స్వాతంత్ర్యానంతరం పుట్టిన మనలాటి వాళ్లకు లాహోర్ అనగానే అదేదో శత్రుప్రాంతం, అక్కడి సంస్కృతి మనకంటె భిన్నం అనే అనిపిస్తుంది. మన దేశప్రముఖుల్లో కొందరు అక్కడ చదివారనో, పని చేశారనో చదివినప్పుడు కాస్త వింతగా తోస్తుంది. కానీ అవిభక్త భారతంలో లాహోర్ వాతావరణం ఎలా వుండేది అనేది వివరంగా నాకు తెలిసినది – తిరుమల రామచంద్ర (1913-1997)గారి ఆత్మకథ ‘హంపీ నుంచి హరప్పా దాక’ ద్వారా. ఆయన మహానుభావుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. బహుభాషా పండితుడు. అనేకమంది ఉద్దండులతో కలిసి పనిచేశారు. తెలుగు భాషకు ఎంతో సేవ చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో వున్న హంపీలో పుట్టిన ఆయన జీవితంలో ఎంతో డ్రామా వుంది. తన ఆత్మకథలో ఎందరో ప్రముఖుల గురించి ఎన్నో విశేషాలు రాశారు. అందరూ చదివి తీరవలసిన యీ పుస్తకం అజోవిభొ ప్రచురణ.
26 ఏళ్ల వయసులో ఆయన లాహోర్ వెళ్లడం, ఆయన అక్కడ నివసించడం గురించి దీనిలో రాస్తున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ద్విపదభారతాన్ని ప్రచురించదలచి, తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో వున్న ప్రతులతో సరిచూసి ముద్రణ ప్రతి సిద్ధపరచడానికి తాళపత్ర గ్రంథ పరిశీలానుభవం వున్న పండితులిద్దరు కావాలని 1938 మేలో పత్రికలలో ప్రచురించింది. ఈయనకు తాళపత్ర గ్రంథ పరిశీలనలో, వాటిని చూసి రాయడంలో నాలుగేళ్ల అనుభవం వుంది. ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో కొన్ని నెలలపాటు పండిట్‌గా పనిచేశారు. చాలా భాషలు, లిపులు వచ్చు కాబట్టి యీయన్ని ఎంపిక చేసి నెలకు 40 రూ.ల జీతంపై సెప్టెంబరు నుంచి ఏడాదిపాటు కాంట్రాక్టుపై తీసుకున్నారు.
అక్కడ పనిచేస్తూండగానే 1939 ఏప్రిల్‌లో హిందూ పత్రికలో ఒక ప్రకటన వచ్చింది. లాహోర్‌లోని పంజాబ్ యూనివర్శిటీ లైబ్రరీలో దక్షిణ భారత లిపులలో వున్న తాళపత్రాది లిఖిత పుస్తకాలకు వర్ణనాత్మకసూచి (డిటైల్డ్ కేటలాగ్) తయారుచేయడానికి ఒక పండితుడు కావాలి. జీతం రూ.50 రూ.లు. ప్రయాణ ఖర్చులు, బత్తా యిస్తారు అని. ఈయన గ్రాజువేట్ కూడా కాదు. అయినా సంస్కృతంలో దరఖాస్తు పంపడం చేతనో ఏమో, ఉద్యోగం వచ్చింది. సెప్టెంబరు నుంచి రమ్మనమన్నారు. ఈలోగా తంజావూరులో పని పూర్తి అయిపోవడంతో ఆంధ్ర యూనివర్శిటీ వాళ్లు యీయన్ని మద్రాసు వెళ్లి రంగనాథ రామాయణం పరిష్కరణలో గతంలో ‘‘భారతి’’ పత్రికకు సంపాదకుడిగా పనిచేసిన గన్నవరపు సుబ్బరామయ్యగారికి తోడ్పడమన్నారు. మద్రాసు నుంచి దిల్లీకి మూడు రోజుల ప్రయాణం చేసి, అక్కణ్నుంచి ఒక పూట ప్రయాణంతో లాహోర్ చేరారు.
