కరోనా సెకెండ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకోవడం ఎలాగో అర్థం కాని పరిస్థితుల్లో …మరో పిడుగులాంటి వార్త. కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడొస్తుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఓ అంచనాకు రావడం గమనార్హం. కరోనా ఫస్ట్, సెకెండ్ వేవ్‌లతో దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర ప్రజానీకం నష్టపోతోంది.
ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కోడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మహారాష్ట్రలో జూలై-ఆగస్టు నెలల్లో థర్డ్ వేవ్ పంజా విసిరే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌తోపే వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సెకెండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తిని బట్టి థర్డ్ వేవ్ రాకపై అంటువ్యాధుల నిపుణులు ఈ అంచనాకు వచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రతిరోజూ నిత్యం 66 వేలకు పైగా పాజిటివ్ కేసులు, దాదాపు 700 నుంచి 800 మంది మృత్యువాత పడుతున్నారు.
ఇక థర్డ్ వేవ్ అటాక్ చేస్తే మాత్రం ఎదుర్కోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. థర్డ్‌వేవ్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ అని ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మూడో దశ వస్తుందనే అంచనాతో ఎదుర్కోడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తాలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు.