కరోనా అన్నది ఎవ్వరినీ వదలడం లేదు. ఎటొచ్చీ బీదా, గొప్పా అన్న తేడా మాత్రం వైద్యం దగ్గర వుంటుంది. కాస్త డబ్బులు ఎక్కువ వుంటే సకాలంలో అన్నీ అమరుతాయి.
లేదూ అంటే ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అన్నట్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరగాలి. ఒక్కోసారి డబ్బున్నా కూడా సకాలంలో వైద్యం దొరక్కపోవచ్చు. అందుకే ఓ బడా నిర్మాత ఓ టాప్ ఆసుపత్రిలో పర్మనెంట్ గా ఓ సూట్ రూమ్ బుక్ చేసేసుకున్నారట.
ఆ మధ్య కరోనా పాజిటివ్ రాగానే ఏ ఇబ్బంది లేకపోయినా, వెళ్లి ఆ సూట్ రూమ్ లోనే కొన్నాళ్లు వుండి వచ్చారు. ఫైవ్ స్టార్ సదుపాయాలు అన్నీ వుండే ఆ సూట్ రూమ్ ను తన ఫ్యామిలీ మెంబర్ల కోసం కొన్నాళ్ల పాటు వుంచేసుకుని, పేమెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తనకు బాగా కావాల్సిన వారికి అవసరంమైతే ఆ రూమ్ ఇప్పిస్తారు. లేదా ఆసుపత్రి వర్గాలు ఆ నిర్మాత అనుమతి తీసుకుని ఎవరికైనా ఇస్తాయి.
కరోనా తగ్గుముఖం పట్టేవరకు ఆ ఫైవ్ స్టార్ సూట్ రూమ్ ఆ నిర్మాత ఆధీనంలో వుంటుంది. బిల్లులు లక్షల్లో వచ్చినా ఆయన కట్టుకుంటారు. డబ్బు ఇచ్చే సదుపాయాలే వేరు కదా?