శ్రీరాముడి కొడుకు లవుడి పేరుమీదుగా వెలసిన లాహోర్ నగరాన్ని సిటీ ఆఫ్ గార్డెన్స్ అనేవారు. లావణ్యం ఒలికే నగరం అన్నారు రామచంద్రగారు. స్టేషన్ ఎదుట శుద్ధ శాకాహార్ భోజన్ అని బోర్డు వున్న హోటల్‌కి వెళ్లి స్నానం, భోజనం చేసి, అద్దెయింటి కోసం హోటల్ యజమానిని అడిగితే ‘పురానీ అనార్కలీ అనే ప్రాంతంలో మద్రాసీలు చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి పంజాబ్ వర్శిటీ కూడా దగ్గరే’ అన్నాడు. టోంగాలో ఆ ప్రాంతానికి వెళితే ఒక మిఠాయి దుకాణం కనబడింది. ‘పూడా’ అనే పేరుతో సొజ్జప్పాలు అమ్ముతున్నారు. అవి తిని, దుకాణదారుణ్ని అడిగితే ‘పక్క సందులో బషీన్ అనే వైశ్యుని యిల్లుంది.’ అన్నాడు. నెలకు 3 రూ.ల అద్దెకు మొదటి అంతస్తులో చిన్న గది దొరికింది. రెండో అంతస్తులో మరుగుదొడ్డి. పంజాబ్, సింధులలో మరుగుదొడ్లు చివరి అంతస్తులో వుంటాయట. మురికిగాలి పైకి పోతుందని వారి వాస్తువు. (ఈ –వు రామచంద్రగారు రాసినదే. సంస్కృత పదాలకు డుమువులు చేరిస్తే తెలుగు పదాలవుతాయనే సూత్రప్రకారం చేసినట్లున్నారు)
మర్నాడు లైబ్రరీకి వెళితే రెండు వేల తాళపత్రగ్రంథాలు తెలుగు, కన్నడ, గ్రంథ, మలయాళ, నందినాగరి, శారదా లిపులలో వున్నాయి. తెలుగు, కన్నడ, మలయాళం గురించి మనకు ఎలాగూ తెలుసు. తక్కినవాటి గురించిన సమాచారమేమిటంటే – నేడు మన దేశంలో ఇంగ్లీషు ఎలాగైతే లింకు భాషో, ప్రాచీనకాలంలో సంస్కృతం అలా వుండేది. విజ్ఞానం కావాలంటే ఆ భాషలోని గ్రంథాలు చదవాల్సిందే. అయితే దానికై విడిగా దేవనాగరి లిపి నేర్చుకోనవసరం లేకుండా, స్థానిక లిపిలోనే పుస్తకాలు రాసుకునేవారు. తెలుగు లిపిలో వున్న సంస్కృత గ్రంథాలెన్నో వున్నాయి.
సంస్కృతంలో వున్న అక్షరాలన్నీ, ఆ మాట కొస్తే అంతకంటె ఎక్కువ అక్షరాలు తెలుగులో వున్నాయి కాబట్టి మనకు యిబ్బంది లేకపోయింది కానీ తమిళం వంటి పరిమిత అక్షరాలున్న లిపిలో రాయాలంటే చాలా కష్టం. అందుకని పల్లవుల కాలంలో 4వ శతాబ్దంలో గ్రంథలిపి అని కనిపెట్టారు. సంస్కృత గ్రంథాలను యీ లిపిలో రాస్తే తమిళులు చదువుకోగలిగేవారు. ఈ లిపి నుంచే మలయాళ, సింహళ, థాయ్, జావనీస్ లిపులు పుట్టాయట. అనేక హిందూ దేవాలయాల్లో యీ లిపిలో రాసిన ఫలకాలున్నాయి. తమిళం, సంస్కృతం కలిపి రాసిన గ్రంథాలను (ఇలా రెండు భాషలు కలిపిన రచనలను మణిప్రవాళం అంటారు. మణి అంటే రత్నం, ప్రవాళం అంటే పగడం) యీ లిపిలో రాసేవారు. పోనుపోను వీరతమిళులు వచ్చి, దీన్ని పక్కకు పెట్టేశారు. తత్కారణంగా అనేకమంది తమిళుల సంస్కృత ఉచ్చారణ సరిగ్గా వుండదు.
దీన్ని అధిగమించడానికి కొందరు అవలంబించిన ఉపాయం గురించి ఇక్కడే చెప్తాను. తమిళ లిపిలో వున్న ఒక భగవద్గీత ప్రతిలో అక్షరాల కింద అంకెలు చూశాను. తమిళలిపిలో త, థ, ద, ధకు ఒకటే అక్షరం కాబట్టి, ధర్మక్షేత్రే.. అని రాయడానికై మొదటి అక్షరంగా ’త’ రాసి కింద 4 అని వేశారు. అలాగే కురుక్షేత్రే.. కోసం మొదటి అక్షరంగా ’క’ రాసి కింద 1 వేశారు. ఇలా అయితే సరైన ఉచ్చారణ వస్తుంది కానీ యీ పద్ధతి ఎక్కువగా వాడుకలో లేదు. సంస్కృత అక్షరాలు తమిళంలో లేనట్లే, కొన్ని ద్రావిడ భాషల అక్షరాలు సంస్కృత లిపిలో లేవు. తెలుగులో మనకున్న ‘ళ’ వాళ్లకు లేదు. ఎ, ఏ, ఒ, ఓ అని మనకు హ్రస్వం, దీర్ఘం ఉన్నాయి. వాళ్లకు దీర్ఘం ఒక్కటే.
అందువలన మన భాషా గ్రంథాలను సంస్కృతంలోకి రాయాలంటే దేవనాగరి సరిపోదనిపించి, నందినాగరి అనే బ్రాహ్మీలిపి ఆధారితమైన లిపిలో రాసేవారు. దీన్ని దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో బాటు పల్లవుల కాలంలో తమిళనాడులో కూడా వాడేవారు. ఇక శారదా లిపి కూడా బ్రాహ్మీలిపి కుటుంబం నుంచి వచ్చినదే. 8-12 శతాబ్దాల మధ్య ఆఫ్గనిస్తాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కశ్మీరులలో వుండేది. దీనిలోంచే గురుముఖి లిపి వచ్చిందంటారు. తక్కిన ప్రాంతాల్లో వాడడం మానేసినా కశ్మీరులో మాత్రం చాలాకాలం వరకు వాడుతూ వచ్చారు.
ఆ తాళపత్రాలలో సగానికి సగం శ్రుతి, స్మృతి గ్రంథాలు. కావ్యాలు చాలా తక్కువ. రెండంగుళాల వెడల్పున్న తాళపత్రాలపై ఒక్కో పత్రంపై 20 పంక్తులు చొప్పున ముత్యాలసరాల్లా తెలుగులో రాసిన దాశరథి తంత్రం అనే తంత్రశాస్త్ర గ్రంథం కనబడిందట. నాలుగు నెలల తర్వాత యూనివర్శిటీ తరఫున తాళపత్ర గ్రంథాల ఎగ్జిబిషన్ పెడితే అంత చిన్న చోటులో అంత అందంగా రాసిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపడ్డారట. తాళపత్ర గ్రంథాల సూచీకర్త వచ్చాడనగానే లాహోర్ కాలేజీల్లో పని చేసే హిందీ, సంస్కృత, ప్రాకృత పండితులందరూ వచ్చి యీయన్ని చూసిపోయారు. వారితో పాటు లాహోర్‌లోని కవిపండితులు, రచయితలు కూడా! వీరితో పాటు లాహోర్‌లో వున్న తెలుగువారు కూడా పరిచయమయ్యారు.
అక్కడి ప్రైవేటు వ్యాపారసంస్థలలో, రైల్వేలో, మిలటరీ అక్కవుంట్స్ శాఖలో, రాష్ట్ర శాసనసభలో ఉద్యోగులుగా తెలుగువారు చాలామంది వున్నారు. చాలా పెద్ద పోస్టుల్లో వున్నవారూ ఉన్నారు. ఒకాయన డిప్యూటీ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మిలటరీ ఎకౌంట్స్, మరో ఆయన పంజాబ్ వర్శిటీలో మాథ్స్ హెడ్. నెలకు వెయ్యి రూపాయల జీతం. అప్పట్లో నెల భోజనం టిక్కెట్టు 5 రూ.లంటే ఆ జీతం విలువెంతో అర్థమౌతుంది. తెలుగు విద్యార్థులూ అనేకమంది వున్నారు. ఒకరోజు రామచంద్ర గారు దయానంద ఆయుర్వేద కళాశాల ముందునుంచీ వెళుతూ కళాశాల స్థాపన శిలాఫలకం చూచి ఆశ్చర్యపడుతూ నిలబడితే, ఒకాయన బయటకు వచ్చి ఏమిటి సంగతి అని అడిగారు. ‘ఈ సంస్థకు శంకుస్థాపన చేసిన పండిత గోపాలాచార్యులుగారు మా ఆంధ్రుడు.’ అన్నారీయన. వెంటనే ఆ వ్యక్తి తలపాగ తీసి ‘నేను ప్రిన్సిపాల్‌ని. మా గురువుల దేశం వారు, స్వాగతం’ అన్నారట.
