అవకాశం దొరక్క మనిషి మంచోడిగా మిగిలిపోతాడంటారు. బలహీన క్షణంలో కూడా చలించకుండా ఉండేవాడ్నే మంచోడంటారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకట హర్ష అలా మంచోడిగా ఉండలేకపోయాడు. నమ్మకస్తుడిగా పేరుతెచ్చుకున్న వ్యక్తి, ఓ బలహీన క్షణంలో దొంగగా మారాడు. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు.
విజయవాడలోని రాహుల్ జ్యూవెలర్స్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడు వెంకట హర్ష. యజమాని మహావీర్ జైన్ వద్ద నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఓ బలహీన క్షణంలో తన అల్ప బుద్ధిని చాటుకున్నాడు వెంకట హర్ష. కళ్లముందు కనిపిస్తున్న బంగారాన్ని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.
మహావీర్ జైన్ సోదరుడికి కరోనా సోకింది. దీంతో మహావీర్ హాస్పిటల్ లోనే ఉండిపోయాడు. ఇదే అదనుగా భావించిన వెంకట హర్ష, తన ప్లాన్ అమలు చేశాడు. ముందుగా మహావీర్ జైన్ ఇంటికి వెళ్లాడు. యజమాని బంగారం తీసుకురమ్మాడంటూ జైన్ భార్యకు చెప్పాడు. అడిగింది గుమస్తా కావడంతో ఆమె అనుమానించలేదు.
అలా 2 బ్యాగుల్లో 10 కిలోల బంగారాన్ని ప్యాక్ చేశాడు. అక్కడితో ఆగకుండా యజమానికి చెందిన ఓ ఖాళీ చెక్ కూడా తీసుకున్నాడు. ఆ రెండింటితో తన ఊరు పారిపోయాడు. చెక్కుపై ఓనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, పోరంకిలోని ఓ బ్యాంక్ నుంచి 4 లక్షల 60వేలు డ్రా చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ వెంటనే కుటుంబంతో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు, తమ నెట్ వర్క్ ఆధారంగా వెంకట హర్షను పట్టుకున్నారు. అలా దురాశకు పోయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు హర్ష.