ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే … కరోనా బారినపడిన పాత్రికేయులకు సకాలంలో వైద్య సేవలందేలా నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం.
కరోనా సోకిన పాత్రికేయులకు, వైద్యారోగ్యశాఖ యంత్రాంగానికి మధ్య అనుసంధానకర్తలుగా పనిచేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక సీనియర్ అధికారిని, జిల్లాస్థాయిలో శాఖాధిపతులను నోడల్ అధికారులుగా నియమించినట్టు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
కోవిడ్ బారినపడిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆస్పత్రులలో బెడ్లు కేటాయించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తుమ్మా తెలిపారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన పాత్రికేయులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
ఈ ప్రయత్నం మంచిదే. అభినందించాల్సిందే. అయితే రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చూస్తుంటే ఓ విషయం గుర్తుకొస్తోంది. వెనుకటికెవరో తోట దగ్గరికి పోయి అమ్మా రెండు వంకాయలు ఇవ్వమని అడిగితే …లేవని చెప్పి, ఇంటి దగ్గరికొస్తే వంకాయ బజ్జీ చేసి పెడతానన్నదట. అలాగుంది పాత్రికేయులకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ చేస్తున్న సేవ.
రాష్ట్ర చరిత్రలోనే పెద్ద మొత్తంలో అక్రిడిటేషన్లు ఎగవేసిన ప్రభుత్వంగా జగన్ సర్కార్ పాత్రికేయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో పాత్రికేయులకు మొక్కుబడిగా అక్రిడిటేషన్లు కట్టబెట్టింది. దీంతో పాత్రికేయులు బస్సు పాసులు, హెల్త్‌కార్డులను కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది.
ఇదంతా జగన్ సర్కార్ చలువే. తాజాగా తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి ప్రకటించినట్టు అక్రిడి టేషన్లు ఉన్న వాళ్లు మాత్రమే లబ్ధి పొందుతారు. అసలు అక్రిడిటేషన్లే మంజూరు చేయకుండా ఇలాంటి గొప్పలు చెప్పుకునే ప్రకటనలు ఎవరిని ఉద్ధరించడానికి? అనే ప్రశ్నలు జర్నలిస్టుల నుంచి వినిపిస్తున్నాయి.
జర్నలిస్టుల శత్రు ప్రభుత్వంగా పిలుపించుకునేందుకు తహతహలాడే జగన్ సర్కార్ ….ఇలాంటి బడాయి ప్రకటనలతో పాత్రికేయులను మెప్పించలేరని గుర్తించుకోవడం మంచిది. ఏమండోయ్ విజయ్‌కుమార్‌రెడ్డి గారూ …వింటున్నారా?
సొదుం రమణ