత్రం టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,150 ఓట్ల ఆధిక్యత లభించింది. దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థిగా పాత కాపైన పనబాక లక్ష్మి, జనసేన మద్దతుతో బీజేపీ తరపున రత్నప్రభ పోటీలో నిలిచారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో మొత్తం 64.44 శాతం పోలింగ్ నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 14.59% తక్కువ పోలింగ్ నమోదైంది. తిరుపతిలో అత్యల్పంగా 50.58% మాత్రమే నమోదైంది. ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో 34,846 ఓట్ల మెజార్టీ రావడం వైసీపీ శ్రేణుల్ని ఆలోచింపజేస్తోంది.
ఒకవైపు 2019 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే తిరుపతి అసెంబ్లీ పరిధిలో మంచి మెజార్టీ వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్‌రెడ్డి సంతోషిస్తారా? లేక ఎన్నికల రోజు పరిణామాలు, తీవ్ర ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో 34,846 మెజార్టీని ఎలా సమర్థించుకుంటారో వాళ్ల అంతరాత్మలకే సమాధానం చెప్పుకోవాల్సి వుంటుంది.
ఈ మెజార్టీ ప్రాతిపదికగా భవిష్యత్ రాజకీయంపై తండ్రీకొడుకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.
సొదుం రమణ