cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: శ్రీకారం

మూవీ రివ్యూ: శ్రీకారం

చిత్రం: శ్రీకారం
రేటింగ్: 2.5/5
తారాగణం: శర్వానంద్,  ప్రియాంక అరుల్ మోహన్, సాయికుమార్, రావు రమేష్, మురళిశర్మ, నరేష్, ఆమని, సప్తగిరి, సత్య తదితరులు
సంగీతం: మిక్కి జె మేయెర్
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్  
కెమెరా: యువరాజ్
నిర్మాత: రాం ఆచంట, గోపిచంద్ ఆచంట
దర్శకత్వం: కిషోర్ బి
విడుదల తేదీ: 11 మార్చ్ 2021.

కరోనా కాలం ముందు తయారయ్యి, ఏప్రిల్ 24- 2020 విడుదల తేదీగా ప్రకటింపబడి, లాక్డవున్ కారణంగా వాయిదా వేయబడి, దాదాపు ఏడాది తర్వాత మహా శివరాత్రి రోజున విడుదలైన చిత్రం ఈ "శ్రీకారం". 

ట్రైలర్లోనే ఇది వ్యవసాయాత్మక చిత్రం అని చెప్పేసారు. పబ్లిసిటీలో కూడా అదే విషయం చెబుతూ తండ్రి-కొడుకు మధ్యన నడిచే కథ అని కూడా బయట పెట్టారు. ఈ సినిమాలో ఏమైనా ప్రత్యేకత ఉందా, లేక గతంలో చూసిన సినిమాలను గుర్తుచేసేదిగా ఉందా అనే అంశంలోకి వెళదాం.

కార్తిక్ (శర్వానంద్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. పండక్కి తన సొంత ఊరు వస్తాడు. నాలుగు రోజులు పాటలతో గడిపి అందర్నీ కలిసి మళ్లీ ఉద్యోగానికి వెళ్తాడు. అక్కడ తనకి ప్రమోషన్ వచ్చినా, అమెరికా వెళ్ళే అవకాశం తలుపు తట్టినా కూడా తన మనసు పల్లె, పొలం మీద ఉంటుంది. దాంతో ఉద్యోగం మానేసి వ్యవసాయం చేసుకుంటానని పల్లెకి వచ్చేస్తాడు. అతని పేద తండ్రి కేశవులుకి (రావు రమేష్) కి అది నచ్చదు. వర్తమానం, భవిష్యత్తు లేని వ్యవసాయాన్ని నమ్ముకోవడం సరైన నిర్ణయం కాదని అతని స్వానుభవంతో కూడిన అభిప్రాయం. అక్కడి నుంచి ఏం జరుగుతుంది? కార్తిక్ తన ఆసక్తికి తెలివిని ఎలా జోడించి ఏ విధంగా విజయం పొందుతాడు అనేది మిగతా కథ. 

రుద్రవీణలో చిరంజీవి- జెమిని గణేశన్ టైపు భావోద్వేగాల్ని తెర మీద చూపించే ప్రయత్నం చేసారు. అయితే కేవలం సెంటిమెంటుని, బాధ్యతని చూపిస్తే మంచి సినిమా అనిపించుకుంటుందేమో గానీ కమెర్షియల్ అనిపించుకోవడం కష్టం. 

శ్రీమంతుడు, మహర్షి, భీష్మ లాంటి సినిమాలన్నీ ఇటువంటి సందేశంతో పాటు పక్కా కమెర్షియల్ అనిపించుకోగలిగాయి. అందుకు ప్రధాన కారణం బలమైన ప్రతినాయకుడు ఉండడం. ఆ లోపం ఈ "శ్రీకారం" లో ప్రస్ఫుటంగా కనపడింది. సాయికుమార్ పాత్ర కాసేపు కనపడినా ఆ విలనీలో బలం లెదు. నాలుగు మాటలకి మంచివాడిగా మారిపోయే మెచ్యూరిటీ బయట చాలామందికి ఉండొచ్చు కానీ, కమెర్షియల్ సినిమాకి అది సరిపోదు. 

శర్వానంద్ నటన గురించి వంకపెట్టాల్సిన పని లేదు. సటిల్ గా చేసాడు. ఒక చిన్న ఫైట్ ను మినహాయిస్తే మిగతా సినిమా అంతా సగటు యువకుడిలాగానే కనిపించాడు. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ చూడడానికి బాగుంది. నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. తండ్రిగా రావు రమేష్ మెప్పించాడు. చిత్తూరు యాస కూడా ఈజ్ తో పలికాడు. సాయికుమార్ తన పాత్రకు న్యాయం చేసాడు. సత్య, సప్తగిరి కాసేపు నవ్వించారు. ఆమని హీరో తల్లి పాత్రలో కనిపించింది. 

టెక్నికల్గా పరిశీలిస్తే సంగీతం బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం రెండూ రిచ్ గా, వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాల బలాన్ని పెంచేదిగా ఉంది. కెమెరా వర్క్ కూడా మెచ్చుకోదగ్గదిగా ఉంది. ఎడిటింగ్ ఎలా ఉండాలో అలా ఉంది.

"అంతా మంచితనమే...అందరూ మంచివాళ్లే" అనిపిస్తూ ... పల్లె వాతావరణం, బంధాలు, బాధ్యతలు చూపిస్తూ శ్రీకాంత్ అడ్డాల-సతీష్ వేగేశ్న తీసే సినిమాల టైపులో ఉంది ఈ శ్రీకారం. 

మనసుకి హత్తుకునే సన్నివేశాలు కొన్ని ఉన్నా ప్రేక్షకులు ఒక పండగలాగ కుటుంబ సమేతంగా థియేటర్స్ ని నింపేసే బలం ఈ కథనంలో లోపించింది. ఏది ఏమైనా దర్శకుడు బి.కిషోర్ ది ప్రశంసించదగ్గ ప్రయత్నమే. ఇంకొన్ని కమెర్షియల్ రంగులు అద్ది బలమైన కాన్-ఫ్లిక్ట్ పాయింట్ తో నడిపించుంటే ఈ సినిమా వేరే స్థాయిలో ఉండేది. 

బాటం లైన్: వ్యవసాయాత్మకం

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×