విశాఖకు సినీ కళ వస్తుందా. రెండవ టాలీవుడ్ గా వైజాగ్ స్థిరపడుతుందా అన్న దాని మీద చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఆ మాటకు వస్తే మూడు దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయినపుడే కొందరు విశాఖ బెస్ట్ అని సూచించారు.
అయితే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రాయితీలతో పాటు భూములు కేటాయించి తెలుగు పరిశ్రమను భాగ్యనగరానికి తెచ్చింది.
ఇక విశాఖను సినీ రాజధానిగా చేయాలని నాటి నుంచి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. వైఎస్సార్ టైమ్ లో కూడా విశాఖలో కొంత కదలిక వచ్చింది. ఇపుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖను ఏకంగా పరిపాలనా రాజధానిగా చేశారు.
దాంతో పాటు రెండవ టాలీవుడ్ గా చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపధ్యంలో విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ కి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కేటాయించడమే కాకుండా అనుమతులు కూడా మంజూరు చేసింది.
తొందరలోనే ఆ నిర్మాణం పనులు మొదలవుతాయని అంటున్నారు. ఈ కల్చరల్ సెంటర్ కనుక వస్తే విశాఖకు తెలుగు సినిమాతో కనెక్టివిటే ఇంకా బాగా పెరుగుతుంది అంటున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా ఒక స్టూడియో తాను స్వయంగా నిర్మిస్తుంది అంటున్నారు. అలాగే విశాఖ తరలివచ్చేవారికి కూడా భూములు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.