'అయ్యారీ' కాంబో రిపీట్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సిద్దార్ధ మల్హోత్రా సరసన ఇంకోసారి నటించబోతోంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ 'ఎన్టీఆర్ బయోపిక్'లో శ్రీదేవి పాత్రలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. తమిళంలో కార్తీ హీరోగా రూపొందుతోన్న 'దేవ్', సూర్య హీరోగా తెరకెక్కుతోన్న 'ఎన్‌జికె', శివ కార్తికేయన్ హీరోగా నటిస్తోన్న సినిమా.. ఇలా రకుల్ కెరీర్ కాస్త బిజీగానే వుంది. తెలుగులో మాత్రం, రకుల్‌కి మునుపటి స్టార్‌డమ్ ఇప్పుడు లేదన్నది నిర్వివాదాంశం.
ఇక, 'అయ్యారీ' సినిమా విషయానికొస్తే, ఈ సినిమాపై అప్పట్లో రకుల్ చాలా ఆశలే పెట్టుకుంది. కానీ, సినిమాకి అంత సీన్ లేకపోగా, సినిమాలో నటించిన రకుల్‌కీ పెద్దగా పేరు రాలేదు. 'అసలు ఆ సినిమాలో రకుల్ ఎందుకు చేసింది.?' అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. మరి, ఈసారి రకుల్ ఎలాంటి పాత్ర పోషించబోతోందో.!
రకుల్ నటించబోయే కొత్త హిందీ సినిమా 'మర్జావాన్'. మిలాప్ జవేరీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సీక్వెల్‌లో నటిస్తోన్న తారా సుతారియా ఈ సినిమాలో మరో హీరోయిన్ కాగా, జెనీలియా భర్త.. బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కన్పించబోతున్నాడు.
చూద్దాం, ఈ ప్రయత్నంలో అయినా రకుల్ బాలీవుడ్‌లో హిట్ అందుకుంటుందేమో.! అన్నట్టు, రకుల్ హిందీలో 'దే దే ప్యార్' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే.