మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు బలమైన పోటీదారు డొచ్చారు. లోకేశ్ అప్రమత్తం కాకపోతే మాత్రం …టెన్త్, ఇంటర్ పరీక్షల పోరాటం హైజాక్ అయ్యేలా కనిపిస్తోంది.
కరోనా సెకెండ్ వేవ్ పుణ్యమా అని లోకేశ్‌కు జగన్ సర్కార్ చేతినిండా పని కల్పించింది. కరోనా సెకెండ్ వేవ్‌ను పరిగణలోకి తీసుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని లోకేశ్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
ఈ విషయమై లోకేశ్, జగన్ సర్కార్ మధ్య డైలాగ్ వార్ కూడా నడుస్తోంది. సందట్లో సడేమియా అన్నట్టు వీళ్ల మధ్యలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ జొరబడ్డారు. లోకేశ్ ఏకంగా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే, కేఏ పాల్ మాత్రం కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
టెన్త్ పరీక్షలను రెండు నెలలు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో నిరాహారదీక్ష కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని, లేదంటే లక్షలాది విద్యార్థులు, వారి కుటుంబీకులు కరోనా బాధితులుగా మారే ప్రమాదం ఉందని న్యాయస్థానంలో కేసు వేసినట్టు చెప్పారు.
దేశంలో కుంభమేళా నిర్వహణకు అనుమతించడంతోనే 35 లక్షల మంది వచ్చారని, ఫలితంగా గ్రామాలకు వైరస్ విస్తరించిందని ఘాటు ఆరోపణలు చేశారు. అలాగే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వల్ల పరిస్థితి చేయి దాటిందన్నారు. మొత్తానికి లోకేశ్‌కు బలమైన ప్రత్యర్థి దూసుకొచ్చారని చెప్పక తప్పదు.