తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ తన ఆధిక్యతను కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత నుంచే ప్రారంభించింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.
చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడుకు సంబంధించి తిరుపతిలోనూ, మిగిలిన నాలుగు నియోజక వర్గాల కౌంటింగ్ నెల్లూరులోనూ ప్రారంభించారు.
పోస్టల్ బ్యాలెట్లు కాకుండా మొట్ట మొదటగా తిరుమల ఈవీఎంలను లెక్కించారు. ఇక్కడ దాదాపు 4 వేల ఓట్లు ఉన్నాయి. తిరుమల శ్రీవారిని బీజేపీ, టీడీపీ రాజకీయ అస్త్రంగా వాడుకోవాలనే ప్రయత్నాలను ఓటర్లు తిప్పి కొట్టారనేందుకు ఇక్కడ వైసీపీకి వచ్చిన మెజార్టీనే నిదర్శనం.
తిరుమలలో వైసీపీకి 2400 ఓట్ల మెజార్టీ దక్కడం విశేషం. అలాగే బీజేపీకి కనీసం 200-300 మించి అక్కడ ఓట్లు రాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రిస్టియన్ మతస్తుడు కావడంతో, హిందుత్వ ఎజెండాతో అధికార పార్టీపై వ్యతిరేకత పెంచి తిరుపతిలో ఓట్లు కొల్లగొట్టాలనే ప్రతిపక్షాల ఎత్తులను ఓటర్లు చిత్తు చేశారనేందుకు సాక్ష్యాత్తు ఆ కలియుగ దైవం కొలువైన తిరుమల ఓటర్లు ఇచ్చిన తీర్పే నిదర్శనం.
ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తన సమీప ప్రత్యర్థి పనబాక లక్ష్మిపై 62,196 ఓట్ల ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. డాక్టర్ గురుమూర్తికి 1,47,094 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 85,798 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు కేవలం 12,530 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.