జగన్ సర్కార్ కు మే 3 వరకు గడువు

జగన్ సర్కార్ కు మే 3వ తేదీ వరకు గడువు విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో, వాయిదా బాట పట్టకుండా, పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతున్న ప్రభుత్వానికి 3వ తేదీలోగా…

జగన్ సర్కార్ కు మే 3వ తేదీ వరకు గడువు విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో, వాయిదా బాట పట్టకుండా, పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతున్న ప్రభుత్వానికి 3వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

కరోనా విజృంభిస్తున్న వేళ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాల్సిందిగా కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షల నిర్వహణకు మొగ్గుచూపుతున్నట్టు తెలిపింది.

ఈ అంశంపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన హైకోర్టు.. కరోనా సోకిన విద్యార్థులకు ఎలా పరీక్షలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాళ్లను మానసిక ఒత్తిడికి గురిచేయడం సమంజసమేనా అని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా పరీక్షలు రద్దుచేశారని గుర్తుచేసిన హైకోర్టు.. ఎగ్జామ్స్ పెట్టడంపై పునరాలోచించాలని సూచించింది. తుది అఫిడవిట్ ను 3వ తేదీలోగా దాఖలు చేయాలని ఆదేశించింది.

పరీక్షల నిర్వహణకు సంబంధించి జగన్ సర్కార్ చాలా స్పష్టంగా ఉంది. ఎగ్జామ్స్ రద్దు చేయడం, అందర్నీ పాస్ చేసి పై తరగతులకు పంపించడం చాలా సులభం. కానీ అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించి, వాల్యూయేషన్ పూర్తిచేసి ఫలితాలు ఇవ్వడమే ఇప్పుడు కష్టం. ఇలాంటి కష్టతరమైన మార్గాన్నే జగన్ సర్కార్ ఎంచుకుంది. ఎందుకంటే, ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు కాబట్టి.

ఇదే విషయాన్ని కోర్టుకు స్పష్టంగా విన్నవించింది ప్రభుత్వం. పరీక్షల నిర్వహణలో అన్ని రకాల కరోనా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని కూడా చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం వాదన వైపు కోర్టు మొగ్గుచూపుతుందా లేదా అనేది మరో 3 రోజుల్లో తేలిపోతుంది.