ఈయన లాహోర్‌లో వుండగా జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను పేర్కొన్నారు. అప్పట్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా వున్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు ఒక ఉపన్యాసం యివ్వడానికి లాహోర్ వస్తే ఏడెనిమిది వేల మంది పట్టే హాలు కిటకిటలాడింది. ‘సారే జహాఁ సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్ కూడా వచ్చి రాధాకృష్ణన్ గురించి ప్రస్తుతిస్తూ ప్రసంగించారు. సభానంతరం లాహోర్ మేధావులు రాధాకృష్ణన్ వెంట వినయంతో శిష్యుల్లా చరించారు. మలయాళ మహాకవి వల్లత్తోళ్ కథాకళి నృత్యబృందంతో వస్తే లాహోర్ ప్రజలు పట్టుతాపితాలు నేల మీద పరిచి స్వాగతం చెప్పారు. అసెంబ్లీ హాలులో జరిగిన సమావేశంలో వల్లత్తోళ్ సంస్కృతం, మలయాళంలో అనర్గళంగా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ హోం శాఖ కార్యదర్శిగా వున్న సర్ శంకరన్ నాయర్ ఇంగ్లీషులోకి అనువదించారు. తర్వాత కథాకళి ప్రదర్శనం జరిగింది. భారతీయసంస్కృతిని కాపాడుతున్నది దక్షిణాపథమే అని పంజాబీ ప్రముఖులు ప్రశంసించారు.
పంజాబ్ వర్శిటీలో సంస్కృతం, హిందీ, అరబ్బీ, ఫార్సీ, పంజాబీ, ఉర్దూ శాఖలుండేవి. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఖురైషీ ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు. అరబ్బీ, ఫార్సీలలో మహా విద్వాంసుడు. వర్శిటీ ఓరియంటల్ కాలేజీ (సంస్కృత, ప్రాకృత, హిందీ శాఖలు) ప్రిన్సిపాల్ మహోపాధ్యాయ మాధవశాస్త్రి భండారీ అంటే ఆయనకు ఎంతో గౌరవం. ‘మా అబ్బాయి పెళ్లికి మీరు వచ్చి మా యింట్లో బస చేయాలి. ఏ ఏర్పాట్లు చేయమంటారో చెప్పండి.’ అని అడిగారు. ‘మీ బంగ్లా కాంపౌండులోని తోటలో ఒక ప్రాంతాన్ని గోమయంతో మూడుసార్లు అలికి, రంగవల్లులు తీర్చి, బ్రాహ్మణుడు వండిన ప్రతి ఘృతపక్వ పదార్థాలను ఒక చుక్క గోమూత్రంతో ప్రోక్షించి పెట్టండి.’ అన్నారు. ఖురైషీ అలాగే చేసి ధన్యుణ్ని అనుకున్నాడు.
రామచంద్ర లాహోర్ నుంచి దీపావళికి అమృత్‌సర్ వెళితే అక్కడ మజీద్ మండీలో 30, 40 మంది తెలుగువాళ్ల పసుపు దుకాణాలు కనబడ్డాయట. ఈయన లాహోర్ నుంచి పశ్చిమాన ముల్తాన్ వరకు, తూర్పున ధరమ్‌శాలా వరకు తిరిగారు. పన్నెండు కోసులకు భాష మారుతుంది అన్నట్లు ప్రాంతం బట్టి మారుతుండే పంజాబీ భాషను ఆస్వాదిస్తూ, మన మధ్యాక్కర వంటి వారి హీర్ ఛందస్సులో పాటలు వింటూ, వారిళ్లలో ఆవ కూర, యవలపిండి రొట్టెలు, తామరతూళ్ల ఊరగాయలు తిన్నారు. ఆయన అక్కడ వుండగానే పూరణ్ భగత్ అనే పంజాబీ సినిమా చూశారు. సారంగధర కథను పోలిన కథ. రాజమండ్రిలో సారంగధరుడి కథ జరిగి వుండదని, ఒక్క పంజాబ్‌లోనే కాక యితర దేశాల్లో కూడా యిలాటి కథ వుందని ఈయన అభిప్రాయపడ్డారు.
