బిగ్ సండే.. మొదలైన ‘తిరుపతి’ కౌంటింగ్

ఇన్నాళ్లూ బీజేపీ కొట్టుకున్న డప్పు ఎంత పనికొచ్చిందో ఈరోజు తేలిపోతుంది. ప్రభుత్వంపై టీడీపీ చేసిన విషప్రచారం ఆ పార్టీకి ఏమైనా కలిసొచ్చిందా లేదా అనేది మరికొన్ని గంటల్లో లెక్క తేలుతుంది. వైసీపీకి గత మెజారిటీ…

ఇన్నాళ్లూ బీజేపీ కొట్టుకున్న డప్పు ఎంత పనికొచ్చిందో ఈరోజు తేలిపోతుంది. ప్రభుత్వంపై టీడీపీ చేసిన విషప్రచారం ఆ పార్టీకి ఏమైనా కలిసొచ్చిందా లేదా అనేది మరికొన్ని గంటల్లో లెక్క తేలుతుంది. వైసీపీకి గత మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందా అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడుతుంది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి కొద్దిసేపటి కిందట కౌంటింగ్ మొదలైంది.

ఈ ఉప ఎన్నికలో మొత్తం 11,02,068 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ పోటీ చేశారు. మొత్తంగా 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వార్ వన్ సైడ్ అయినప్పటికీ ఇక్కడ కొన్ని మెలికలున్నాయి.

నోటా కంటే తక్కువగా ఓట్లు తెచ్చుకున్న బీజేపీ, ఈ ఉప ఎన్నికతో తమ ఓట్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. అదే కనుక జరిగితే రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని చంకలు గుద్దుకోవడానికి ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇక టీడీపీ అయితే గోతికాడ నక్కలాగ ఎదురుచూస్తోంది. 

వైసీపీకి ఏమాత్రం మెజారిటీ తగ్గినా, ప్రజావ్యతిరేకత అనే అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి అను'కుల' మీడియాను సిద్ధంగా ఉంచింది. గెలుపు వైసీపీదే అయినప్పటికీ.. ఈ ఫ్యాక్టర్స్ కారణంగా ఈ ఎన్నిక ఇటు వైసీపీకి, అటు బీజేపీ-టీడీపీకి కీలకంగా మారింది.

కరోనా వ్యాక్సిన్ 2 డోసులు వేయించుకున్న వాళ్లు, 48 గంటల ముందు కరోనా టెస్ట్ చేయించుకున్న వాళ్లకు మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తున్నారు. వరుసగా కూర్చునే ప్రతి ముగ్గురు కౌంటింగ్ ఏజెంట్లలో, మధ్యలో ఉన్న వ్యక్తి మస్ట్ గా పీపీఈ కిట్ ధరించేలా నిబంధనలు మార్చారు.

వెయ్యి మంది సిబ్బంది ఈ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ముందుగా నెల్లూరులోని డీకే ప్రభుత్వ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తిచేస్తున్నారు. ఆ తర్వాత 25 రౌండ్లలో తుది ఫలితాల్ని వెల్లడిస్తారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు.