క్ష‌మించ‌రాని నేరం

కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే మ‌హ‌మ్మారి క‌రోనా విజృంభ‌ణ‌కు ఊత‌మిచ్చింది. క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతిపై ముంద‌స్తు హెచ్చ‌రిక చేసినా …కేంద్ర ప్ర‌భుత్వం ఖాత‌రు చేయ‌లేదు. దీంతో దేశ ప్ర‌జానీకం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి…

కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే మ‌హ‌మ్మారి క‌రోనా విజృంభ‌ణ‌కు ఊత‌మిచ్చింది. క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతిపై ముంద‌స్తు హెచ్చ‌రిక చేసినా …కేంద్ర ప్ర‌భుత్వం ఖాత‌రు చేయ‌లేదు. దీంతో దేశ ప్ర‌జానీకం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. క‌మిటీ ఏర్పాటు చేయ‌డంలో ఉన్న శ్ర‌ద్ధ‌, అది ఇచ్చే మార్గ‌ద‌ర్శ‌కాలను అనుస‌రించి అప్ర‌మ‌త్తం కావ‌డంపై కేంద్రం దృష్టి సారించ‌లేదు.

క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మైంది. ఇందులో భాగంగా కరోనా నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించే క్ర‌మంలో ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఏడుగురు నిపుణులతో ‘నేషనల్‌ కొవిడ్‌-19 సూపర్‌ మోడల్‌ కమిటీ’ని నియమించింది. 

ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్రొఫెసర్‌ ఎం.అగర్వాల్, వెల్లూర్‌ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ వైరాలజీ ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ తదితరులున్నారు. ఇప్పటికీ ఈ క‌మిటీ మనుగడలో ఉంది.

రాబోయే విప‌త్తును ఈ క‌మిటీ ఎంతో ముందుగానే ప‌సిగ‌ట్టింది. రెండో దశ వ్యాప్తిపై మార్చి 9న ఈ కమిటీ కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. నివేదిక ఇచ్చే నాటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కేరళలో సెకెండ్ వేవ్ ప్రారంభ‌మైంద‌ని , కావున యుద్ధ‌ప్రాతిప‌దిక‌న క‌ట్ట‌డి చర్యలు తీసుకోకుంటే దేశమంతా విస్త‌రిస్తుంద‌ని క‌మిటీ హెచ్చరించింది. అంతేకాదు, మే నెల ప్రారంభానికి రోజువారీ కేసులు 3.8 లక్షల నుంచి 4.4 లక్షలకు చేరుకుంటాయని మార్చి 9నే తేల్చి చెప్పింది.

అలాగే మే నెల‌ మధ్యకాలానికి యాక్టీవ్‌ కేసుల సంఖ్య 33-35 లక్షలకు చేరుతాయని అంచనా వేసింది. అలాగే మే నాటికి రోజు వారీ కేసులు 4 లక్షలకు చేరుతాయని అంచ‌నా వేసింది. క‌మిటీ నాడు ఏ హెచ్చ‌రిక‌లు చేసిందో, ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. అయితే హెచ్చ‌రిక‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. 

తాను వేసిన క‌మిటీ ఇచ్చిన నివేదిక‌నే కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల అంతిమంగా ప్ర‌జ‌లు బ‌లి ప‌శువులు అవుతున్నారు. తెలియ‌క త‌ప్పు జ‌రిగితే క్ష‌మించొచ్చు. కానీ నిపుణుల‌తో కూడిన క‌మిటీ మ‌హ‌మ్మారి విశృంఖ‌ల‌త్వంపై హెచ్చ‌రించినా ప‌ట్టించుకోని అల‌స‌త్వాన్ని దేశ ప్ర‌జానీకం ఎప్ప‌టికీ క్ష‌మించ‌ద‌ని దేశ భ‌క్తి పార్టీగా జ‌బ్బ‌లు చ‌రుచుకునే బీజేపీ గుర్తించాలి.