విజయ్ దేవరకొండ… అర్జున్ రెడ్డికి ముందు ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తి. కానీ అర్జున్ రెడ్డి సక్సెస్ నుంచి ఇతడు 'మెగా'మనిషిగా మారాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు టోటల్ మెగాకాంపౌండ్ మొత్తం విజయ్ దేవరకొండకు బాసటగా నిలిచింది. ఇంటి అల్లుడు కంటే ఎక్కువగా విజయ్ దేవరకొండను చూసుకుంటోంది. అయితే ఇదంతా నిజమేనా..? దేవరకొండకు మెగాసపోర్ట్ కలకాలం కొనసాగుతుందా..?
కనీసం రూపాయి లాభం లేనిదే ఇంటి నుంచి కాలు బయటపెట్టరు మెగా మనుషులు. తమకు పనికొస్తారనుకునే వ్యక్తులకే వీళ్ల ప్రాధాన్యం. మిగతా జనాల్ని వీళ్లు కన్నెత్తి కూడా చూడరు. అలాంటి కాంపౌండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండను తన భుజాలపై కూర్చోబెట్టుకోవడానికి మెయిన్ రీజన్ గీతాఆర్ట్స్.
అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత గీతాఆర్ట్స్ బ్యానర్ పైనే 2 సినిమాలకు కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. కాకపోతే వివిధ కారణాల వల్ల ఆ రెండు సినిమాలు థియేటర్లలోకి రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఈ రెండేళ్లలో దేవరకొండను మెగా కాంపౌండ్ ఆకాశానికెత్తేసింది. అతడ్ని ఫ్యూచర్ సూపర్ స్టార్ ను చేసేసింది.
స్వయంగా చిరంజీవి లాంటి వ్యక్తి “స్టార్ క్లబ్ లోకి స్వాగతం” అంటూ దేవరకొండను మెచ్చుకున్నాడు. ఇక అల్లు అర్జున్ అయితే విజయ్ దేవరకొండను ఏకంగా తన సోల్ బ్రదర్ గా చెప్పుకొచ్చాడు. విజయ్ ను “సెల్ఫ్ మేడ్ స్టార్” అంటూ కితాబిచ్చాడు. విజయ్ యాక్టింగ్ ఇష్టపడే వ్యక్తుల్లో తనే ముందుంటానని చెప్పుకున్నాడు.
బన్నీ, చిరు మాత్రమే కాదు.. రామ్ చరణ్, అల్లు అరవింద్, నాగబాబు, చివరికి అల్లు శిరీష్ కూడా విజయ్ దేవరకొండను ఏదో ఒక సందర్భంలో మెచ్చుకున్న వాళ్లే. అయితే నిజంగా విజయ్ దేవరకొండ టాలెంట్ చూసి వీళ్లంతా మెచ్చుకుంటున్నారా.. లేక అతడు గీతాఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి పొగుడుతున్నారా..?
గీతగోవిందం రిలీజైపోయింది. ఈ వీకెండ్ టాక్సీవాలా వచ్చేస్తోంది. ఈ రెండు సినిమాలతో గీతాఆర్ట్స్ కు విజయ్ దేవరకొండకు మధ్య డీల్ క్లోజ్ అయిపోతుంది. టాక్సీవాలా తర్వాత కూడా విజయ్ దేవరకొండకు మెగా కాంపౌండ్ నుంచి ఇదే సపోర్ట్ దక్కుతుందా..? భవిష్యత్తులో విజయ్ దేవరకొండ నటించిన ఇంకేదైనా సినిమా ఫంక్షన్ కు ఆహ్వానిస్తే మెగా హీరోలు వస్తారా..? విజయ్ దేవరకొండ సినిమా ఏదైనా థియేటర్లలోకి వస్తే మెగాహీరోలు ట్వీట్లు పెడతారా?
మెగా కాంపౌండ్ మెచ్చుకోలు ఈ రెండు సినిమాలకేనా లేక విజయ్ దేవరకొండకు కలకాలం ఆ సపోర్టు ఉంటుందా..? అర్జున్ రెడ్డి హిట్ అయింది కాబట్టి గీతాఆర్ట్స్ బ్యానర్ పై 2 సినిమాలకు డీల్ సెట్ అయింది. భవిష్యత్తులో విజయ్ దేవరకొండకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులొస్తే అప్పుడు మెగా కాంపౌండ్ అతడ్ని ఆదుకుంటుందా..?
దేవరకొండకు మెగా అండ అనేది వాపా.. బలుపా..? టాక్సీవాలా విడుదల తర్వాత ఏదో ఒకరోజు ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.