ప్రఖ్యాత చిత్రకారుడు, నాకు సన్నిహితుడు చంద్ర ఏప్రిల్ 28న మరణించారు. ఇలస్ట్రేటర్‌గా మాత్రమే కాదు, కార్టూనిస్టుగానే కాదు, చిత్రకళలో అనేక ప్రయోగాలు చేసిన చంద్ర లైను ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. ఆయన కార్టూన్ వేసినా సరే, దానిలోని పాత్రలూ చూడచక్కగా వుంటాయి. సుందరంగా వేయడం తప్ప మరోలా వేయడం చేతకాదు, ముఖ్యంగా స్త్రీమూర్తులను అందంగా వేయడంలో ఆయన అందె వేసిన చేయి. బాలి, చంద్ర యిద్దరూ బాపుగారి లైనును అందిపుచ్చుకున్నవారే. కానీ బాపు తన ధోరణి మార్చుకుంటూ పోయారు. వీళ్లు మార్చుకోలేదు కాబట్టి నా బోటివాళ్లకు ఎప్పటికీ ఆత్మీయంగానే వుంటుంది. బొమ్మలు వేయడంతో బాటు చంద్రకు అనేక విద్యలు తెలుసు. కథారచన, ఆర్ట్ డైరక్షన్ వగైరా, వగైరా.
1946 ఆగస్టు 28న ఆయన వరంగల్ జిల్లాలో పుట్టారు. చిన్నవయసు నుంచే స్వయంకృషితో నేర్చుకుని బొమ్మలు వేశారు. కథలకు బొమ్మలు వేయడంతో ప్రారంభించి, అలా అలా తనను తాను పెంచుకుంటూ పోయారు. పుస్తకాల ముఖచిత్రాలు, పెయింటింగులు, గ్రీటింగులతో బాటు వేలాది కార్టూన్లు వేశారు. 150కు పైగా కథలు రాశారు. నాటకాల్లో నటించారు. ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. విప్లవసంఘాల ప్రచురణలకు దన్నుగా వున్నారు. సినిమా రంగంలో ఓ 20 సినిమాలకు ఆర్ట్ డైరక్షన్ చేశారు. కొన్నిటికి పబ్లిసిటీ డిజైనర్‌గా వున్నారు. రెండు, మూడు సినిమాల్లో చిన్న పాత్రలు సరదాగా వేశారు. అనేక విషయాలపై లోతైన అవగాహన పెంచుకున్నారు.
నేను రచయితగా ఎవరికీ తెలియని రోజుల్లో (అప్పటికి 4 ఇంగ్లీషు కథలు, రెండు తెలుగు కథలు రాశాను) నేను రాసిన ‘‘అచలపతి కథలు’’ను సీరియల్‌గా వేయడానికి ‘‘రచన’’ మాసపత్రిక అంగీకరించింది. పిజి ఉడ్‌హౌస్ స్ఫూర్తితో ఊస్టర్, జీవ్స్ పాత్రలను తెలుగైజ్ చేసి రాసినవి అవి. అప్పటికి మద్రాసులో వుంటూ, రమణగారితో ప్రత్యక్ష పరిచయం వుండటం చేత బాపు గారిని లోగో వేసి పెట్టమని అడిగాను. ఆయన మొదటి మూడు కథలు చదివి, నచ్చి లోగో వేసి పెట్టారు. ‘‘రచన’’వారు సురేంద్ర అనే కార్టూనిస్టు (ఇప్పుడు ‘‘హిందూ’’లో అద్భుతమైన కార్టూన్లు వేస్తున్నారు) చేత కథలకు బొమ్మలు వేయించారు. నేను 1995 జూన్‌లో బదిలీ మీద హైదరాబాదుకు తిరిగి వచ్చాను. రచన నవంబరు 1995 నుంచి ‘‘అచలపతి కథలు’’ ప్రచురణ మొదలుపెట్టింది. వాటికి చాలా పేరు రాసాగింది. కొన్ని కథలకు బొమ్మలు వేశాక 1996లో సురేంద్ర హైదరాబాదు విడిచి వెళ్లిపోయారు. అప్పుడు రచన పబ్లిషరు-ఎడిటరు శాయి గారు తన మిత్రుడైన చంద్రకు ఆ బొమ్మలు వేసే పని అప్పచెప్పారు. ఆయన ‘‘మీ పాత్రల స్వరూపస్వభావాలు చెప్పండి.’’ అంటూ నాకు ఫోన్ చేశాడు. అలా మా యిద్దరికీ పరిచయం ఏర్పడింది.
ఆయన బొమ్మలంటే నాకు చాలా యిష్టం. అప్పటికే ప్రఖ్యాతుడు. అయినా అతి సాధారణ వ్యక్తిలా నాతో వ్యవహరించడం నాకు గర్వంగా అనిపించింది. నా కథనశైలి, వస్తువైవిధ్యం ఆయనకు బాగా నచ్చాయి. ఇక నన్ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. స్వభావతః నేను సిగ్గరిని. చొరవ బాగా తక్కువ. అలాటి నన్ను మీటింగులకు పిలిచి, పదిమందికీ పరిచయం చేసి, నా గురించి గొప్పగా చెప్పిన వ్యక్తి. ఆయన ద్వారా నాకు వివిధ రంగాలకు చెందిన ఎందరో మహానుభావులు పరిచయమయ్యారు. రెండు నెలల క్రితం ఫిబ్రవరిలో రచయిత, సంపాదకుడు, అనంతపురం వాసి సింగమనేని నారాయణగారు పోయినప్పుడు చంద్రే గుర్తుకు వచ్చారు.
1995 చివర్లోనో, 1996 మొదట్లోనో హైదరాబాదులో సాహిత్య ఎకాడమీ సమావేశం జరిగినప్పుడు, ఏ ఆహ్వానమూ లేకపోయినా, రచయితలను ప్రత్యక్షంగా చూడాలనే కుతూహలంతో వెళ్లాను. చంద్ర కనబడ్డారు. అంతే, నన్ను తీసుకుని వెళ్లి అనేకమందికి ‘‘అచలపతి కథలు చదివి వుంటారు. ఇతనే ఎమ్బీయస్ ప్రసాద్’’ అని పరిచయం చేస్తూ పోయారు. సింగమనేని నారాయణ అది విని ఊరుకోకుండా ‘‘ఆంధ్రప్రభ దినపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ‘అతిథి సత్‌కారం’ అనే కథ కింద యీ పేరే వుంది. అదీ మీరే రాశారా?’ అని అడిగారు. అబ్బ, ఎంతలా గుర్తు పెట్టుకున్నార్రా అనిపించింది నాకు. ఔననగానే ‘చాలా బాగా రాస్తున్నారు. రాస్తూండండి’ అని ప్రోత్సహించారు.
ముళ్లపూడి సాహితీ సర్వస్వం మొదటి సంపుటం 2001లో విడుదలైనప్పుడు దానిలో నా ముందుమాట చూసి, ‘‘విశాలాంధ్ర కోసం ‘కథకులు-కథనరీతులు రెండో భాగం’కు సంపాదకత్వం వహిస్తున్నపుడు ముళ్లపూడి మీద కవనశర్మ గారి చేత రాయించాను. మీచేత రాయించాల్సింది.’’ అని కాంప్లిమెంటు చేశారు. ఆ సీరీస్ మూడో భాగం వచ్చినపుడు కవనశర్మగారి కథనరీతిపై నాచేత పెద్ద వ్యాసం రాయించారు. అనంతపురానికే చెందిన మరో ప్రఖ్యాత రచయిత చిలుకూరి దేవపుత్ర హాస్యకథా సంకలనం వేస్తే నన్ను మొహమాటపెట్టి దానికి ముందుమాట రాయించారు. ఇలా చంద్ర కారణంగా నాకు అనేకమంది సాహితీమూర్తులతో సాన్నిహిత్యం ఏర్పడింది.
అంతేకాదు, చంద్ర నన్ను మొహమాట పెట్టి అనేక పత్రికలకు కథలు రాయించారు. వాటికి తన బొమ్మలు జోడించేవారు. ఆయన బొమ్మల వలన ఆ కథలకు ఆకర్షణ కలిగేది. కథలో భావాన్ని చాలా చక్కగా గ్రహించేవారు. మేమిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం. మా యింటికి వచ్చేవారు, నేనూ వాళ్లింటికి వెళ్లేవాణ్ని. తొలిసారి అమెరికాలో తన చిత్రప్రదర్శన ఏర్పాటు చేసినపుడు ఇంగ్లీషులో బ్రోషర్ రాసిపెట్టమని అడిగారు, తనకు ఎంతో మంది ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు తెలిసున్నా! వాకాటి పాండురంగారావు గారు ఎ.పి.టైమ్స్ దినపత్రికలో లిటరరీ విభాగం చూసే రోజుల్లో నా చేత డైరక్టు ఇంగ్లీషు కథలు, తెలుగు కథలకు ఇంగ్లీషు అనువాదాలు చేయించేవారు. చంద్ర తన ‘‘కాకులు’’ కథను ఇంగ్లీషులో తర్జుమా చేయమని అడిగితే ‘‘క్రోస్’’ పేర చేశాను. 15 06 1997న ప్రచురితమైంది.
నేను రాసిన ఇంగ్లీషు కథలు దిల్లీ ప్రకాశన్ గ్రూపు వారి ‘‘ఎలైవ్’’లో ప్రచురితమౌతూ వుండేవి. ఆ గ్రూపుకి పలుభాషల్లో పలు ప్రచురణలున్నాయి. వాళ్ల ఆర్టిస్టులు వేసే బొమ్మలు కాస్త ఎమెచ్యూరిష్‌గా అనిపించేది నాకు. సోఫిస్టికేటెడ్‌గా వుండే చంద్ర గీతను వాళ్లకు పరిచయం చేస్తే ఎసైన్‌మెంట్స్ యిస్తారేమోనని, నేను ఓ కథ రాసి దానికి చంద్ర చేత బొమ్మ వేయించి పంపాను. తీరా చూస్తే కథ రిజెక్ట్ అయింది. కథ తిరక్కొట్టినా యీయన్ని ఆర్టిస్టుగా పెట్టుకోండి అని సిఫార్సు చేసినా వాళ్లు చంద్రను సంప్రదించలేదు. ఇలా ఎన్నో అనుభవాలు. ఆర్టిస్టుగానే కాక, వ్యక్తిగా కూడా చంద్ర ఒక విలక్షణమైన వ్యక్తి కావడంతో రచయితలు, సంపాదకుల మధ్య ఆయన చర్చనీయాంశమైన అంశమై పోయాడు.
ప్రబంధకావ్యాల్లో తప్పనిసరిగా వుండవలసిన లక్షణాల్లో చంద్రోపాలంభనం ఒకటి. కథానాయకుణ్ని చూశాక, కథానాయిక యింటికి వచ్చి, విరహబాధ పడుతుంది. వెన్నెలతో తన విరహాన్ని పెంచుతున్న చంద్రుణ్ని నిందిస్తుంది. అలాటివాడివి, యిలాటివాడివి అంటూ ఎత్తిపొడుస్తుంది. అలాగే రచయితలు, సంపాదకులు, ప్రచురణకర్తలు అందరూ చంద్రోపాలంభనానికి పాల్పడినవారే. ఎందుకంటే ఆయనకు డిసిప్లిన్ లేదు. తలచుకుంటే గబగబా బోల్డు పని చేసేయగలడు. లేకపోతే ఏళ్ల తరబడి నానబెట్టగలడు. అలవికాని, తలకు మించిన పనులు నెత్తిన పెట్టుకుంటాడు. మాట తప్పుతాడు. ఆ విషయంలో చంద్రను తిట్టకుండానూ వుండలేం, ప్రేమించకుండానూ వుండలేం.
