కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, కాన్సర్ నుంచి కోలుకున్నారు. అమెరికాలోని మియామీ కాన్సర్ ఇనిస్టిట్యూట్ లో శివరాజ్ కుమార్ కు వారం రోజుల కిందట సక్సెస్ ఫుల్ గా సర్జరీ నిర్వహించారు వైద్యులు. ఆయన పూర్తిగా కాన్సర్ నుంచి కోలుకున్నట్టు తాజాగా ప్రకటించారు.
కొన్నాళ్లుగా ఆయన బ్లాడర్ కాన్సర్ తో బాధపడుతున్నారు. ఓవైపు కీమోథెరపీ తీసుకుంటూనే ఓ సినిమా పూర్తి చేశారు. ఆ వెంటనే అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. తనకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, కాన్సర్ నుంచి కోలుకున్నానని ఆయన ఈరోజు స్వయంగా ప్రకటిస్తూ, ఓ వీడియో రిలీజ్ చేశారు.
“నాకు కొంచెం భయమేసింది. కానీ దేవుడి దయతో, నా అభిమానుల ప్రేమతో నేను జయిస్తాననే నమ్మకం ఉంది. అదే ఇప్పుడు నిజమైంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. త్వరలోనే సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాను.”
శివరాజ్ కుమార్ కాన్సర్ బ్లాడర్‌ను వైద్యులు తొలిగించారు. ఆ స్థానంలో ఆయన ప్రేగులనే ఉపయోగించి, కృత్రిమ బ్లాడర్ ను తయారుచేసి అమర్చారు. మరికొన్ని వారాల పాటు మియామీలో ఉండబోతున్నారు శివరాజ్ కుమార్.
తెలుగులో ఆయన రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పూర్తిగా కోలుకున్న తర్వాత చరణ్ తో కలిసి సెట్స్ పైకి వస్తారు.
Just for joke, పాపం, బుచ్చిబాబు కి బ్లాడర్ కి ఏదో బంధం ఉన్నట్లుంది.