కేసీఆర్ రాంగ్ టైమింగ్.. అలా చేసి ఉండకూడదు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి ఈటలకు మధ్య అభిప్రాయబేధాలున్నాయనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, కేసీఆర్ కమిటీ వేయడం, విచారణ చేపట్టడం, ప్రాధమిక నివేదిక రావడం, ఈటలను మంత్రి…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి ఈటలకు మధ్య అభిప్రాయబేధాలున్నాయనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, కేసీఆర్ కమిటీ వేయడం, విచారణ చేపట్టడం, ప్రాధమిక నివేదిక రావడం, ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడం అన్నీ గంటల వ్యవథిలో జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఓ కొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే రాంగ్ టైమింగ్. 

కేసీఆర్-ఈటల మధ్య ఎన్ని గొడవలు, అభిప్రాయబేధాలైనా ఉండొచ్చు. కానీ అత్యంత కీలకమైన సమయంలో ఆయన నుంచి వైద్యారోగ్య శాఖను తీసుకోవడం మాత్రం సరైన నిర్ణయం కాదు. తెలంగాణలో ఇప్పుడు రేయింబవళ్లు పనిచేస్తున్న శాఖ ఏదైనా ఉందంటే అది వైద్యారోగ్య శాఖ మాత్రమే. తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.

ఇలాంటి క్లిష్ట సమయంలో ఈటలను ఆ శాఖ నుంచి తప్పించడం తప్పు అంటున్నారు చాలామంది. కరోనా కల్లోలం తగ్గిన తర్వాత, అప్పుడు కావాలంటే ఈటలపై వేటు వేసి ఉండొచ్చని.. కరోనా పీక్ స్టేజ్ లో ఉన్న ఈ టైమ్ లో వైద్యశాఖ మంత్రిని తొలిగించడం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

నిజానికి ఈటలపై వేటు పడనుందనే విషయం ప్రభుత్వ పెద్దలందరికీ ముందే తెలుసు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడే, వారం కిందట ఈ విషయాన్ని మీడియా ముఖంగా కూడా చెప్పేశారు. అలాంటప్పుడు కొన్నాళ్లు ఆగి ఈటలపై కేసీఆర్ తన కసి తీర్చుకొని ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అధికారులు తమ పని తాము చేస్తారు. కిందిస్థాయి సిబ్బంది కూడా అధికారుల్ని ఫాలో అవుతారు. కానీ అందర్నీ సమన్వయం చేస్తూ, అటు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే మంత్రి స్థాయి వ్యక్తి ఒకరు ఉండాల్సిందే. అప్పుడే నిర్ణయాలు తొందరగా తీసుకోవడానికి వీలవుతుంది. ఓ మంత్రిని నేరుగా వెళ్లి కలిసే పైస్థాయి అధికారులు, ఇప్పుడు అంతే వేగంగా వెళ్లి ముఖ్యమంత్రిని కలవలేరు కదా. 

సరిగ్గా ఇక్కడే ఇబ్బందులు తలెత్తవచ్చని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వేధిస్తున్న ఈ టైమ్ లో మంత్రిని తప్పించడం అడ్మినిస్ట్రేషన్ పరంగా తలనొప్పులు తెచ్చిపెడుతుంది. మొన్నటివరకు మంత్రి స్థాయిలో ఈటల అన్నీ తానై వ్యవహరించారు. దాదాపు ఏడాదిన్నరగా పనిచేస్తున్న ఈటలకు.. కరోనాకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఉంది. 

టెస్టులు, హాస్పిటల్స్, ఐసొలేషన్ వార్డులు, ఆక్సిజన్ బెడ్స్.. ఇలా అన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. కేంద్రంతో వ్యక్తిగత స్థాయిలో టచ్ లో ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు, మంత్రులతో తనే స్వయంగా మాట్లాడి పనులు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇప్పుడివన్నీ చేయగలరా? 

ఇంతకుముందే చెప్పుకున్నట్టు చాలా విషయాల్ని అధికారులే చూసుకుంటున్నప్పటికీ.. కీలకమైన నిర్ణయాల విషయానికొచ్చేసరికి మాత్రం మంత్రి కావాల్సిందే. ఇప్పుడు తెలంగాణ వైద్యారోగ్య శాఖకు ఆ మంత్రే లేకుండా పోయారు.  అందుకే అంతా కేసీఆర్ ది రాంగ్ టైమింగ్ అంటున్నారు.