ఆయన షష్టిపూర్తి సభకు హాజరయ్యాను. అమెరికా వెళ్లి పిల్లల దగ్గర అక్కడే స్థిరపడిపోతానన్నారు. సప్తతి ఉత్సవానికి ఇండియాలో ఉన్నారు. ఆ సందర్భంగా 2016 ఆగస్టులో కొందరు ఆత్మీయులు కలిసి ‘ఒక చంద్రవంక’ పేరుతో ఒక అభినందన సంచిక వేశారు. నన్నూ ఓ వ్యాసం రాయమన్నారు. ‘‘ఈ చంద్రుడికి ఎన్ని కళలో!’’ అనే మకుటంతో రాసిన ఆ వ్యాసం కింద యిస్తున్నాను –
‘చంద్ర’లో చాలా విద్యలున్నా చిత్రకారుడిగా ఎక్కువ ప్రసిద్ధుడు. ఆయన చిత్రకళానైపుణ్యం గురించి వ్యాఖ్యానించే కౌశలం నాకు లేదు. బొమ్మలు చూసి ఆనందించేవాడిగా చెప్పాలంటే – ఆయన బొమ్మలు నాకు బాగా నచ్చుతాయి. నా కథల్లో చాలావాటికి ఆయన వేశాడు. సాంప్రదాయక చిత్రాల దగ్గర్నుంచి అత్యంత ఆధునిక చిత్రాల దాకా అన్ని రకాలూ వేయగలడు. ఆ ఆధునికాల్లో కొన్ని బోధపడతాయి, కొన్ని ..పడవు. కథకు ఇలస్ట్రేషన్ వేసినప్పుడు కూడా వ్యక్తుల హావభావాలతో బాటు చుట్టూ ఆకులు, కాయలు, పిందెలు, లతలు ఏవేవో వేసి అలంకరిస్తారు. వాటిల్లో చాలా గూఢార్థాలు వుంటాయని లోదృష్టి కలవారు అంటూంటారు. అదో ‘డావిన్చీ కోడ్’. ఆయన కార్టూన్లు కూడా కొన్ని అర్థమవుతాయి, మరి కొన్ని ఫారిన్ కార్టూన్లలా తోచి బుర్ర వేడెక్కిస్తాయి. దీనికి కారణమేమిటంటే చంద్ర మన మధ్య వుంటూ, మామూలు వ్యక్తిలా నటిస్తూనే దేశవిదేశాల కళారూపాలన్నీ అధ్యయనం చేసేస్తూంటారు, అవి మనకు పరిచయం చేద్దామని తాపత్రయ పడతాడు. మనమింకా ఆ స్థాయికి ఎదగకపోవడం చేత తికమక పడతాం.
చెప్పానుగా, ఆయన బొమ్మల గురించి వ్యాఖ్యానించడం రాదని. ‘ఆయన జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడు… మన మధ్య పుట్టడం ఆయన దురదృష్టం, మన అదృష్టం… ఆయన శైలిలో మరొకరి శైలి దాగుంది…, ఇద్దరు ముగ్గుర్ని కలిపి రుబ్బితే చంద్ర తయారవుతాడు..’ యిలాటి పరిశీలనలు చేయడం నా వల్ల కాదు. అందువలన రెండు దశాబ్దాల స్నేహాన్ని పురస్కరించుకుని వ్యక్తిగత విషయాలు రాస్తాను. చంద్రలో కొట్టవచ్చేట్టు కనబడే లక్షణం – స్నేహం. అతి సులభంగా అల్లుకుపోగలడు. అవతలివాడు పరిచయస్తుడా, కాదా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా, గొప్పా, బీదా, ఔత్సాహికుడా, సీనియరా, ప్రఖ్యాతుడా, అనామకుడా, వాడితో అవసరం యిప్పుడుందా, రేపు పడుతుందా లాటి లెక్కలేమీ వేసుకోడు. ఎవరైనా మంచి కథ రాసినా, బొమ్మ వేసినా, సినిమా తీసినా, మరో మంచి పని చేసినా వెళ్లి పరిచయం చేసుకుని అభినందించి, ప్రోత్సహించే రకం.
