విషయం దొరికితే ట్విట్టర్ లో రెచ్చిపోవడం అంటే దర్శకుడు ఆర్జీవీ తరువాతే. కల్లు తాగిన కోతికి కొబ్బరికాయ దొరికితే ఆడేసుకున్నట్లు వుంటుంది వ్యవహారం. కరోనా టైమ్ లో ప్రధాని మోడీని సోషల్ మీడియానే ఓ ఆట ఆడేసుకుంటోంది. అలాంటిది ఆర్జీవీ ఎందుకు వదులుతాడు. అందుకే ట్వీట్ల మీద ట్వీట్ లు, సెటైర్లు, విమర్శలతో రెచ్చిపోతున్నాడు.
దాదాపు వారం రోజులుగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. అయితే ఎప్పుడూ ఆర్జీవీ ట్వట్లకు రివర్స్ లో వుంటుంది జనాల నుంచి వ్యవహారం. కానీ ఈసారి మాత్రం వేసిన ప్రతి ట్వీట్ ఆలోచించేలా వుంటున్నాయి. చాలా వరకు ఆర్జీవీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు నవ్వుకునేలా వున్నాయి. కొన్ని ఆలోచింపచేసేలా వున్నాయి.
పెళ్లిలో ఓ జిల్లా అధికారి పరమదురుసుగా వ్యవహరించిన వైనాన్ని వర్మ ట్విట్టర్ సాక్షిగా బలంగా ఎండగట్టారు. మోడీ ప్రజల ప్రాణాలతో ఆడేసుకుంటారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా 2014లో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆమె దూరదృష్టిని మెచ్చుకున్నారు. సోనియా పాదాల ఫొటో పంపిస్తే దండం పెడతా అన్నారు.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ట్విట్టర్ లో తన దృష్టికి వచ్చిన వాటిని, యూ ట్యూబ్ లో వచ్చిన ఆలోచింప చేసే విడియోలను, ఆఖరికి టిక్ టాక్ కరోనా ఫన్ ను ఇలా అన్నింటినీ అందిస్తూ, పదునైన విమర్శలను మోడీ మీద ఎక్కుపెడుతూ తన స్టయిల్ వేరు అని అనిపించుకుంటున్నాడు ఆర్జీవీ.