వీళ్ల మధ్య ఇంకో గొడవ ఏమిటంటే ఋణాలపై వడ్డీ రేట్లు! అందరి దగ్గరా డబ్బు ఆడాలంటే వాటిని తగ్గించాలి. కానీ అలా చేస్తే ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతాయి. అందుకని ఆర్బిఐ ఒప్పుకోదు. గతంలో కూడా ఆర్‌బిఐకు, ప్రభుత్వాలకు మధ్య యీ విషయంలో అనేక గొడవలు అవుతూ వచ్చాయి. అవన్నీ ఎవరో చెపితే తప్ప బయటకు వచ్చేవి కావు. ఈసారి అలాటి మొహమాటాలు లేకుండా ప్రభుత్వం రచ్చ కెక్కింది. వడ్డీ రేట్లపై చర్చిద్దాం రండి అంటూ ఆర్థిక శాఖ పిలిచింది. వారి డిమాండ్ ఏమిటో ముందే తెలుసు కాబట్టి, 'అది మా పరిధిలోని అంశం, చర్చించడానికి ఏమీ లేదు' అని ఆర్బిఐ తిరస్కరించింది.
దాంతో ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన అరవింద్ సుబ్రమణియన్ (దరిమిలా యీ జూన్‌లో యీయన రాజీనామా చేశాడు, ఆయనతో బాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగరియా కూడా!) ఆర్బిఐ వడ్డీ విధానాన్ని బహిరంగంగా దుయ్యబట్టాడు. దాంతో బాటే తాము బ్యాంకులకు రీకాపిటలైజేషన్ రూపేణా యిచ్చిన రూ. 2.11 లక్షల కోట్ల కారణంగా ఏర్పడిన లోటు భర్తీ చేయడానికి ఆర్బిఐ తన రిజర్వ్ ఫండ్స్ నుండి ప్రభుత్వ ఖజానాకు నిధులు తరలించాలి (దీన్ని డివిడెండ్ అంటారు) అన్నాడు. పోనుపోను యిదే ప్రధానమైన విషయం అయిపోయింది.
గడ్డు రోజులలో కలిగే ఆటుపోట్లు తట్టుకోవడానికి ప్రతీ సంస్థా రిజర్వు ఫండ్స్ పెట్టుకుంటుంది. అలాగే ఆర్బిఐ కూడా రూపాయి మారకం విలువ పడిపోయినప్పుడు, తన వద్ద ఉన్న ప్రభుత్వ బ్యాండ్ల విలువ తరిగినప్పుడు వచ్చే యిబ్బందులను అధిగమించడానికి మొత్తం ఎసెట్స్‌లో 28.92%ని (19.11%ను గోల్డ్ వాల్యుయేషన్ రిజర్వ్ 6.41%ను కంటింజెన్సీ రిజర్వ్ కలిపి) ఉంచుకుంది. అంతకు పైగా ఉన్న నిధులను అది ప్రభుత్వానికి యిచ్చేస్తూ ఉంటుంది. 2016 జులై-2017 జూన్ మధ్య యిప్పటికే 36,600 కోట్లు బదిలీ చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ముగియడానికి నాలుగు రోజుల ముందే ఆర్బిఐ రూ.10 వేల కోట్ల మిగులు సొమ్మును బదిలీ చేసింది.
తను చేసే ఖర్చులకు అది చాలటం లేదు కాబట్టి ఆర్థిక శాఖ 'ఆర్బిఐ అంతంత రిజర్వులు పెట్టుకోనక్కరలేదు. వాళ్లు లేనిపోని భయాలు పెట్టుకుని, రాబోయే రిస్కుల గురించి చాలా కన్సర్వేటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఆ మాటకొస్తే ఆ డబ్బంతా ప్రభుత్వానిదే' అని వాదిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాని క్రితం 2013-14లో ఆర్బిఐ వద్ద గోల్డ్ రివాల్యుయేషన్ రిజర్వ్ 21.8%, కంటింజెన్సీ రిజర్వ్ 8.4% ఉండింది. అందువలన అప్పటి ఆర్బిఐ గవర్నరు అదనంగా ఉన్నదాన్ని ప్రభుత్వానికి యిచ్చేశాడు. ఇప్పుడు ఈ మాత్రమైనా ఉంచుకోకపోతే చాలా ముప్పు అని ఆర్బిఐ వాదన. వాటిని ఊడ్చి వేస్తే గతంలో లాగ బంగారాన్ని విదేశాలకు తాకట్టు పెట్టి ఉద్యోగుల జీతాలు యిచ్చే పరిస్థితి దాపురిస్తుంది.
