సిట్ తనిఖీలు : సరైన చోటనే శ్రీకారం!

గత అయిదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది… రాజధాని ముసుగులో ఎలాంటి అక్రమాలు, అరాచకాలు చోటు చేసుకున్నాయి.. అనే విషయంలో ఇప్పటికే కొత్త ప్రభుత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం ఒక నివేదిక…

గత అయిదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది… రాజధాని ముసుగులో ఎలాంటి అక్రమాలు, అరాచకాలు చోటు చేసుకున్నాయి.. అనే విషయంలో ఇప్పటికే కొత్త ప్రభుత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం ఒక నివేదిక తయారుచేసింది.

తాజాగా నియమించిన సిట్.. ఆ ఉపసంఘం నివేదిక ఆధారంగా… దర్యాప్తు జరిపే పనిలో ఉంది. ఈ సిట్ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుడిని, ఆయనకు బినామీగా ఉండగలరని అనుమానిస్తున్న మరో కాంట్రాక్టరును విచారించడంతో తమ పనిని ప్రారంభించింది.

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. అమరావతి ప్రాంతం, గుంటూరు జిల్లా పరిధిలో అనేక లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొన్నారు. భూకబ్జాలకు పాల్పడుతున్నట్లుగా, బినామీ పేర్లతో దందాలు నడిపిస్తున్నట్లుగా చాలా ఆరోపణలు వచ్చాయి. పుల్లారావు మంత్రిగా ఉండగా.. ఆయనకు అత్యంత సన్నిహితులైన వాళ్లు.. జిల్లా కలెక్టరు మీద కూడా విరుచుకుపడుతూ నోటికొచ్చినట్టల్లా దూషిస్తూ తూలనాడిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా పుల్లారావుపై వచ్చిన రకరకాల ఆరోపణలకు లెక్కేలేదు.

పైగా ప్రభుత్వాధినేతగా అప్పట్లో చంద్రబాబునాయుడు అచేతనత్వానికి కూడా పుల్లారావు ప్రతీకగా నిలిచారు. పుల్లారావును మంత్రివర్గం నుంచి తొలగించాలని ఒకస్థాయిలో చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతలోనే ఇతర ‘ఒత్తిడుల’ కారణంగా చంద్రబాబు ఆయనను కొనసాగించారు. చంద్రబాబు తమను ఏమీ చేయలేడనే ధీమాను ఆయన తరఫు వారు అప్పట్లో బహిరంగంగానే ప్రదర్శించినట్టు కూడా గుసగుసలు వినిపించాయి.

అమరావతి భూబాగోతాల నిగ్గు తేల్చదలచినప్పుడు.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చుట్టూ జరిగిన బినామీ బాగోతాలపై విచారణ ప్రారంభించడం.. గుడ్ బిగెనింగ్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తీగలాగితే డొంక ఎటూ కదులుతుందని… పుల్లారావుతో ప్రారంభమైన దర్యాప్తులో ఇంకా తెరవెనుక ఉండే పెద్దచేపలు అనేక మంది అక్రమాలు కూడా వెలుగులోకి వస్తాయని అంటున్నారు.

అవసరమైతే విచారణ జరిపించుకోండి.. భూలావాదేవీలపై విచారణలు చేయండి.. అంటూ ఇన్నాళ్లూ తెదేపా నేతలు సవాళ్లు విసిరారు. ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలైంది. వారు సిద్ధంగా ఉన్నారో లేదా మొహం చాటేస్తారో!!