తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ టార్గెట్ ఒకటే. గెలుపుపై ఆ పార్టీకి ఎలాంటి అనుమానం లేదు. కచ్చితంగా గెలిచే సీటే. కాకపోతే మెజార్టీ ఎంత పెంచుకుంటామనేది వాళ్ల లక్ష్యం. గతంలో ఇదే సెగ్మెంట్ లో 2 లక్షల 28వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు బల్లి దుర్గా ప్రసాద్. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి ఆ స్థానంలో గురుమూర్తి బరిలో నిలిచారు.
కాబట్టి.. ఈసారి గురుమూర్తి గెలిస్తే సరిపోదు. భారీ మెజారిటీ సాధించాలి. పైగా దుర్గాప్రసాద్ సాధించిన మెజార్టీ కంటే కాస్త ఎక్కువ సాధించాలి. ఎందుకంటే, ఇదిప్పుడు గురుమూర్తి గెలుపు అంశం కాదు, జగన్ పాలనకు గీటురాయిగా మారిన అంశం.
అందుకు తగ్గట్టే తిరుపతి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం లక్ష ఓట్ల మెజార్టీతో గురుమూర్తి దూసుకుపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నాటికి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫలితాల లెక్కల ప్రకారం.. గురుమూర్తికి 55.9శాతం ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 32.4 శాతం, బీజేపీకి 5.7 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇంకా చాలా రౌండ్లు మిగిలి ఉండడం, లీడింగ్ ఎక్కువగా ఉండడంతో.. వైసీపీకి 2 లక్షల మెజారిటీ ఖాయం అనే విషయం స్పష్టమైంది. అయితే 2 లక్షలు దాటి ఎన్ని ఓట్లు వచ్చాయనేది చూడాలి. మరికొద్దిసేపట్లో పూర్తి మెజారిటీ రాబోతోంది.
ఇక టీడీపీ విషయానికొస్తే, గత ఎన్నికల కంటే తక్కువగా ఆ పార్టీకి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అభ్యర్థి పనబాక లక్ష్మి ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం నుంచి జారుకున్నారు. అటు బీజేపీ ఈసారి నోటా కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. 2019 ఎన్నికల్లో నోటాకు 25,781 ఓట్లు పోలవ్వగా.. భారతీయ జనతా పార్టీకి 16,125 మాత్రమే వచ్చాయి. ఈసారి బీజేపీ, నోటా కంటే బెటర్ అనిపించుకుంటోందంతే.