ఈయన ఖద్దరే కడతారు. చలికాలంలో నెహ్రూ కోటు, మఫ్లర్ కొనడానికి ఖద్దరు స్టోర్స్‌కి వెళితే యీయన పంచెకట్టు చూసి, అది మాకూ నేర్పమని అక్కడ ఉద్యోగులు వెంటపడ్డారు. వారికి ఆ కళ నేర్పడానికి 2, 3 గంటలు పట్టింది. హైదరాబాదు ఆర్యసమాజ్ ఉద్యమంలో పాల్గొన్న ఒక ఉద్యోగి యీయన దగ్గరకి వచ్చి నా దగ్గర కొన్ని తెలుగు ఉత్తరాలున్నాయి. మీ గదికి వస్తాను. చదివి అర్థం చెప్పాలి.’ అన్నాడు. అవి ఖద్దరు వ్యాపారానికి సంబంధించినవి కావు. ఇతను హైదరాబాదులో వుండగా ఒక యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి లాహోర్‌కు తిరిగి వచ్చేశాడు. వచ్చి పెళ్లి చేసుకోమని వారానికి ఓ ఉత్తరం చొప్పున ఆమె రాస్తూ పోయింది. అన్నీ పెద్ద కట్టగా కట్టి యీయన దగ్గరకు తెచ్చాడు.
ఆ యువతి ఆవేదన చదివి చలించిన యీయన ‘పవిత్ర ఉద్యమంలో భాగంగా వెళ్లి మోసం చేసేవేమిటి?’ అని అడిగారు. ‘గురూజీ, పరిస్థితులు వికటించాయి. పిలుచుకుని వద్దామని రోజూ మథన పడుతున్నాను.’ అన్నాడతను. ‘ఇన్ని జాబులకు ఒక్క జవాబు కూడా రాయలేదా? ఎంత ఘాతుకుడివి?’ అంటే నీళ్లు నమిలాట్ట. ప్రతి ఉద్యమంలోనూ యిలాటివి ఎన్నో అని వ్యాఖ్యానించారు రామచంద్ర. ఈయన లాహోర్‌లో వుండగానే భవిష్యవాణి చెప్పడంలో దిట్టలైన తెలుగు గోసాయిలు వచ్చారట. ఓ సారి బజారులో ఒక శిఖ్కు యువకుడు నిప్పులపై నడవడం వంటి విద్యలు ప్రదర్శిస్తూ ‘నేను ఆంధ్రాలో కోడి రామమూర్తిగారి శిష్యుణ్ని. నాపేరు గుల్జార్ సింగ్ అయితే గుల్జార్ మూర్తి అని మార్చుకున్నాను. మా గురువుగారొక్కరే సింగ్. ఆయన ముందు మేమంతా మేకపిల్లలం.’ అని చెప్పుకున్నాడట.
వీళ్ల యిల్లుగలాయన చనిపోతే స్త్రీలు రోడ్ల మీద గొంతుక్కూచుని, మోకాళ్లు, రొమ్ములు, ముఖం కొట్టుకుంటూ, మృత్యుగీతాలు పాడుతూ మహా భయంకరంగా రోదించడం చూశారు. ఇదేమిటని అడిగితే ఆయన కూతురు చెప్పిందట – ‘ఏడవకపోతే ‘దుఃఖం లేదు, ఆస్తికి మాత్రం సిద్ధం’ అంటారు. ఏడ్చేవారు లేకపోతే కూలి పెట్టి అయినా ఏడిపిస్తారు. ఏడాదిపాటు ప్రతీ మాసికానికీ కూడా ఏడవాలి. దీని కోసం గీతాలు రాసేవారూ, పాడేవారూ వున్నారు.’ అని. చావు తర్వాత ఇల్లు ఖాళీ చేయమంటే యీయన వందమంది నివాసముండే ఒక పెద్ద మేడకు మారారు. స్టేన్స్ టీ కంపెనీ వారు టీ ప్రచారానికి పూనుకున్నపుడు ఆ మేడ ముందు పొద్దున్న ఐదు గంటలకే వ్యానులో వచ్చి, అందరికీ పళ్లపొడి, నాలుక గీచుకునే బద్దా యిచ్చి. 20 ఔన్సుల గ్లాసుతో టీ యిచ్చేవారు. అప్పుడప్పుడు బిస్కత్తులు కూడా. ఇలా ఆర్నెల్లు చేసి, మానేశారు. టీకి అలవాటు పడినవారు తిట్టుకుంటూ హోటల్‌కు వెళ్లి టీ తాగి రాసాగారు. రామారావు అనే కడపవాసి ఆ ప్రచారం అధికారిట.
