ప్రతి సినిమా సెట్స్ లో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఎవరికి వారు తమ సినిమాల్ని ఆపేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాల్నే కరోనా కారణంగా ఆపేస్తుంటే.. టీవీ ఛానెళ్లు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నాయి. తెలుగులో లీడింగ్ లో ఉన్న ఏ ఒక్క టీవీ ఛానెల్, తమ షూటింగ్స్ ఆపడానికి ఇష్టపడడం లేదు. నిజం చెప్పాలంటే, ఎందుకైనా మంచిదని ఈ ఛానెళ్లు, తమ షూటింగ్స్ జోరు పెంచాయి.
మొన్నటికిమొన్న ఓ ఛానెల్ అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ వేసి ఓ కార్యక్రమం నిర్వహించింది. కట్ చేస్తే.. ఆ తర్వాత 3 రోజులకే దాదాపు 15 కరోనా కేసులు బయటపడ్డాయి. అయితే సదరు ఛానెల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఇంటికి పంపిచేసి, మిగతా సిబ్బందితో మళ్లీ షూటింగ్స్ కొనసాగిస్తున్నారు.
మరో ఛానెల్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆ ఛానెల్ లో అంతా థర్డ్ పార్టీ వ్యవహారం. సీరియల్ అయినా, ఈవెంట్ అయినా, రియాలిటీ షో అయినా.. అంతా థర్డ్ పార్టీకి అప్పజెప్పడం, అవుట్ పుట్ తీసుకోవడం చేస్తుంటారు. తాజాగా ఈ ఛానెల్ కు సంబంధించిన 3 షూటింగ్స్ లో 30 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. కొంతమంది సీరియల్ ఆర్టిస్టులకు సైతం టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది.
అయితే సదరు ఛానెల్ మాత్రం ఎలాంటి జాలి చూపించలేదు. మిగిలిన యూనిట్ సభ్యులతో షూటింగ్స్ కొనసాగించాలని హుకుం జారీచేసింది. పాజిటివ్ వచ్చిన ఆర్టిస్టుల్ని పక్కనపెట్టి, ఆ మేరకు సీరియల్ లో కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేసి షూటింగ్ కొనసాగిస్తున్నారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చెప్పేవరకు తాము షూటింగ్స్ ఆపేదిలేదని ఓపెన్ గా చెబుతున్నారు ఛానెల్ జనాలు.
ఓవైపు ప్రభుత్వమే స్వీయ నియంత్రణ పాటించమని చెబుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే షూటింగ్ చేయమని, వాయిదా వేసే అవకాశం ఉంటే వాయిదాకే మొగ్గుచూపాలని చెప్పింది. అయినప్పటికీ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ మాత్రం తగ్గడం లేదు.
చేతులకు శానిటైజర్లు రాసుకొని, ముఖానికి మాస్కులు పెట్టుకొని షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. గతేడాది కరోనా దెబ్బకు ఛానెళ్లన్నీ కుదేలయ్యాయి. భారీ నష్టాలు చూశాయి. మరోసారి నష్టాలు భరించేంత సీన్ లేదు. అందుకే ఇలా అన్నింటికీ తెగించి షూటింగ్స్ చేస్తున్నారు. సిబ్బంది ప్రాణాల్ని రిస్క్ లో పెడుతున్నారు.