ఈవారం ట్రేడ్ టాక్.. కలెక్షన్లకు కరోనా

అసలు ట్రేడ్ లేనప్పుడు టాక్ ఎక్కడ్నుంచి వస్తుంది. నిజమే.. టాలీవుడ్ బాక్సాఫీస్ లో చప్పుడు లేదు. సందడి మచ్చుకైనా కనిపించలేదు. వకీల్ సాబ్ రిలీజైన ఆ 3 రోజులు, మధ్యలో ఉగాదికి తప్పిస్తే.. మిగతా…

అసలు ట్రేడ్ లేనప్పుడు టాక్ ఎక్కడ్నుంచి వస్తుంది. నిజమే.. టాలీవుడ్ బాక్సాఫీస్ లో చప్పుడు లేదు. సందడి మచ్చుకైనా కనిపించలేదు. వకీల్ సాబ్ రిలీజైన ఆ 3 రోజులు, మధ్యలో ఉగాదికి తప్పిస్తే.. మిగతా నెలంతా బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్దమే కదా.

వకీల్ సాబ్ గురించి చెప్పుకోడానికేం లేదు. దాని ఫైనల్ రన్ రెండు వారాల కిందటే పూర్తయింది. నిర్మాతలు మాత్రం గత వారం వరకు నడిచిందంటారు. పోనీ దానికే ఫిక్స్ అయినా వసూళ్లు మాత్రం నిల్. ఇక ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది కాబట్టి థియేట్రికల్ రన్ గురించి మాట్లాడుకోవడం కామెడీగా ఉంటుంది.

ఓవైపు వకీల్ సాబ్ ఎత్తేయడం, ఇంకోవైపు కరోనా కల్లోలం వల్ల థియేటర్లు మూతపడడం ఒకేసారి జరుగుతున్న టైమ్ లో కూడా 2 సినిమాలు రిలీజయ్యాయి. వాటి పేర్లు శుక్ర, కథానిక. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలు రిలీజయ్యాయనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక వసూళ్ల ప్రస్తావన ఎక్కడ్నుంచి వస్తుంది?

ఇక ఈ నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ.. ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ అనే మరో చిన్న సినిమా కూడా (30వ తేదీన) విడుదలైంది. ఇలా ఈవారం ట్రేడ్ అంతా స్తబ్దుగా సాగింది. కరెంట్ బిల్లు కాదు కదా, కనీసం సమోసాల డబ్బులు కూడా థియేటర్లకు రాలేదు. తెలంగాణలో చెప్పి మరీ థియేటర్లు మూతపెడితే.. ఆంధ్రాలో చెప్పకుండా థియేటర్లు మూతపడుతున్నాయి. ఈవారం జరిగిన కీలక పరిణామం ఇదే.