దాశరథి రంగాచార్య ఆత్మకథ ‘జీవనయానం’లో కూడా తెలంగాణలో బ్రూక్‌బాండ్ టీ కంపెనీ యిలా అలవాటు చేయడం కనబడుతుంది. మొదట్లో టీ ఉచితంగా యిచ్చి, తర్వాత పాలు పట్టుకెళితే టీ డికాషన్ ఊరికే పోసి, అలవాటు పడ్డాక టీ పొట్లాలు కొనుక్కోమని చెప్పారు. ఇలాటి విశేషాలతో పంజాబీ వర్శిటీలో రామచంద్రగారి ఉద్యోగం ముగిసింది. కానీ అక్కడే వుండి బిఏ పూర్తి చేద్దామనుకున్నారు. మరి ఉద్యోగం కావాలి కదా. ఒక రోల్డుగోల్డు కంపెనీకి దక్షిణభారత భాషలు తెలిసిన గుమాస్తా కావాలంటే వెళ్లి కలిశారు. లాహోరుకు శివార్లలో శోభ్‌రాజ్ ఆనంద్ అని పంజాబీ కాయస్తుడు నడిపే కంపెనీ అది. అతను చాలా సమర్థుడు. ఉద్యోగులను చాలా బాగా చూసుకుంటాడు. ఈయనకు 60 రూ.లు జీతం యిచ్చాడు.
కానీ వ్యాపారంలో మోసం చేయడానికి దడవడు. కాకి బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ అని అమ్మేయడంతో బాటు, రకరకాల పేర్లు చెప్పి బోగస్ మందులు అమ్మేవాడు. వాటిని వాడాక వికటించినవాళ్లు ఫిర్యాదు ఉత్తరాలు రాసేవారు. ఇంగ్లీషు, హిందీలలో రాయమని వీళ్లు స్పష్టంగా చెప్పినా వాళ్లు స్వభాషలోనే రాసేవారు. వాటిని చదివించుకోవడానికే యీయన్ని పెట్టారు. చూడబోతే బస్తాల కొద్దీ ఉత్తరాలున్నాయి. వాటిలో తెలుగువారివి వేలల్లో వున్నాయి. రెండవ స్థానం కన్నడవారిది. మూడు తమిళులు. నాలుగు మలయాళీలు. బెంగాలీలు కూడా సంఖ్యలో తెలుగువారికి తూగారు. అవి చదువుతూంటే రామచంద్ర గారికి తెలుగువారి అమాయకత్వం, నగలపైన వ్యామోహం, కామప్రవృత్తి, తాయెత్తులపై వెర్రినమ్మకం – ఒకటేమిటి సకలవికారవైపరీత్యాలు పరిచయమయ్యాయి. సకల అభ్యుదయోద్యమాలలోనూ పురోగాములుగా వున్న తెలుగువారు యింత పతితులై పోయారా అనే ఆవేదనతో యీయన కుంగిపోయేవారు.
ఉత్తర సారాంశాలు క్లుప్తంగా చెప్పాలంటే – ‘మీ జలంధర్ గోల్డ్ నగలు బంగీ విప్పగానే నల్లబడిపోయాయి’, ‘మీ లండన్ గోల్డ్ నగలు వట్టి యిత్తడి రేకులు’, ‘మీరు పంపిన వశీకరణం తాయెత్తు కట్టుకుని కాలేజీలో అమ్మాయి చుట్టూ తిరిగితే ఆమె కన్నెత్తి చూడలేదు సరికదా, అన్నలు వచ్చి దేహశుద్ధి చేశారు’, ‘పరీక్షలో కొన్ని సబ్జెక్టులకే వెళదా మనుకున్నవాణ్ని మీ పరీక్షా పాస్ తావీజ్ కట్టుకున్నానన్న ధీమాతో అన్నిటికీ కట్టి, అన్నీ ఫెయిలయ్యాను’, ‘మీ అదాలత్ విజయ్ తావీజు వలన లక్ష రూపాయల దావాలో వకీలుకి డబ్బు బాగా ముట్టింది కానీ నాకు కేసు పోయింది’ ‘మీరు పంపిన స్తనవృద్ధి మలాము వలన దద్దర్లు లేచాయి తప్ప రొమ్ములు పెరగలేదు’ ‘మీ ఆలస్యభావప్రాప్తి, అంగవృద్ధి మందులు వాడితే ఫలితం సంగతి దేవుడెరుగు కానీ పుండ్లు పుట్టుకుని వచ్చి మానడానికి నెల పట్టి, సుఖానికి దూరంగా వుండాల్సి వచ్చింది.’
