ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. దేశంలో అత్యంత ధనికుల్లో టాప్ పొజిషన్లో ఉన్న ముఖేష్ అంబానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సమావేశం కావడం సర్వత్రా ఆసక్తిదాయకంగా మారింది. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటి నుంచి అంబానీలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సన్నిహిత సంబంధాలు నెరిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు తన వ్యవహారాలను ముఖేష్ ద్వారా చక్కబెట్టుకుంటుంటారు అనే అభిప్రాయాలున్నాయి. చంద్రబాబుకు సాన్నిహిత్యం దృష్ట్యా అంబానీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలైనంత దూరాన్ని పాటించింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆసక్తిదాయకమైన సమావేశం జరిగింది.
అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ తో ఒక వ్యాపారవేత్తగా అంబానీ సమావేశం కావడం పెద్ద విడ్డూరం కాదు. అయితే ఈ సమావేశం వెనుక మరో కారణం ఉందనే టాక్ వినిపిస్తూ ఉంది. అదే రాజ్యసభ సీటు! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కబోకే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి భారతీయ జనతా పార్టీకి ఇవ్వనున్నారనే ప్రచారం ఇప్పటికే సాగుతూ ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సమయంలోనే ఈ మేరకు వార్తలు వచ్చాయి. బీజేపీ ఖాతాలో ఆ సీటు ఎవరికి దక్కుతుందనేది కూడా చర్చనీయాంశంగా నిలిచింది. ఆ అవకాశం మరెవరికో కాదట.. ముఖేష్ అంబానీ సన్నిహితుడికే అని సమాచారం!
తన సన్నిహితుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం గురించి మాట్లాడటానికే ముఖేష్ అంబానీ వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఒక రాజ్యసభ సీటును ఇచ్చే విషయమై ప్రతిపాదన బీజేపీ పెద్దలు పెట్టినా, అంబానీ కూడా తనవంతుగా జగన్ తో సమావేశం అయ్యి తన అనునూయిని రాజ్యసభకు పంపించే విషయం మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది.