సత్తా ఉన్న దర్శకుడ్ని కోల్పోయిన కోలీవుడ్

నిజంగా కోలీవుడ్ కు షాక్ ఇది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్ మృతిచెందారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు.…

నిజంగా కోలీవుడ్ కు షాక్ ఇది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్ మృతిచెందారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు.

ఓ సాధారణ స్టిల్ ఫొటోగ్రాఫర్ స్థాయి నుంచి కోలీవుడ్ మెచ్చిన దర్శకుడిగా ఎదిగారు కేవీ ఆనంద్. రొటీన్ కాన్సెప్టులు ఎంచుకోవడం ఆయనకు చేతకాదు. కొత్త కథల్లోనే కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి చూపించడం ఆయన పంథా. రంగం, బ్రదర్స్, వీడొక్కడే లాంటి సినిమాలు ఆయన అభిరుచిని తెలుపుతాయి. ఆయన తీసిన చివరి సినిమా సూర్య హీరోగా నటించిన బందోబస్త్.

చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చేసిన కేవీ ఆనంద్ కు ఆ టైమ్ లో ఫొటోగ్రఫీపై ఇష్టం పెరిగింది. ఆ రోజుల్లో ఆయన తీసిన ఎన్నో ఫొటోలు వివిధ మ్యాగజైన్స్ లో పాపులర్ అయ్యాయి. ఇండియా టుడే లాంటి పత్రికలకు ఆయన ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆ టైమ్ లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు.

ఫొటోగ్రఫీ నుంచి సినిమాటోగ్రఫీ వైపు ఆయన మనసు మళ్లింది. వెంటనే వెళ్లి పీసీ శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయిపోయారు. అప్పటికే ఉన్న అసిస్టెంట్లలో ఆఖరి వాడిగా జాయిన్ అయినప్పటికీ కేవీ ఆనంద్ లో ఉన్న టాలెంట్ ను పీసీ శ్రీరామ్ గుర్తించారు. అలా ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఓ మలయాళం సినిమాకు తొలిసారిగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం అందుకున్న కేవీ ఆనంద్.. తన తొలి సినిమాతో ఏకంగా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు.

తమిళ్ లో ఆయన చేసిన మొదటి సినిమా ప్రేమదేశం. ఈ సినిమాలో కేవీ ఆనంద్ వర్క్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చెన్నైలోని ఎన్నో రొటీన్ లొకేషన్లను కేవీ ఆనంద్, ఈ సినిమాలో అద్భుతంగా చూపించి అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు, బాయ్స్, శివాజీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అలా డీవోపీగా 15 సినిమాలకు వర్క్ చేశారు. 

రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమానే సినిమాటోగ్రాఫర్ గా ఆయన చివరి చిత్రం. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. డైరక్టర్ గా 7 సినిమాలు తీశారు. వీటిలో కేవీఆనంద్ కు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా రంగం. పొలిటికల్ బ్యాక్ డ్యాప్ కు థ్రిల్లర్ జానర్ మిక్స్ చేస్తూ తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది.

తన ప్రతి సినిమాతో దాదాపు ఏదో ఒక అవార్డు అందుకున్నారు కేవీ ఆనంద్. తెలుగులో ఆయన చేసిన ఒకే ఒక్క స్ట్రయిట్ మూవీ పుణ్యభూమి నాదేశం. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు కేవీ ఆనంద్.