పేరుకే అమరావతి జేఏసీ ఉద్యమ సంస్థ. ఆ సంస్థ ప్రతి చర్యా రాజకీయమే అనే విమర్శలు లేకపోలేదు. రాజకీయం, లౌక్యంలో రాజకీయ పార్టీలను మించిపోయిందనే అభిప్రాయాలు లేకపోలేదు. నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అనే చందంగా ఆ సంస్థ వ్యవహారశైలి ఉందని పలువురు మండిపడుతున్నారు.
ఆ సంస్థ ఎత్తుగడను సీపీఎం పసిగట్టింది. అందుకే నిన్నటి వెబ్‌నార్ సదస్సుకు సీపీఎం దూరంగా ఉండిపోయింది. ఇక చంద్రబాబు జేబు సంస్థగా మారిన మరో వాపపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాత్రం, తమకే సిద్ధాంతం, విలువలు లేవని నిరూపించుకున్నారు.
అమరావతి ఉద్యమానికి 500 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి జేఏసీ వెబినార్ నిర్వహించింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్లడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత కారణమో, కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా అంతే బాధ్యత వహించాలి. అయితే ఏపీ బీజేపీ మాత్రం చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వం, పార్టీ వేర్వేరు అనే వాదనను తెరమీదకి తెచ్చింది. ఇదంతా అమరావతి వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే తప్ప, ఆ పార్టీ వాదనలో పసలేదని చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు.
ఇటీవల అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు బీజేపీ ముఖ్య నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డిపై దాడికి పాల్పడడాన్ని ఎలా చూడాలి? అమరావతి తరలింపులో ఆ పార్టీ భాగస్వామ్యం, అలాగే ఉద్యమంపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారనే అక్కసే బీజేపీ నేతపై దాడికి పాల్పడేలా చేసిందనేది నిజం.
ఇప్పుడు దాడికి పాల్పడిన శ్రీనివాసరావు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. వెబ్‌నార్‌లో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రత్యక్షమయ్యారు. అమరావతి కోసం నిజంగా పరి తపించే వాళ్లని తప్పించి, బీజేపీ ప్రసన్నం కోసం అమరావతి జేఏసీ వెంపర్లాడడం స్పష్టంగా కనిపించింది.
ఒకటి కాదు, ఎన్ని రాజధానులైనా ఏర్పాటు చేసుకోవచ్చని, రాజధానుల ఎంపికలో తమ ప్రమేయం లేదని ఏకంగా కోర్టులో రెండుసార్లు అఫిడవిట్లు వేసిన బీజేపీ …అమరావతికి ఎలా అనుకూలమైందో జేఏసీ సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతికి ద్రోహం చేసిన మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉంది అంటే …అది బీజేపీనే అని అమరావతి ఉద్యమకారులు పలు సందర్భాల్లో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ అమరావతి జేఏసీకి మాత్రం బీజేపీ ఎలా ముద్దొచ్చిందో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
వెబ్‌నార్‌లో సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి అనేది బీజేపీ వైఖరి అని స్పష్టం చేశారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ రెండు మాటలతోనే బీజేపీ చాలా నిజాయతీ గల నిఖార్సైన అమరావతి పరిరక్షణ పార్టీగా కనిపిస్తోందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వెబ్‌నార్‌లో బీజేపీ పాల్గొనడాన్ని వ్యతిరేకించిన ఏకైక పార్టీ సీపీఎం.
బీజేపీ వైఖరిని ఎండగడుతూ అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఓ లేఖ రాశారు.
“రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. అమరావతి రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్న ఆ పార్టీ సభకు హాజరవుతున్నందునే మేము పాల్గొనలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోకుండా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోంది.
ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సభకు బీజేపీని ఆహ్వానించడం విచారకరం. రాష్ట్ర పరిపాలన రాజధాని అమరావ తిలోనే ఉండాలనేది మా పార్టీ అభిప్రాయం. దాని కోసం జరిగే పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుంది” అని లేఖలో ప్రస్తావించారు.
సభకు బీజేపీని ఆహ్వానించడం విచారకరం అని చెప్పడం ద్వారా పరోక్షంగా అమరావతి జేఏసీని కూడా తప్పు పట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతికి ద్రోహం చేసిన పార్టీనా మీరు పిలిచేదని పరోక్షంగా జేఏసీని తాము నిలదీసినట్టు సీపీఎం నేతలు చెబుతున్నారు.
ఇదే మరో వామపక్ష పార్టీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాత్రం హాయిగా సభకు హాజరయ్యారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర బీజేపీ పేర్కొంటున్నా కేంద్రం మాత్రం ముందుకు రావడం లేదన్నారు. దీనిపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన కోరారు.
ఎవరి కోసం సీపీఐ దాగుడుమూతలు ఆడుతున్నదో అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోసం చివరికి బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికైనా సిద్ధపడిన సీపీఐని చూస్తే జాలి కలగకమానదు.