నేను రాసిన ‘‘పొగబోతు భార్య’’ హాస్యకథాసంకలనం అంకితం యిస్తూ రాసిన వాక్యాలివి – ‘‘ఈ పుస్తకాన్ని ప్రముఖ చిత్రకారులు, కథకులు, బహుముఖ ప్రజ్ఞావంతులు చంద్రగారికి అంకితం యిస్తున్నాను. నేను 1996లో ‘రచన’ ‘ఆంధ్రజ్యోతి వీక్లీ’లలో కథలు రాసేటప్పుడు సంపాదకులు చంద్రగారిచేత బొమ్మలు వేయించేవారు. ఆ విధంగా వారితో ప్రత్యక్ష పరిచయం జరిగింది. నా కథలను ఆయన మెచ్చుకోవడంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎందుకంటే వృత్తిరీత్యా ఆయన రోజుకి 10, 15 కథలు చదువుతారు. ఆయన నా కథలను మెచ్చారంటే వాటిలో ఎంతోకొంత విషయం వుండే వుంటుంది అనిపించింది నాకు. తత్ఫలితమే 1996 నుండి నేను విస్తారంగా రాయడం! పైగా చంద్రగారు నన్ను అందరివద్దకూ తీసుకెళ్లి పరిచయం చేసి నన్ను ‘ప్రొజెక్టు’ చేసేవారు. సంపాదకులకు సిఫార్సు చేసేవారు. మరిన్ని కథలు రాయమని యిప్పటికీ నన్ను ప్రోత్సహిస్తారు. అదీ ఈ అంకితానికి కారణం!’’ అని.
నేను అక్షరరూపం యిచ్చిన భావాలు చాలా మంది రచయితల్లో, చిత్రకారుల మనసుల్లో వున్నవే. ఆయనకు అక్కరలేని విషయం లేదు, అక్కరలేని మనిషి లేడు. పుస్తకాలు, బొమ్మలు, సినిమాలు, కథలు, క్రికెట్, ప్రజా ఉద్యమాలు… యిలా ఏదీ వదలడు. అలాగే ఎవర్నీ వదలడు. ఫోన్ చేస్తే గంటల తరబడి మాట్లాడగలడు. వ్యక్తిగతమైన స్నేహాలకు చాలా విలువ నిచ్చి, యింటికి వస్తూ పోతూ వుంటాడు. ఈయన కింత టైము ఎలా వుంటుందాన్న ఆశ్చర్యం వేస్తూంటుంది. ఈ టైములో నాలుగు బొమ్మలు వేసుకుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు కదాన్న ఆలోచన ఎందుకు రాదాన్న చింతా కలుగుతుంది.
బొమ్మలు వేయడమంటే గుర్తుకు వచ్చింది. చంద్ర గొప్ప అరాచకవాది, రాజ్యమూ ఆయనదే, తిరుగుబాటూ ఆయనదే అని అందరూ అంటారు. ఆయన్ను చూడగానే ‘మెథడ్ యిన్ మ్యాడ్‍నెస్’ అందామా, ‘మ్యాడ్‍నెస్ యిన్ మెథడ్’ అందామా అని సందేహంలో పడుతూ వుంటాను. రమణగారు అప్పారావు గురించి రాశారు – ‘అప్పారావు ఒక మనిషితో పది నిముషాలపాటు మాటాడి కూడా దమ్మిడీ అప్పు అడక్కుండా వెళ్లిపోయి యెదటివాణ్ణి చితక్కొట్టేసిన సందర్భాలున్నట్టు చరిత్రలో దాఖలాలున్నాయి. పదినిముషాలూ మాటాడి కేవలం ఒక్క దమ్మిడీయే అప్పుచ్చుకు అవతలివాణ్ణి చితగ్గొట్టేసిన రోజులూ వున్నాయి. అతను యెప్పుడు యెవర్ని యెంత అడుగుతాడో, యెవరి దగ్గర యెంత ఎలా పుచ్చుకు చక్కాపోతాడో అతనికే తెలియాలి. అతనికీ తెలియదేమో గూడా. ఆ ఋణలీల మనకి అర్థం గాదు.’ అని.
చంద్ర చిత్రలీలా యింతే! ఒక్క బొమ్మ వేస్తానని ఏడాది వాయిదా వేసిన సందర్భాలూ వున్నాయి. ఆర్నెల్ల దాకా ఖాళీ లేదని చెప్పి ఓ యిరవై బొమ్మలు రాత్రికి రాత్రి వేసి యిచ్చేసిన ఘట్టాలూ వున్నాయి. అవేళ కచ్చితంగా యిస్తానన్న కవరు పేజీ పుచ్చేసుకుని, అట్నుంచి అటే ప్రెస్‍కి వెళ్లిపోదామని వాళ్లింటికి వెళితే దివాను మీద పడుక్కుని తాపీగా టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ, మనకేసి ఓ చూపు పడేసి ‘బొమ్మ కాలేదు’ అని చులాగ్గా, కొంటెగా నవ్వేయగల ఘనుడాయన. కడుపుమండి మనం తిట్టినా ఏమీ అనుకోడు, మనసులో పెట్టుకోడు. ఆయన అమాయకుడిలా, బోళా మనిషిలా కనబడతాడు, హాయిగా నవ్వుతాడు. కానీ లౌక్యుడే. ఎవరు ఎటువంటి వాళ్లో కచ్చితమైన అంచనా వుంది. నచ్చినవాళ్ల కోసం ఎలాటి కన్సిడరేషన్లూ చూసుకోకుండా సాయపడతాడు. నచ్చనివాళ్లకు ఆ ముక్క మొహం మీద చెప్పడనుకుంటా.
బొమ్మలు వేసేవాడికి ఊహాశక్తి అవసరమే. అయితే చంద్ర ఊహలు బొమ్మల పరిధిని దాటి, ఎక్కడెక్కడికో వెళ్లిపోతాయి. ఎన్నో ప్రాజెక్టులు ప్లాను చేస్తాడు. కథాసంకలనం వేద్దామంటాడు, ఇంగ్లీషులోకి అనువాదం చేయిద్దామంటాడు, పత్రిక నడుపుదామంటాడు, ఆర్టు స్కూలు పెడదామంటాడు, సినిమాలు తీద్దామంటాడు, డైరక్టు చేద్దామంటాడు, ఆర్ట్ మ్యూజియం అంటాడు, ప్రజల్లో చైతన్యం తెద్దామంటాడు, వాళ్లెవరికో సాయం చేద్దామంటాడు, మరోటంటాడు. ఒక వ్యాపకం కాదు, ఒక లంపటం కాదు. అసలు చంద్రుడికి పదహారు కళలుంటే యీ చంద్రుడు యింకో నాలుగు ఎక్కువ చదివాడు. వాటితో బాటు కళాకళలూ ఎక్కువే. మూడ్ బట్టి కొత్త ప్లాను ఫోకస్ లోకి వచ్చి పాత ప్లాను మూలపడుతుంది. ఈ గందరగోళమే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూందనుకుంటాను. 70 ఏళ్లు నిండాయి కాబట్టి చంద్ర యిప్పటికైనా తాను చేయగలిగినవేమిటో, చేయలేనివేమిటో చప్పున తేల్చేసుకుని రెండు మూడు లక్ష్యాలు మాత్రమే పెట్టుకుంటే ఆయన ఆరోగ్యంగా, చురుగ్గా వుంటారని నా బోటి స్నే-హితుల ఆశ.’
చంద్రను వ్యక్తిగతంగా తెలిసున్నవాళ్లకు దీనిలో స్వారస్యం బాగా బోధపడుతుంది. ఆయనకు నచ్చింది. నన్ను కాచివడపోశారంటూ మెచ్చుకున్నారు. ఆయనకు అనారోగ్య సమస్యలున్నాయి. ఇండియాకు తిరిగి వచ్చేసి యిక్కడే వుంటున్నారు. గత మూడేళ్లగా అస్వస్థుడిగానే వున్నారు. ఆయనకూ, నాకూ కామన్ ఫ్రెండ్, ప్రముఖ కార్టూనిస్టు అయిన ఎం. ఎస్. రామకృష్ణ, నేనూ చంద్ర అనారోగ్యం గురించి బాధపడుతూండేవాళ్లం. ఇంతలో 2020 డిసెంబరులో రామకృష్ణ పోయారు. ఇప్పుడు చంద్ర. మధ్యలో సింగమనేని. బాధగా వుంది. ఆత్మీయుడు, అత్యంత ప్రతిభావంతుడు ఐన యిదే నా అశ్రు అంజలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2021)