వీటిలో బూతులు తిడుతూ, కేసులు పెడతామని బెదిరిస్తూ రాసినవే చాలా వుండేవి. వాటిని సభ్యభాషలోకి అనువదించి వెళ్లి చూపితే యజమాని ఏమీ చలించకుండా ‘సామాన్యులు రాసినవి చింపి బుట్టలో వేయండి. పోలీసు అధికారులు, న్యాయవాదులు, పెద్ద ఉద్యోగులు రాసినవి విడిగా పెట్టి, మన నగలలో సంవత్సరం పాటు నల్లబడనివి పంపుదాం. దద్దుర్లు, పుండ్లు అన్నవాళ్లకు ప్యాకింగులో పొరపాటు జరిగి వేరేది పంపించాం. గేదె వెన్న పులిమితే, మంట చల్లారుతుందని రాయండి…’ అంటూ యిలా చెప్పేవాడు. మూడు నెలల పాటు ఆ ఉద్యోగం చేసేసరికి రామచంద్ర గారికి అసహ్యం వేసింది. ఈ మోసగాడి వ్యాపారానికి సహకరించడానికి మనసొప్పక ఉద్యోగం వదిలేసి, పురానీ అనార్కలీలో ఒక దక్షిణాది వ్యక్తి నడుపుతున్న హైస్కూలులో హిందీ ఉపాధ్యాయుడిగా చేరారు.
రామచంద్ర గారి పుస్తకంలో యితర విశేషాల గురించి మళ్లీ ఎప్పుడైనా రాస్తాను. ఈ జలంధర్ మాయల్లో ప్రజలు యిప్పటికీ పడుతున్నారు. ఆయన రాసినది 1940 విశేషాలు కదా. 1960లలో కూడా తెలుగు పత్రికలలో వశీకరణం ఉంగరాలు, ఇంట్లోనే సినిమా ప్రొజెక్టరు, బొమ్మ తుపాకీ, ట్రాన్సిస్టర్లు, తాయెత్తులు, అంగవృద్ధి యాడ్స్ వస్తూనే వుండేవి. అన్నీ పంజాబ్‌వే. ఒక గడిలో అంకెలు నింపి పంపితే, బహుమతిగా ట్రాన్సిస్టర్ అనేవాళ్లు. తెప్పించినవాళ్లందరూ మోసపోయామని సణుక్కునేవారు. మళ్లీ కొత్త పిట్టలు వాళ్ల వలలో పడేవి. 1998లో ‘‘జలంధర్ మాయ’’ అనే కథ కూడా రాశాను నేను.
ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎప్రోచ్ అయ్యే పద్ధతి మారింది కానీ, వారి వంచనా, ప్రజల అమాయకత్వమూ అలాగే వున్నాయి. ఈ మధ్య పెళ్లి చేసుకుంటామని చెప్పి, అప్పు యిప్పిస్తామని చెప్పి, బాంకులో స్తబ్దంగా పడి వున్న డిపాజిట్ దోచుకుందామని చెప్పి.. యిలా వల విసురుతూనే వున్నారు. చదువుకున్నవాళ్లు, ఉన్నతోద్యోగులు కూడా వాటిలో పడుతున్నారు. రామచంద్రగారు రాసిన ప్రకారం ఆ కంపెనీ ద్వారా మోసగింప బడినవారిలో తెలుగువారిది ప్రథమస్థానం. ఈ కంపెనీల్లో కూడా ఎవరైనా స్టాటిస్టిక్స్ తీసి చూస్తే మనం ఎక్కడుంటామో!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)