ఇలా అధిక డివిడెండు కావాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడం అనుచితం అంటూ ఆర్బిఐ బోర్డు డైరక్టరు నచికేత్ మోరే వేలెత్తి చూపినందుకు అతనికి శిక్ష పడింది. రెండోసారి పొడిగించిన పదవీకాలం నాలుగేళ్లు ఉండగా 14 నెలల్లోనే అతన్ని తీసేసింది. అదీ ఆర్బిఐ గవర్నరుకు చెప్పకుండా! దానికా అధికారం ఉంది. ప్రధాని సారథ్యంలోని నియామకాల కమిటీ (ఎసిసి) ఆర్బిఐ గవర్నరును, నలుగురు డిప్యూటీ గవర్నర్లను, స్వతంత్ర డైరక్టర్లను ఎంపిక చేస్తుంది. వీరితో పాటు యితరత్రా డైరక్టర్లను కూడా నియమించేందుకు, తొలగించేందుకు కేంద్రానికి అధికారాలున్నాయి. ఎసిసి ఆగస్టులో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్మంచ్కు చెందిన ఎస్. గురుమూర్తిని, సహకార ఉద్యమనేత, విద్యార్థి రోజుల్లో ఎబివిపికి కోశాధికారి ఐన సతీశ్ మరాఠే లను ఆర్బిఐ సెంట్రల్ బోర్డులో నియమించారు.
బోర్డులో యీ యిద్దరితో బాటు మరో 5గురు ప్రభుత్వ నామినీలున్నారు. వారు టిసిఎస్‌కు సిఇఓగా చేసిన ఎన్.చంద్రశేఖరన్, భారత్ నరోత్తమ్ జోషీ, గుజరాత్‌కు 2005-07 మధ్య చీఫ్ సెక్రటరీగా చేసిన సుధీర్ మా(కడ్, వాజపేయి ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి వ్యవసాయ విషయాలపై సలహాదారైన డా. అశోక్ గులాటీ, వ్యాపారవేత్త మనీష్ సబర్వాల్. గురుమూర్తి ఒక సమావేశంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని అడ్డుకునేందుకు ఆర్బిఐ అట్టిపెట్టుకున్న ఏభై మిలియన్ డాలర్ల నిధిలోంచి కొంత ప్రభుత్వ ఖజానాకు తరలించారని సూచన చేశారు. కానీ ఊర్జిత్ ఒప్పుకోలేదు. మోరేను తీసేయడాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్ బాహాటంగా స్వాగతించింది.
అక్టోబరులో ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య సిసి ష్రాఫ్ స్మారకోపన్యాసంలో మాట్లాడుతూ 'ఆర్బిఐకి తన విధులను నిర్వహించడంలో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని యివ్వకపోతే, దేశీయ పరిశ్రమలూ, కేంద్రప్రభుత్వం కూడా ద్రవ్యమార్కెట్ల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని, ఆర్థిక వ్యవస్థను దహించక తప్పదని, ముఖ్యమైన రెగ్యులేటరీ సంస్థను చిన్నచూపు చూస్తే ఏదో ఒక రోజు అందరూ విచారించక తప్పని పరిస్థితి వస్తుందని' అన్నాడు. ప్రభుత్వాలు టి-20 మ్యాచ్‌లా స్వల్పకాలిక దృష్టితో ఉంటాయని, ఆర్‌బిఐది టెస్ట్ మ్యాచ్ ఎప్రోచ్లా దీర్ఘకాలిక దృష్టి అని పోలిక చెప్పాడు. 8 ఏళ్ల క్రితం అర్జెంటీనాలో పాలకులు యిలా వ్యవహరించి సెంట్రల్ బ్యాంకుపై పెత్తనం చలాయించిన కారణంగానే ఆ దేశం చావుదెబ్బ తిందనీ అన్నాడు.
