రాష్ట్ర మంత్రి, ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి బయటికి పంపేందుకు పక్కా ప్రణాళిక రచించారనే విషయం అర్థమైంది. ఈటల రాజేందర్ గెంటివేతకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈటలపై ఫిర్యాదులు, విచారణ, మంత్రిత్వ శాఖ తొలగింపు అంతా 24 గంటల్లోనే జరిగిపోయాయి. ఈటల రాజేందర్ భార్య పేరిట ఉన్న హేచరీస్ ఆక్రమణలో 66 ఎకరాల సీలింగ్, అసైన్డ్ భూములు ఉన్నట్టు రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు గుర్తించారు.
ఈటల భూకబ్జాపై రైతులు చేసిన ఫిర్యాదుతో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హాకీంపేట గ్రామాల పరిధిలో శనివారం రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. కలెక్టర్ హరీశ్ దగ్గరుండి పర్యవేక్షించారు. సాయంత్రానికి ఆరు పేజీల నివేదికను సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సమర్పించారు. అచ్చంపేట గ్రామ పరిధిలో 66 ఎకరాల మేర సీలింగ్, అసైన్డు భూములు ఆక్రమణకు గురయ్యాయని నిర్ధారిస్తూ సమర్పించడం విశేషం.
ఈటల రాజేందర్ భూఆక్రమణను కేసీఆర్ సర్కార్ తెరమీదకు తీసుకొచ్చిన క్రమంలో మరో బలమైన వాదన ముందుకొచ్చింది. ఉద్యమ సమయంలో ఇదే కేసీఆర్ చేసిన ప్రతిజ్ఞను అందరూ గుర్తు చేస్తున్నారు. నగరానికి సమీపంలో అసైన్డ్, ప్రభుత్వ భూమిలో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నుతానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత రామోజీకి కట్టబెట్టిన అసైన్డ్ భూమి గురించి ప్రస్తావిస్తూ …కేసీఆర్ సర్కార్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఉద్యమకారుడైన రాజేందర్‌కు అవమానాలు, ఉద్యమ ద్రోహి అయిన రామోజీకి భూసంతర్పణలా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు.
నగరానికి అత్యంత సమీపంలో 2,500 ఎకరాలకు పైగా స్థలాన్ని… పేద రైతుల పొట్టగొట్టి, బెదిరింపులకు పాల్పడి మరీ ఫిల్మ్ సిటీ కోసం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సొంతం చేసుకున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అప్పట్లో ఎకరాకు రూ.10-15 వేలు విదిలించి, పేద రైతుల్ని బెదిరించి మరీ భూముల్ని స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులు లేకపోలేదు. గతంలో టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూదందా సాగించారని నాడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అసైన్డ్ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, చివరికి భూ దాన భూముల్ని కూడా రామోజీ యథేచ్ఛగా దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించిన సంగతిని నేడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఈనాడు కథనాలు రాసింది. ఈ సందర్భంలో రామోజీ ఫిల్మ్ సిటీని వెయ్యి నాగళ్లతో దున్నే స్తానని కేసీఆర్ శపథం చేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌కు రామోజీ జీహుజూర్ అన్నారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నడం పక్కన పెడితే, పర్యాటక అభివృద్ధి కోసమంటూ తెలంగాణ ప్రభుత్వం 376 ఎకరాలను రామోజీ ఫిల్మ్ సిటీకి కట్టబెట్టిందనే వాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఆ భూములన్నీ కూడా అసైన్డ్ భూములే కావడం గమనార్హం.
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీం పట్నం మండలంలోని నాగన్ పల్లిలో 250 ఎకరాలు, అబ్దుల్లాపూర్ మెట్ లోని అనాజ్ పూర్ 125 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమినే ఫిల్మ్ సిటీ విస్తరణకు ఇచ్చినట్టు పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ఫిల్మ్ సిటీ యాజమాన్యం విస్తరణకు భూమి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.
మొత్తం భూమికి గాను రూ.37.65 కోట్లు రామోజీ ఫిల్మ్ సిటీ చెల్లించినట్టు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. అస్మదీయులకైతే ఒక న్యాయం, తస్మదీయులకైతే మరో న్యాయమా? అని ఈటల అనుచరులు నిలదీస్తున్నారు.
ఈటల రాజేందర్‌పై పనిగట్టుకుని వార్తా కథనాలను వండివారుస్తున్న పత్రికలు, చానళ్లు… ఇదే రామోజీ భూదందాపై రాసే, విజువల్స్ చూపే దమ్ము, ధైర్యం ఉన్నాయా? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. అక్రమాలను ప్రశ్నించడమే మీడియా నైజం అయితే …రామోజీ విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనేదే ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న.
సొదుం రమణ