దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి టీఎంసీదే అధికారమని తేల్చి చెబుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలు మరోసారి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిపైనే “మమతష చూపినట్టు వెల్లడవుతున్న ఫలితాల ట్రెండ్స్ చెబుతున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదట్లో టీఎంసీ, బీజేపీ నువ్వానేనా అని తీవ్రస్థాయిలో పోటీ పడినట్టు ఫలితాలు వచ్చాయి.
ఆ తర్వాత కాలం గడిచేకొద్ది టీఎంసీ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ వచ్చింది. ఉదయం 10.30 గంటల సమయానికి పశ్చిమ బెంగాల్ ఫలితాలను చూస్తే టీఎంసీ 191, బీజేపీ 96, కాంగ్రెస్-లెప్ట్ కూటమి 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఈ ఫలితాల ట్రెండ్స్‌ను అధ్యయనం చేస్తే మరోసారి టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీనే అధికారాన్ని చేపట్టనున్నారని స్పష్టమైంది.
బీహార్‌లో మాదిరిగా నెమ్మదిగా పుంజుకుంటామని ఆశించిన బీజేపీకి రౌండ్ రౌండ్‌కూ నిరాశే ఎదురవుతూ వస్తోంది. ఒక దశలో ఐదారు సీట్ల తేడా ఉన్నట్టు కనిపించినా, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలకు వచ్చే సరికి టీఎంసీకి అనుకూలంగా మారుతూ వస్తోంది. దీంతో రౌండ్ రౌండ్‌కూ బీజేపీకి పశ్చిమ”బెంగే” అని చెప్పక తప్పదు.
అయితే పశ్చిమబెంగాల్ ఫలితాల్లో అందర్నీ ఆశ్చర్యపరిచే ఫలితం లేకపోలేదు. అది నందిగ్రామ్ అసెంబ్లీ నియోజక వర్గం. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిష్టకు వెళ్లి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీకి దిగారు. అక్కడ ఆమె వెనుకంజలో ఉండడం టీఎంసీ శ్రేణుల్ని నిరాశపరుస్తోంది.