ఇప్పుడు 50 రోజులు సినిమా ఆడితే మహాగొప్ప. ఇక వంద రోజుల సినిమా ఫంక్షన్ అనే మాటే మరిచిపోయి చాలా కాలమైంది. మహాగొప్ప సినిమా అయితే తప్ప …100 రోజుల వేడుక జరుపుకునే అవకాశం రాదు. కాలంతో పాటు చాలా మార్పులొచ్చాయి. ఈ మార్పులకు రంగుల ప్రపంచమైన సినిమా అతీతమేమీ కాదు.
కానీ ఓ సినిమా 500 రోజులను కూడా పూర్తి చేసుకుంది. నిజంగా ఆ సినిమా పేరు భ్రమరావతి ఉద్యమం అని గిట్టని వాళ్లు అంటుంటారు. కానీ తమది అమరావతి పరిరక్షణ ఉద్యమమని నచ్చిన వాళ్లు చెబుతుంటారు. ఏది ఏమైనా మొత్తానికి అమరావతి పరిరక్షణ ఉద్యమానికి 500 రోజులు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని పర్చువల్ సభ నిర్వహించారు. ఇందులో అమరావతిలోనే పరిపాలన రాజధాని కొనసాగాలని ఆకాంక్షిస్తున్న వాళ్లంతా పాల్గొన్నారు.
కానీ ఓ ముఖ్యమైన వ్యక్తి, టాలీవుడ్ అగ్రహీరో ఈ ఫంక్షన్‌లో పాల్గొనకపోవడం వెలతిగా కనిపిస్తోంది. ఇంతకూ అమరావతి విష యమై వకీల్‌సాబ్‌లో మార్పు వచ్చిందా? లేక మరేదైనా కారణమా? అనే చర్చకు … ఆయన గైర్హాజరు తెరలేపింది. పర్చువల్ సభకు హాజరైన వాళ్లెవరో తెలుసుకుంటే, డుమ్మా కొట్టిన ఆ అగ్రహీరో ఎవరో ఇట్టే అర్థమవుతుంది.
పర్చువల్ సభకు వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న ముఖ్యుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.గోపాల రావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ ఉన్నారు.
వీరిలో జనసేనాని, టాలీవుడ్ అగ్రహీరో పవన్‌కల్యాణ్ లేకపోవడం సహజంగానే చర్చకు దారి తీసింది. మొదటి నుంచి అమరావతిలోనే రాజధాని ఉండాలని పవన్‌కల్యాణ్ బలమైన వాణి వినిపిస్తున్నారు. అలాంటి నాయకుడు కీలకమైన 500 రోజుల ఫంక్షన్‌కు రాకపోవడం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. పవన్ రాకపోవడానికేమైనా లెక్క ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సొదుం రమణ