సీన్ రివర్స్ః మీటూ హీరోయిన్ సారీ చెప్పింది!

మీటూ ఉద్యమం మొదలైనప్పుడు తను కూడా బాధితురాలినే అంటూ.. కన్నడ మూవీ మేకర్లపై ఆరోపణలు చేసిన నటి సంజనా గల్రానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. తను చేసిన ఒక కన్నడ సినిమాలో తనచేత బలవంతంగా…

మీటూ ఉద్యమం మొదలైనప్పుడు తను కూడా బాధితురాలినే అంటూ.. కన్నడ మూవీ మేకర్లపై ఆరోపణలు చేసిన నటి సంజనా గల్రానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. తను చేసిన ఒక కన్నడ సినిమాలో తనచేత బలవంతంగా బోల్డ్ గా నటింపజేశారంటూ సన్నాయి నొక్కులు నొక్కిన ఈ భామ ఇప్పుడు మాట మార్చింది. తనుచేసిన ఆరోపణలను తనే ఖండిస్తూ.. సదరు మూవీ మేకర్స్ కు సారీ కూడా చెప్పింది ఈ నటీమణి.

మీ టూ వ్యవహారంలో నానిన ఒక వివాదం ఇలా వార్తల్లోకి వచ్చింది. హిందీలో సూపర్ హిట్ అయిన బోల్డ్ సినిమా 'మర్డర్' ను కన్నడలో రీమేక్ చేశారు. అందులో సంజన ప్రధాన పాత్రధారి. హిందీలో మల్లికా షెరావత్ చేసిన స్థాయికి తీసిపోని రీతిలో అంతే హాట్ గా కనిపించింది సంజన.

ఇదంతా జరిగి చాలా సంవత్సరాలు అయిపోయాయి. అయితే ఇటీవల ఆ విషయంలో సంజన స్పందించింది. మీటూ వ్యవహారంపై చర్చ జరుగుతున్న తరుణంలో సంజన మాట్లాడుతూ.. తనకు తెలీసీ తెలియని రోజుల్లో అలాంటి సినిమాలో నటించాను అని.. తను అలా నటించాల్సి ఉంటుందని సదరు మూవీ మేకర్లు ముందుగా తనకు చెప్పలేదని సంజన చెప్పుకొచ్చింది.

అయితే సంజనపై సదరు మూవీమేకర్లు ఫైర్ అయ్యారు. తాము సంజనను బలవంతం చేయలేదని స్పష్టంచేశారు. సంజన వాదనకు ఎక్కడా బలం లభించలేదు. ఎందుకంటే.. అదొక రీమేక్ సినిమా. ఒరిజినల్ ఎలా ఉందో.. ఒరిజినల్లో మల్లిక ఎలా నటించిందో సంజనకు తెలిసే ఉంటుంది.

ఒకవేళ డైరెక్ట్ కన్నడ సినిమాలో అలా బోల్డ్ గా నటించి ఉంటే.. సంజన వాదనకు ఊతం లభించేంది. రీమేక్ సినిమా కాబట్టి.. ఒరిజినల్ చూడకుండానే సైన్ చేశావా? అని ఎవరైనా అడుగుతారు. ఇలాంటి నేపథ్యంలో సంజన చేత ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లు గట్టి ఫైట్ చేశారు.

ఆమెపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై మండలి విచారించింది. సంజనదే పాల్ట్ గా తేల్చింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది!

వెనక్కి చూడకుండా పారిపో!… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్