ఈ సమావేశంలో యీ అంశంపై మాట్లాడడానికి అనుమతి యిచ్చిన ఊర్జిత్‌కు ధన్యవాదాలు చెప్పి, ఊర్జిత్ డైరక్షన్లోనే యిది జరిగినట్లు చాటి చెప్పాడు. దానికి తోడు యీ ఉపన్యాసం కాగానే ఆర్బిఐ ఉద్యోగుల సంఘం కూడా ఆర్థిక శాఖకు యిదే తరహాలో ఉత్తరం రాసింది. ఇది ధిక్కారం కింద తోచింది ఆ శాఖకు. నాలుగు రోజుల తర్వాత కేంద్రం ఆర్బిఐ చట్టంలోని 7 వ సెక్షన్ ప్రకారం ఆదేశాలు యివ్వడానికి తలపడిందని లీకులు యిచ్చింది. దాంతో ఆర్బిఐ గవర్నరు ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయబోతున్నారని వదంతులు గుప్పుమన్నాయి. ఆ వార్తతో మార్కెట్లు తల్లడిల్లాయి. ఆర్బిఐ స్వయంప్రతిపత్తిని గౌరవిస్తామని ఆర్థిక శాఖ వెంటనే ప్రకటన విడుదల చేసి, తక్షణ సంక్షోభాన్ని తప్పించినా ఆర్థిక మంత్రి ఆర్బిఐను వెక్కిరిస్తూ ట్వీట్లు చేశారు.
'గతంలో ఎన్‌పిఏలు పెరిగినప్పుడు ఆర్బిఐ కళ్లు మూసుకుని కూర్చుందా?' అంటూ! అదేమైనా రాజకీయ వ్యవస్థా? ఒక సంస్థ! గతం సరే, తాము ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని ఎన్‌పిఏలు వసూలు చేశారు అది కూడా చెప్పాల్సింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ఆర్బిఐ డైరక్టరు సుభాష్ చంద్ర గర్గ్, విరాళ్ ఆచార్యను వ్యక్తిగతంగా ఎద్దేవా చేస్తూ ప్రకటన చేశారు – అదీ ట్విట్టర్లోనే! ఇవన్నీ చూసి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యీ వివాదాన్ని తాము క్లోజ్‌గా పరిశీలిస్తున్నామని ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగాలేదన్నమాట నిజమే. పెట్రోలు ధర విపరీతంగా పెరుగుతోంది, రూపాయి విలువ తగ్గుతోంది, గత నెలలో విదేశీ మదుపర్లు 5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను మార్కెట్లనుంచి ఉపసంహరించారు. ఐఎల్ఎఫ్ఎస్ రూ.90 వేల కోట్ల అప్పులో కూరుకుపోవడంతో తాహతుకి మించి అప్పులిచ్చిన ఎన్పిఎఫ్సిలు కుదేలయ్యాయి. దానితో రుణాలు అందక అనేక రంగాలు దెబ్బ తిన్నాయి. అయితే దీనికి గాను ప్రభుత్వం తన వ్యయాన్ని అదుపులో పెట్టుకోవాలి.
ఓ పక్క భారీవిగ్రహాలకు, బుల్లెట్ రైళ్లకు ఖర్చు పెడుతున్నారు, ప్రభుత్వ సంస్థలకు కాంట్రాక్టులు రాకుండా ప్రయివేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. మరో పక్క డబ్బు లేదు కాబట్టి ఆర్బిఐ తన నిధులు కరిగించి యివ్వాలంటున్నారు. ఆర్‌బిఐకు తనకు వస్తున్న నెట్ ప్రాఫిట్స్‌లో (నికరలాభం) ఎంత శాతం ప్రభుత్వానికి తరలిస్తోందో చూస్తే పరిస్థితి అర్థమౌతుంది. 2011 ఆర్థిక సంవత్సరంలో 52.8%, 2012లో 37.2%, 2013లో 53.4% యివ్వగా 2014 నుంచి 99.99% యిచ్చేస్తోంది. అయినా ప్రభుత్వానికి ఆశ తీరటం లేదు. సెక్షన్ 7 (1) ప్రకారం ప్రభుత్వం మూడు లేఖలు రాసిందట. మొదటి దానిలో పిసిఏ కింద విద్యుత్ కంపెనీలకు ఆర్బిఐ మినహాయింపు యివ్వాలని, రెండో లేఖలో 3.6 లక్షల కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానాకు తరలించాలని, మూడో లేఖలో చిన్న, మధ్యస్థాయి కంపెనీలకు యిచ్చిన ఋణాల విషయంలో నిబంధనలు సడలించాలని అడిగిందట. తాము చేసిన నోట్ల రద్దు ప్రయోగం ఆ స్థాయి కంపెనీలు కుదేలై పోయాయి. వాటిని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయం. నవంబరు 2 న మోదీ మాట్లాడుతూ యీ వర్గాల సంస్థలకు కోటి రూ.ల లోపు ఋణాలను గంట లోపునే యిచ్చేస్తామని ప్రకటించారు. అలా యిస్తే గ్యారంటీలు అవీ సవ్యంగా ఉన్నాయో లేదో చూసుకునే సావకాశం ఉంటుందా? అదంతా తర్వాత చూసుకోవచ్చు, డబ్బు పంపిణీ చేయడమే ధ్యేయం యీ నిమిషంలో. అవి చావుబాకీల్లా తయారైతే అప్పుడు ఆర్బిఐను తిట్టవచ్చు, యిదీ ప్రభుత్వ దృక్పథం.
ఈ గొడవల్లో ఆరెస్సెస్ కూడా కలగజేసుకోవడం మరీ దురదృష్టం. ఆరెస్సెస్ ఆర్థిక విభాగాధిపతి అశ్వని మహాజన్ 'ప్రభుత్వంతో కలిసి పని చేయడం రాకపోతే రాజీనామా చేయడం ఉత్తమం' అని ఊర్జిత్‌కు సలహా యిచ్చే సాహసం చేశాడు. 55 సం.ల ఊర్జిత్ కెన్యాలో గుజరాతీ సంతతికి చెందినవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ, ఏల్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో పిఎచ్‌డి, ఆక్స్‌ఫర్డ్‌లో ఎంఫిల్ చేశారు. ఐఎంఎఫ్‌లో పని చేసి, 1998-2001లో ఎన్డిఏ హయాంలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కన్సల్టెంటుగా ఉన్నారు. రిలయన్స్, ఐడిఎఫ్సి, ఎంసిఎక్స్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్లలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వహించి, 'అస్మదీయుడు' అనిపించుకున్నాడు. అందుకే రఘురామ్ రాజన్ వారసుడిగా 2016 సెప్టెంబరులో ఆర్బిఐ గవర్నరు పదవికి ఎంపికయ్యారు. అలాటివాడు యీనాడు 'తస్మదీయుడు' అయిపోయి ఆరెస్సెస్ వారి చేత తిట్టించుకుంటున్నారు. అదీ చిత్రం!
7 (1) వ సెక్షన్ ప్రకారం ప్రభుత్వం కేంద్రం ఆర్‌బిఐకు ఆదేశాలివ్వాలి. అయితే గవర్నరును సంప్రదించిన తర్వాతనే ఆ పని చేయాలి' అని ఆర్బిఐ చట్టం పేర్కొంటోంది. 7 (2) ప్రకారం ఆర్బిఐని తన కేంద్ర బోర్డు డైరక్టర్ల ద్వారా నడిపించడానికి ప్రభుత్వం అధికారం ఉంది. అంటే గవర్నరుతో సహా అందర్నీ పీకేసి, తన కిష్టమైన వారిని డైరక్టర్లగా వేసేసుకుని ఆర్బిఐను నిర్వీర్యం చేసేయవచ్చు. అయితే యిప్పటిదాకా ఏ ప్రభుత్వమూ యింతకు తెగించలేదు. ప్రస్తుత ప్రభుత్వ సూచనను ఆమోదించడానికి గవర్నరు ఊర్జిత్ సిద్ధంగా లేరు కాబట్టి రాజీనామా యిచ్చి వెళ్లిపోతారని అనుకుంటున్నారు. ఇప్పటికే నోట్ల రద్దు ప్రయోగ వైఫల్యాన్ని తన నెత్తిన చుట్టి అంతర్జాతీయంగా తన పరువు తీశారని ఊర్జిత్ కుములుతున్నారని, తాజాగా చేస్తున్న ప్రతిపాదనను కూడా ఆమోదిస్తే, తన యిమేజి మరింత దెబ్బ తింటుందని ఆయన అనుకుంటున్నారని ఊహాగానాలు.
