కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. దీనికి అనేక కారణాలు తోడైనట్టే కనిపిస్తోంది. తాజాగా కర్నాటక మినీ పురపాలక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడమే … ఆ పార్టీ చీకటి వైపు పయనిస్తుందనేందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా అధికార పార్టీనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తుంటుంది. కానీ కర్నాటకలో అందుకు పూర్తి రివర్స్. కర్నాటక మినీ పురపాలక పోరులో అధికార బీజేపీని కాంగ్రెస్ మట్టి కరిపించి శ్రేణులకు భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేసింది.
కర్నాటకలో బళ్లారి కార్పొరేషన్, ఐదు నగర సభ, రెండు పురసభ, రెండు పట్టణ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాలు అధికార పార్టీకి షాక్ ఇచ్చాయి.
బళ్లారితో పాటు మూడు నగర సభ, రెండు పట్టణ పంచాయతీలు, ఓ పురసభ స్థానా లను కాంగ్రెస్ కైవసం చేసుకుని విజయదుందుభి మోగించింది. ఓ నగర సభ, మరో పురసభలో జనతాదళ్ సత్తా చాటింది. కేవలం మడికెరి నగర సభలోనే అధికార పార్టీ బీజేపీ గెలుపొందడం గమనార్హం.
జనతాదళ్ -కాంగ్రెస్ అధికార కూటమిని చీల్చి బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ అధికార పీఠంపై కూచున్నందుకు భవిష్యత్‌లో తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని తాజా ఘోర పరాజయం హెచ్చరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ చెప్పుకోతగ్గ విజయాలను నమోదు చేసుకోలేదని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. మరో 24 గంటల్లో వాటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమైతే …దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రాభవం మసకబారుతోందని చెప్పక తప్పదు.