హోం ఐసొలేషన్.. కేంద్రం కీలక సూచనలు

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్న పేషెంట్స్ కంటే, హోం ఐసొలేషన్ లో ఉంటున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వాళ్ల కోసం కేంద్రం సవరించిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది.…

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్న పేషెంట్స్ కంటే, హోం ఐసొలేషన్ లో ఉంటున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వాళ్ల కోసం కేంద్రం సవరించిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. గతేడాది హోం ఐసొలేషన్ కోసం జారీచేసిన గైడ్ లైన్స్ కు అదనంగా మరికొన్ని సూచనలు చేసింది.

కరోనా సోకి స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు లేదా అస్సలు లక్షణాలు లేని వాళ్లు మాత్రమే హోం ఐసొలేషన్ లో ఉండాలని చెప్పిన కేంద్రం.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారడం లాంటి సమస్యలు ఉన్నవాళ్లను స్వల్ప శ్రేణి లక్షణాలున్న కరోనా పేషెంట్లుగా విభజించింది. వీళ్లంతా ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండొచ్చని తెలిపింది.

60 ఏళ్లు పైబడి బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు మాత్రం వైద్యుల సూచన మేరకు ఐసొలేషన్ లో ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. హెచ్ఐవీ, ట్రాన్స్ ప్లాంటేషన్, కాన్సర్ లాంటి సమస్యలున్నవాళ్లు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఐసొలేషన్ లో ఉండొద్దని సూచించింది.

ఇక దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఎదుర్కొంటున్న రెమెడివిజర్ ఇంజెక్షన్ పై కూడా కీలక ఆదేశాలు జారీచేసింది. హోం ఐసొలేషన్ లో ఉన్న రోగులు ఈ ఇంజక్షన్ తీసుకోవద్దని సూచించింది. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, హాస్పిటల్ కు వచ్చి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలని ఆదేశించింది. చాలామంది ముందుజాగ్రత్త చర్యగా ఈ ఇంజెక్షన్ ను ఇంట్లో ఉంచుకుంటున్నారు. 

మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా కూడా పెరిగిపోవడంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలు కనిపించిన తర్వాత 3 రోజులైనా జ్వరం తగ్గకపోతే అప్పుడు వైద్యుల సూచన మేరకు నాన్‌ స్టిరాయిడల్‌ యాంటి ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్‌ని వాడొచ్చని సూచించింది. 

ఇక 10 రోజుల ఐసొలేషన్ పీరియడ్ తర్వాత, ఎలాంటి లక్షణాలు లేకపోతే డిశ్చార్జ్ అవ్వొచ్చని… అలా హోం ఐసొలేషన్ పూర్తిచేసుకొని డిశ్చార్జ్ అయిన వాళ్లు తిరిగి కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. తాజా గైడ్ లైన్ వల్ల టెస్టింగ్ సెంటర్లపై భారం తగ్గనుంది.