కరోనా మహమ్మారీ వకీల్‌సాబ్‌ను కదిలించింది. ప్రశ్నించేలా చేసింది. జగన్ సర్కార్ పాలనలోని లోపాలను ఎత్తి చూపేందుకు లా పాయింట్లను వెతుక్కునేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే వకీల్‌సాబ్‌లో కరోనా చలనం తీసుకొచ్చింది.
కరోనా పరీక్షలు చేయలేని వారు పదో తరగతి, ఇంటర్ పరీక్షల్ని ఎలా నిర్వహిస్తారో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలని జనసేనాని పవన్‌కల్యాణ్ సరికొత్త లా పాయింట్ తీశారు.
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, కావున టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్‌పై ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించి తీరుతామని మొండిగా ముందుకెళుతోంది.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నూలు ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మరణించినా ప్రభుత్వంలో చలనం లేదని పవన్ తప్పు పట్టారు. ఆ ఆస్పత్రికి అనుమతులు లేవని, వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ శాఖలు ఏం చేస్తున్నాయని ఆయన నిలదీశారు.
పోలీసులు వెళ్లి తనిఖీ చేస్తే కానీ ఐసీయూలో రోగులు చనిపోయిన విషయం బయటకు రాలేదని గుర్తు చేశారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు అని ఆయన ప్రభుత్వాన్ని ఎండగట్టడం గమనార్హం.