ప్రతి ప్రభుత్వమూ తమకు అనుకూలంగా ఉండేవారినే, తమతో భావసారూప్యత ఉండేవారినే అధిపతులుగా నియమిస్తుంది. కానీ వారిని ఒక గీత దాటి పుష్ చేయకూడదు. వడ్డించేవాడు మనవాడే కదాని అడ్డదిడ్డంగా వడ్డించమంటే ఎలా? వారు వ్యక్తిగతంగా నిజాయితీపరులు, ప్రతిభావంతులు. తమ కంటూ యిమేజి ఉన్నవారు. ఈ ఉద్యోగమే వారికి సర్వస్వం కాదు. ఇది కాకపోతే అంతర్జాతీయంగా మరో ఉద్యోగం చూసుకోగల సమర్థులు. ఒక హద్దుకి మీరి, వారు నియమాలు అధిగమించరు. ఒక చట్రానికి లోబడే పని చేస్తారు. వారిని విలన్లగా చిత్రీకరించి, పార్టీ వర్గాల చేత తిట్టించడం సబబు కాదు. గతంలో రఘురామ్ రాజన్‌పై చాలా నిందలు మోపారు.
ఆర్బిఐ గవర్నరుగా పని చేసిన వ్యక్తిని భారతీయుడే కాదని పొమ్మన్నారు. ఊర్జిత్ ప్రభుత్వం స్వయంగా ఎంపిక చేసిన మనిషి. ఆయనతోనూ పేచీ పడుతున్నారంటే అర్థమేమిటి? మేధావంతులైన అధికారులతో వ్యవహరించే తీరులో ఎక్కడో లోపం ఉందని! దాన్ని సవరించుకోకపోతే అనర్థం, ఆర్థిక సంక్షోభం తప్పదు. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య వేదికలలో మన ప్రభుత్వం యిమేజి పడిపోతుంది. అప్పుడు ఎఫ్‌డిఐలు రావు. మనతో ఒప్పందాలూ జరగవు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి అన్ని వ్యవస్థలూ కుప్పకూలుతున్నాయని, స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతున్నాయని ఆరోపించేవాళ్లకు అక్టోబరులో అంది వచ్చిన అస్త్రాలు – సిబిఐ, ఆర్బిఐ. సిబిఐలో అంతర్గత కలహాలు బజారు కెక్కి సంస్థ పరువు, ప్రభుత్వం పరువు వీధిన పడేస్తే, ఆర్బిఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడి నిప్పు రాజేసింది.
ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మరో ప్రతిపాదన తెస్తోంది. ప్రస్తుతం ఆర్బిఐ నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ మొత్తం నిధుల్లో 5.5%ని ఈక్విటీ రూపంలో మూలధన నిధిగా పెట్టాలి. దీన్ని ప్రభుత్వం 4.5%కి తగ్గించాలని చూస్తోంది. ఎందుకంటే బాసిల్-3 ప్రకారం 4.5% చాలు. అందుచేత 2019 మార్చి నుంచి 1% నిధులను విడుదల చేస్తే బ్యాంకులు ధారాళంగా ఋణాలు యిచ్చేయవచ్చు. ఆ మేరకు ఆర్బిఐ తన నిబంధనలు మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే బ్యాంకుల్లో డబ్బు దాచుకోవాలంటే గుండె గుభేలుమంటోంది. ఇక దాని మూలధన నిధి కూడా తగ్గించేస్తే బ్యాంకుల విశ్వసనీయత మరింత తగ్గి, బ్యాంకింగ్ రంగం మరింత దెబ్బ తినవచ్చు. అందుకే ఆర్బిఐ కుదరదంటోంది. దీనిపై కూడా నవంబరు 19న జరగబోయే ఆర్బిఐ కేంద్ర బోర్డు సమావేశంలో చర్చ జరగవచ్చట. అప్పుడు ఎలాటి బాణసంచా పేలుతుందో వేచి చూడాలి.
(ఫోటో – ఊర్జిత్, జేట్లే) (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2018)
[email protected]