అవినీతిపరులతోనూ అధికార పార్టీకి ప్రయోజనం

అధికారంలో ఏ పార్టీ ఉన్నా అది కేంద్రంలో కావొచ్చు, రాష్ట్రాల్లో కావొచ్చు అవినీతి లేకుండా ఉండదు. సరిగ్గా చెప్పాలంటే అధికారం ఎక్కడ ఉంటుందో అవినీతి అక్కడ తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడున్నది పాత తరం రాజకీయ…

అధికారంలో ఏ పార్టీ ఉన్నా అది కేంద్రంలో కావొచ్చు, రాష్ట్రాల్లో కావొచ్చు అవినీతి లేకుండా ఉండదు. సరిగ్గా చెప్పాలంటే అధికారం ఎక్కడ ఉంటుందో అవినీతి అక్కడ తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడున్నది పాత తరం రాజకీయ నాయకులు కాదు. సత్తెకాలపు సత్తెయ్యలు కాదు. రాజకీయాలు ప్రజాసేవ కాదు. నాయకుడంటే ప్రజలకు సేవ చేసెడివాడు కాదు. ఏ ముఖ్యమంత్రికైనా తన మంత్రివర్గంలోని మంత్రులు చేసే అవినీతి గురించి తప్పక తెలుస్తుంది. అనేక వ్యవస్థలు ముఖ్యమంత్రి (కేంద్రంలో ప్రధానమంత్రి ) కనుసన్నల్లోనే ఉంటాయి.

ఇంటలిజెన్స్, పోలిస్ బాస్, సీఐడీ, ఇతర నిఘా వ్యవస్థలు … ఇలాంటివన్నీ ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాయి. ప్రతిపక్షాలు అధికార పార్టీ నాయకుల మీద, మంత్రుల మీద, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మీద అనేక అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. అవన్నీ పనికిమాలిన ఆరోపణలని చెప్పలేము. కొన్నైనా నిజాలుంటాయి. వాటి గురించి ముఖ్యమంత్రి ఆరా తీయకుండా ఉండడు. అలా తెలుసుకొని పక్కకు పెట్టుకుంటాడు. చర్యలు తీసుకోడు. 

అవినీతి చేసిన ప్రతి నాయకుడి మీద చర్యలు తీసుకుంటే చివరకు తన కుర్చీకే ఎసరొస్తుంది. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి సినిమాల్లో మాదిరిగా అవినీతిపరులను వెంటనే పట్టుకొని జైల్లో వేయడం కుదరదు. అవినీతిపరులైన మంత్రులనో, ప్రజాప్రతినిధులనో శిక్షించాలంటే అందుకు అనేక అంశాలు ఆలోచించాలి. అవినీతిపరుడి  సామాజిక వర్గం చూడాలి. రాజకీయంగా ఆ వర్గానికి ఎంత బలముందో చూడాలి. ఆ నాయకుడి ద్వారా,  ఆ వర్గం ద్వారా పార్టీకి  కలిగే ప్రయోజనాలు చూడాలి. ఇలా చాలా వ్యవహారాలుంటాయి.

కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా అవినీతికి పాల్పడిన  మంత్రులందరినీ శిక్షించలేడు. కాకపొతే రాజకీయంగా ప్రాధాన్యం లేకుండా చేయొచ్చు. ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వకపోవచ్చు. ఎలాంటి పదవులు ఇవ్వకపోవొచ్చు. కొందరు నాయకులు ఆర్ధికంగా బలంగా ఉండొచ్చు. అలాంటివారు అవినీతిపరులని తెలిసినా పట్టించుకోకపోవచ్చు. వారిని హెచ్చరించో, బెదిరించో వదిలేయవచ్చు. 

నాయకులందరినీ ఒకే మాదిరిగా ట్రీట్ చేడయడం కుదరదు. ఇప్పుడు ఈటల రాజేందర్ వ్యవహారమే తీసుకుంటే ….ఈటల నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే కేసీఆర్ కు ఆ విషయం ఇప్పటివరకు తెలియకుండా ఉండే అవకాశం లేదు . తప్పనిసరిగా తెలిసే ఉంటుంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఏం చేస్తున్నారో  తెలుసుకోవడం ముఖ్యమంత్రి బాధ్యత. ప్రతిఒక్కరి గురించి ఇంటలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి వివేదికలు ఇస్తారు. మీడియాలో కూడా అనేక వార్తలు వస్తాయి కదా. మంత్రులుగానీ, ఇతర నాయకులు గానీ తోక జాడించినప్పుడు వారిని పిలిచి నీ అవినీతి చరిత్ర నా దగ్గర ఉంది. ఇది బయట పెడితే నీ పని మటాష్ అని చెబుతారు . దీంతో ఆ నాయకుడు గమ్మున ఉండిపోతాడు. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు తోక జాడించే నాయకులను పిలిపించి ఇలాగే బెదిరించేవాడని చెప్పేవారు. 

ఇతర పార్టీల నాయకులను అధికార పార్టీలో చేర్చుకోవాలంటే కూడా నువ్వు ఫలానా ఫలానా అవినీతి పనులు చేశావు. అధికార పార్టీలో చేరకపోతే నీ కథ ఉంటుంది అని చెబుతారు. దీంతో భయపడిపోయి అధికార పార్టీలో చేరతారు.  జగన్ అయినా అంతే. కేసీఆర్ అయినా అంతే. కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్ నాయకులను ఇలాగే బెదిరించి టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చారని చెబుతుంటారు.  సీఎం కేసీఆర్ ను ప్రతిపక్షాలు మీకు ఒక్క ఈటల అవినీతే కనిపించిందా ? మంత్రుల్లో ఇంకా అవినీతిపరులు ఉన్నారు కదా. వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు ? అని ప్రశ్నిస్తూ కొంతమంది పేర్లు చెబుతున్నారు. ఇది సరైన ప్రశ్నే.

కానీ ఈటల విషయంలో ఆయన అవినీతిపరుడని చర్యలు తీసుకోలేదు. రాజకీయంగా తనకు ప్రమాదకరంగా తయారయ్యాడనే అభిప్రాయంతో వెళ్లగొట్టడానికి వ్యూహం పన్నారు. అవినీతిపరులను ఏ ముఖ్యమంత్రి అయినా భరిస్తాడు, సహిస్తాడుగానీ రాజకీయంగా తనకు ప్రమాదకరంగా ఉంటే మాత్రం భరించడు, సహించడు. అవినీతిపరులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను త్వరలో జరగబోయే మంత్రివర్గ ప్రక్షాళనలో పక్కకు పెట్టొచ్చు. 

సాధారణంగా సీఎంలు ఇలాగే చేస్తుంటారు. ఈటల విషయంలోనూ అలా చేసుండొచ్చు. కానీ పార్టీ నుంచే సాగనంపాలని కేసీఆర్ అనుకున్నారు కాబట్టి అవినీతిపరుడిగా ముద్ర వేశారు. ఈటల 66 ఎకరాలు కబ్జా చేసినట్లు అధికారులు తేల్చారు. తాను ఎలాంటి అవినీతి చేయలేదని ఈటల అంటున్నాడు. ఈ ఎపిపోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.